Home జాతీయ వార్తలు బిజెపికి రూ.785 కోట్ల విరాళాలు

బిజెపికి రూ.785 కోట్ల విరాళాలు

BJP Received Rs 785 Crore In Donations

 

కాంగ్రెస్‌తో పోలిస్తే ఐదింతలు

న్యూఢిల్లీ : దేశంలోని రాజకీయ పార్టీలకు వ్యక్తులు, సంస్థల నుంచి 2019-20 సంవత్సర కాలంలో అందిన విరాళాలు వెల్లడయ్యాయి. బిజెపికి అత్యధికంగా రూ.785 కోట్లు ముట్టాయి. కాంగ్రెస్‌కు అతి తక్కువగా రూ.139 కోట్లు విరాళాలు అందాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే బిజెపికి ఐదింతలు వివిధ రూపాయలలో ఈ సాయం అందింది. వ్యక్తులు, ఎలక్టోరల్ ట్రస్టులు, కార్పొరేట్ల నుంచి పార్టీలకు విరాళాలు అందాయి. తమ పార్టీకి అందిన విరాళాల తాజా వివరాలను బిజెపి ఫిబ్రవరిలో ఎన్నికల సంఘానికి నివేదిక రూపంలో తెలియచేసుకుంది. వీటిని ఈ వారం ఎన్నికల సంఘం ప్రజా మాధ్యమంలో పొందుపర్చడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి. బిజెపికి అత్యధికంగా ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి, కార్పొరేట్ల నుంచి, సొంత పార్టీ నేతల నుంచి కూడా విరాళాలు అందినట్లు వెల్లడైంది.

పార్టీకి విరాళాలు అందించిన సొంత నేతలలో పియూష్ గోయల్, పేమా ఖందూ, కిర్రన్ ఖేర్, రమణ్‌సింగ్ వంటి వారు ఉన్నారు. ఐటిసి, కళ్యాణ్ జ్యువెలర్స్, అంబుజా సిమెంట్స్, లోథా డెవలపర్స్, మోతీలాల్ ఒస్వాల్ వంటి కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు చేరినట్లు వెల్లడైంది. ఇక పలు ట్రస్టుల నుంచి కూడా బిజెపి విరాళాలు అందుకుంది. విరాళాల విషయంలో రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు రూ.139 కోట్లు రాగా, టిఎంసికి 8 కోట్లు, సిపిఎంకి రూ.19.7 కోట్లు, సిపిఐకి రూ.1.3 కోట్లు విరాళాలుగా దక్కినట్లు తేలింది. రూ.20 వేలకు మించిన మొత్తం గురించే పార్టీలు నివేదికలలో తెలియచేసుకుంటాయి.

BJP Received Rs 785 Crore In Donations