Wednesday, April 24, 2024

బిజెపికి పెరుగుతున్న సవాలు

- Advertisement -
- Advertisement -

దేశ రాజకీయాల్లో చెప్పుకోదగిన మార్పు రాగల అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకు తగిన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి, అయితే వరుసగా రెండోసారి దేశాధికారాన్ని అనుభవిస్తూ మూడోసారి కూడా కొనసాగి హ్యాట్రిక్ సాధించాలన్న ఆరాటంలో ఉన్న భారతీయ జనతాపార్టీని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడించి గద్దె దింపడానికి ఏమి చేయాలి, బిజెపి వ్యతిరేక వోటు చీలిపోకుండా వొక్క త్రాటి మీదకు తీసుకు రావడానికి జరగాల్సింది ఏమిటి? దీనికి సమాధానం సులభంగా దొరకదు. జాతీయ రాజకీయాలను కేవలం జాతీయ పార్టీలే కాకుండా ప్రాంతీయ పక్షాలు సైతం విశేషంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉంది. వాటిని కాదని కేంద్రంలో బిజెపి యేతర ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యం. అయితే 2024ఎన్నికల్లో ఇందుకు ఎటువంటి ఏర్పాటు జరగాలి? దాని సాధ్యా సాధ్యాలు ఎలాంటివి? కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఇడిని, సిబిఐని తమపై ఉసికొల్పడాన్ని సవాలు చేస్తూ14 ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఇటీవల ఆశ్రయించాయి.

సిబిఐ, ఇడి వంటి దర్యాప్తు సంస్థలు కేవలం బిజెపిని ఎదిరిస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులనే లక్ష్యంగా చేసుకొని కేసులు పెడుతున్నాయని, అటు వంటి నాయకులు ఎవరయినా బిజెపిలో చేరిపోతే ఆ కేసులను మూసి వేస్తున్నాయని అందులో ఫిర్యాదు చేశారు. 95శాతం కేసులను ప్రతిపక్ష నేతలపైనే సంధించారని పేర్కొన్నారు. ఈ కేసుల్లో అరెస్టులకు ముందు, ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు పాటించవలసిన విధి విధానాలను నిర్దేశించాలని సుప్రీం కోర్టును కోరాయి. ఈ కేసు దాఖలు చేసిన పార్టీల్లో కాంగ్రెస్‌తో బాటు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, జెడి(యు), బిఆర్‌ఎస్, ఆర్‌జెడి, సమాజ్ వాది, శివ్ సేన (-ఉద్ధవ్), నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్షాలు, డిఎంకె ఉన్నాయి. అలాగే ఇవిఎంలపై ఇసికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకోడానికి శరద్ పవార్ నాయకత్వంలో ఏర్పాటయిన రాజ్యసభలో ని ప్రతిపక్షాల సమావేశానికి కాంగ్రెస్, బిఆర్‌ఎస్, సమాజ్ వాది, శివ్‌సేన తదితర పక్షాలు హాజరయ్యాయి.

బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ప్రాంతీయ పక్షాలు వొకే కంఠంతో వ్యవరిస్తున్న దృశ్యం కళ్ళకు కడుతున్నది. అయితే ఈ ఐక్యత నిర్మాణాత్మకంగా రూపు కట్టి కడదాకా కొనసాగుతుందా? అదానీ వ్యవహారంలో ప్రధాని మోడీ ప్రతిష్ఠ దెబ్బతీసినందుకు రాహుల్ గాంధీ ప్రతీకారానికి గురయిన నేపథ్యంలో అలాగే రాహుల్ భారత్ జోడో యాత్ర పరంగా కాంగ్రెస్ గ్రాఫ్ కొంత పెరిగినట్టు కనిపిస్తున్నది. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఇది దానికి ఎంతవరకు కలిసివస్తుందో చూడాలి. తొమ్మిదేళ్ల క్రితం వరకు దేశాన్ని పరిపాలించిన ఈ జాతీయ ప్రతిపక్షం బాగా చతికిలబడిపోయింది. అవసాన దశకు చేరుకొన్నది. ప్రధాని మోడీ శపధం చేసిన కాంగ్రెస్ ముక్త భారత్ అయితే సాధ్యం కాకపోవచ్చుగాని కాంగ్రెస్ స్థానాన్ని ప్రాంతీయ ప్రతిపక్షాలు ఆక్రమించుకొన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఢిల్లీ, బెంగాల్, బీహార్, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రతి పక్షాలు బలంగా వేళ్ళూనుకొని అధికారంలో ఉన్నాయి.

కాంగ్రెస్‌కు, బిజెపికి సమాన దూరంలో ఉంటామని సమాజ్ వాది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రెండూ తాజాగా ప్రకటించాయి. ఈ నేపధ్యంలో 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో కూడిన ప్రతిపక్ష కూటమి ఏర్పాటు అవుతుందా, ప్రస్తుతానికైతే అనుమానమే. అయితే కాంగ్రెస్‌కు దేశవ్యాప్త ఉనికి ఉన్నమాట వాస్తవం. ఈ కారణంగా దానిని కలుపుకొనే విషయాన్ని ముందు ముందు ఇతర ప్రతిపక్షాలు ఆలోచిస్తే ఆలోచించవచ్చు. అది జరగాలంటే 2024 ఎన్నికలలో ప్రతిపక్షానికి తానే నాయకత్వం వహించి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే వైఖరిని కాంగ్రెస్ విడనాడుకోవాలి. అందరితో సమానమైన శక్తిగానే ఉండడానికి సిద్ధపడాలి. భారతీయ జనతా పార్టీ మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశంలో చాలా తీవ్ర పరిణామాలు సంభవించే ప్రమాదమున్నది. సెక్యులర్ శాంతియిత సహజీవనాన్ని నిర్దేసిస్తున్న ప్రస్తుత రాజ్యాంగానికే ముప్పు వాటిల్లే ప్రమాదం తల ఎత్తవచ్చు. కాంగ్రెస్ ముక్త భారత్ కాదు, ప్రతిపక్షమే లేని నిరంకుశ రాజకీయం రాజ్యం చేయవచ్చు.

సామాజిక రంగంలో ఇప్పుడున్న స్త్రీల పరిమిత స్వేచ్ఛకూ హాని తలెత్తవచ్చు. ప్రతిపక్షాల మీద ఇప్పటి కంటే అనేక రెట్లు కక్ష సాధింపు చోటు చేసుకొంటే ఆశ్చర్యపోవలసిన పని ఉండదు. ఇప్పుడే న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ కొలీజీయం విషయంలో సుప్రీం కోర్టుతోనే ఢీ అంటున్న బిజెపి పెద్దలు కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఏమి జరుగుతుందో ఊహించవచ్చు. న్యాయ వ్యవస్థ కాషాయీకరణ అనాయాసం కావొచ్చు. అందు చేత ప్రజాస్వామ్యాన్ని, భిన్నమతాల భాషల ప్రాంతాల శాంతియిత సహజీవనాన్ని కాపాడు కోవాలంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షం వొక్క శక్తిగా ఏర్పడి బిజెపి వ్యతిరేక వోటును పెంచుకోడం, అది చీలకుండా చూసుకోడం అత్యంత అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News