Home తాజా వార్తలు ఏమిటీ దుష్ట సంస్కృతి.. బిగ్ బాస్‌ను నిషేధించండి

ఏమిటీ దుష్ట సంస్కృతి.. బిగ్ బాస్‌ను నిషేధించండి

salman-khanన్యూఢిల్లీ: భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉన్న హిందీ బిగ్ బాస్ షోను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఘజియాబాద్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుజ్జర్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహిస్తోందని, కుటుంబ సమేతంగా చూసేందుకు ఇది పనికిరాదని ఆయన తన లేఖలో ఆరోపించారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు పూర్తి విరుద్ధంగా ఈ షో ఉందని, అత్యంత జుగుప్సాకరమైన, అశ్లీలమైన సన్నివేశాలు ఇందులో చోటుచేసుకుంటున్నాయని గుజ్జర్ విమర్శించారు. వేర్వేరు మతాలకు చెందిన జంటలను ఒకే పడక మీద భాగస్వాములను చేస్తున్నారని, ఇది అత్యంత అభ్యంతరకరమని కూడా ఆయన అన్నారు.

భారతదేశం తన పూర్వ వైభవాన్ని సాధించుకునేందుకు ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తుంటే మరో పక్క దేశ సంస్కృతిని దిగజార్చే విధంగా ఈ షోలు ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతలం కాకుండా నిరోధించేందుకు టెలివిజన్‌లో ప్రసారం కాకముందే వీటిని సెన్సార్ చేసే ఒక యంత్రాంగం ఏరాటు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పెద్దలకు మాత్రమే పరిమితమైన దృశ్యాలు పిల్లలు, మైనర్లకు కూడా అందుబాటులో ఉంటున్నాయని, టీవీలోనే కాక ఇంటర్‌నెట్‌లో కూడా ఇటువంటి షోలు పిల్లలకు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షోను వెంటనే నిషేధించాలని బ్రాహ్మణ మహాసభ కూడా డిమాండు చేసింది.

ఈ మేరకు ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. కాగా, బిగ్ బాస్ షోను నిలిపివేసేంత వరకు తిండి గింజలు ముట్టబోనని ఉత్తర్ ప్రదేశ్ నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు అమిత్ జాని ప్రకటించారు. అశ్లీలతను పెంచిపోషిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్న ఈ షోను నిలిపివేసేంత వరకు కేవలం పండ్లు, కూరగాయలు తిని బతుకుతానని ఆయన ప్రకటించారు. ఒకే మంచాన్ని వేర్వేరు జంటలు పంచుకోవడాన్ని జాతీయ ఛానళ్లలో ప్రసారం చేయడం ఆమోదనీయం కాదని, నైతిక విలువల గురించి వకాల్తా పుచ్చుకుని మాట్లాడే ఆర్‌ఎస్‌ఎస్ దీనిపై మాట్లాడకపోవడం దిగ్భ్రాంతికరమని జాని విమర్శించారు. ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షో 13వ సీజన్ ప్రసారమవుతోంది.

BJP MLA demands to ban Big Boss Show, Ghaziabad MLA Nand Kishore Gujjar wrote a letter to Union minister Prakash Javadekar demanding that the show be taken off air