Friday, April 19, 2024

సిఎఎపై బిజెపి ఎమ్మెల్యే ఫైర్

- Advertisement -
- Advertisement -

BJP

 

భోపాల్: పౌరసత్వ సవరణ చట్టానికి(సిఎఎ) వ్యతిరేకంగా మొదటిసారి ఒక బిజెపి నాయకుడు గళం విప్పారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి శాసనసభ్యుడు నారాయణ్ త్రిపాఠి సిఎఎని సవాలు చేశారు. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేయకూడదని మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన సూచించారు. తాను ఒక గ్రామం నుంచి వచ్చానని, గ్రామాలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూసి తాను మాట్లాడుతున్నానని త్రిపాఠి అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం లేదా దాన్ని చింపి విసిరేయడం ఏదో ఒకటి మనం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. మతం ప్రాతిపదికన లౌకిక దేశాన్ని విభజించరాదని మన రాజ్యాంగంలో పొందుపరిచారని, అయినప్పటికీ దేశాన్ని చీల్చివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ రాజ్యాంగాన్ని గౌరవిద్దామా లేక రాజ్యాంగ ప్రతిని చింపివేద్దామా ఏదో ఒకటి తేల్చాలని ఆయన చెప్పారు. ఆధార్ కార్డు కోసమే పల్లెలు, పట్టణాలలోని సామాన్య ప్రజలు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని, ఇక పౌరసత్వ పత్రం కోసం అనేక పత్రాలను సమకూర్చుకోవడం వారికి అసాధ్యమని త్రిపాఠి చెప్పారు.

సిఎఎతో దేశంలో అంతర్యుద్ధ వాతావరణం ఏర్పడిందని, దేశంలో ప్రజలు ఒకరినొకరు చూసుకోవడం మానుకున్నారని ఆయన అన్నారు. నిన్నటివరకు తన గ్రామంలో ముస్లిములు తనను చూసినప్పుడల్లా గౌరవంగా పలకరించే వారని, ఇప్పుడు మొహం చూడడానికి కూడా ఇష్ట పడడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశంలో అంతర్యుద్ధం ఏర్పడితే అక్కడ శాంతి నెలకొనడం అసాధ్యమని ఆయన చెప్పారు. ఒకపక్క మన దేశం వసుదైక కుటుంబకం అని చెబుతూ మరో పక్క దేశాన్ని మతాల పేరుతో చీలుస్తున్నామని, ఇక మన దేశం ఎలా అభివృద్ధి చెందగలదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి తన సొంత అభిప్రాయాలని, మీడియా ద్వారా వీటిని వ్యక్తం చేయదలచానని ఆయన ముక్తాయించారు. బిజెపిలో చేరడానికి ముందు త్రిపాఠి సమాజ్‌వాది పార్టీలో ఉన్నారు. గత ఏడాది ప్రతిపక్ష బిజెపి తిరస్కరించిన ఒక బిల్లుకు త్రిపాఠి మరో బిజెపి ఎమ్మెల్యే శరద్ కోల్‌తో కలసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.

BJP MLA speaks against CAA, BJP MLA from Madhya Pradesh Narayan Tripathi asks NDA govt to respect Constitution or Tear it away
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News