Tuesday, April 23, 2024

మమత, స్టాలిన్‌లపై బిజెపి నజర్!

- Advertisement -
- Advertisement -

BJP targets Mamata and Stalin

 

ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలలో బిజెపి అజెండా ప్రధానంగా ఇద్దరు నాయకులను కట్టడి చేయడం పైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చినా, రాలేకపోయినా, పుదుచ్చేరిలో మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా- చేయలేకపోయినా, కేరళలో నాలుగు సీట్లు గెల్చుకున్నా -గెల్చుకోలేకపోయినా ఆ పార్టీకి జాతీయ స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు అంటూ లేవు. కేరళలో రెండు ప్రధాన కూటములలో ఎవ్వరు గెలుపొందినా ప్రధాని నరేంద్ర మోడీని జాతీయ స్థాయిలో సవాల్ చేయగల సత్తా ఎవ్వరికీ లేదని తెలుసు. జాతీయ స్థాయిలో బిజెపికి ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ఇప్పుడు నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వం చేపట్టకుండా, తెర వెనుక నుండి పార్టీపై ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తున్నంతకాలం ప్రధాని మోడీకి ఎటువంటి ఢోకా ఉండదనే నానుడి కాంగ్రెస్ వర్గాలలో వినిపిస్తున్నది. బిజెపి వ్యతిరేక పక్షాలు ఏవీ కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల తీరు గమనిస్తుంటే ఇద్దరు నాయకుల ఉనికి మాత్రమే బిజెపిని కలవరపెడుతున్నట్లు కనిపిస్తున్నది. వారిలో ఒక్కరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే, మరొకరు డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్. నేడు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలలో స్పష్టంగా బిజెపి వ్యతిరేక ధోరణి అనుసరిస్తుంది ఈ ఇద్దరు నాయకులే కావడం అందుకు కారణం. గతంలో ఆంధ్ర రాజకీయాలలో ఒక సామెత ఉండెడిది. ‘విబిరాజు అధికారంలో ఉంటే, చెన్నారెడ్డి అధికారంలో లేకపోతే ప్రమాదం’. అందుకనే ఇందిరా గాంధీ విబిరాజుకు ఎటువంటి అధికార పదవి ఇచ్చేవారు కాదు. చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా దింపి వేసినా గవర్నర్‌గా పంపేవారు. ఖాళీగా మాత్రం ఉంచేవారు కాదు. ఇప్పుడు స్టాలిన్, మమత సహితం బిజెపికి ఆ విధంగా తయారైన్నట్లు చెప్పవచ్చు. రాబోయే రోజులలో వారిద్దరూ జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉన్నదని బిజెపి నాయకత్వం అనుమానిస్తున్నది. ప్రతిపక్షాలను కూడదీయగల శక్తిగల ఎన్‌సిపి అధినేత శరద్ పవర్ వృద్ధాప్యం ఒక కారణంగా కాగా, మరో కారణం ప్రధాని మోడీ పట్ల ఒక విధమైన సానుకూల దృక్పథం గల నేతగా పేరొందారు.

శరద్ పవార్‌ను ఇబ్బంది పెట్టడానికి బిజెపి సిద్ధపడటం లేదు. అందుకనే ఆయన కనుసన్నలలో నడుస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా నెట్టుకు రాగలుగుతున్నది. వాస్తవానికి మమతా బెనర్జీకి సహితం ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి. ఆమె పదేళ్ల పరిపాలనకు ముగింపు పలకడం కోసం రాష్ట్రంలో చెప్పుకోదగిన బలం రాజకీయంగా లేకపోయినా బిజెపి పెద్ద ఎత్తున ముట్టడి చేస్తున్నది. ఈ పోరులో తాను విజేతగా నిలబడగలిగితే ఎన్నికల సందర్భంగా వ్యక్తమైన ఆవేశాలను మరచిపోయి, కేంద్రం నుండి తగు సహకారం పొందే విధంగా తన పాలన పట్ల మమతా దృష్టి సారించే అవకాశం ఉంది.

కానీ ఆమె ఓటమి చెందితేనే సివంగి వలే బిజెపి నాయకత్వంపై జాతీయ స్థాయిలో పోరుకు ఆమె సిద్ధపడే అవకాశం ఉంది. పైగా ఆమె నాయకత్వం పట్ల అనేక ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా స్పందించే అవకాశాలు కూడా లేకపోలేదు. మొదటి దశ పోలింగ్ పూర్తి కాగానే భారత ప్రజాస్వామ్యంపై, సమాఖ్య నిర్మాణంపై కనీవినీ ఎరుగని దాడికి పాల్పడుతున్న బిజెపిపై పోరాడేందుకు కలసి రావాలని ఆమె ఇచ్చిన పిలుపు ఆమె భవిష్యత్ అజెండాకు సంకేతం ఇస్తున్నది. దేశంలోని పది ప్రముఖ పార్టీల నేతలకు ఆమె ఈ సందర్భంగా లేఖలు రాశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను ఢిల్లీలో ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే (ఎల్‌జి) అనే విధంగా చేయడం సమాఖ్య వ్యవస్థకు మోడీ ప్రభుత్వం ముప్పుగా మారినదని సంకేతం ఆమె ఇవ్వడం ద్వారా ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకునేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

వాస్తవానికి ఆమె జాతీయ స్థాయి రాజకీయాలపై తన మక్కువను 2014 లోనే ‘సమాఖ్య కూటమి’ పిలుపు ద్వారా బహిరంగ పరిచారు. కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే, అన్ని ప్రాంతీయ పార్టీలను కూడ దీసుకుని ప్రధాని పదవికి దీటైన అభ్యర్థి కావాలని ఆమె ఎత్తుగడగా ఉన్నది. అటువంటి ఎత్తుగడనే అనేక మంది ప్రాంతీయ పార్టీల నాయకులు కొంతకాలంగా వేస్తున్నా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉండడంతో సాధ్యపడటం లేదు. అయితే రాజకీయంగా మోడీని వ్యతిరేకించ గల సామర్ధ్యం ఇప్పుడు ఎవ్వరిలో కనిపించడం లేదు. ఒక విధంగా దేశంలో ‘నాయకత్వ శూన్యత’ ఏర్పడింది. ఈ పరిస్థితిని సానుకూలంగా మలచుకొనేందుకు మమత వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. బెంగాల్ ఎన్నికలలో ఓటమి చెందితే ఇక ఢిల్లీ కేంద్రంగా పూర్తిగా ఆమె జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపియేతర నాయకులపై నిస్సిగ్గుగా సిబిఐ, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మమత ఆరోపించారు. బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని పేర్కొనడం ద్వారా కేంద్రంలో ‘అధికార ఏకీకరణ’ కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా బలమైన రాజకీయ ప్రాతిపదిక ఏర్పరచుకోవడం ఆమె ప్రారంభించారు. జాతీయ అభివృద్ధి మండలి, అంతర్రాష్ట్ర మండలి, ప్రణాళిక సంఘం వంటి సంస్థలను రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాలు తమ అవసరాలు, డిమాండ్లు, ఆందోళనలను కేంద్రం ఎదుట వినిపించే వేదికలను మోడీ సర్కారు నిర్వీర్యం చేయడం బిజెపి పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలను సహితం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. వారెవ్వరూ మాట్లాడే స్థితిలో లేకపోయినా మమత ప్రస్తావించే అంశాలకు నైతిక మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు.

మరోవంక, తమిళనాడులో అధికారం చేపట్టడానికి ఉవ్విళ్లూరుతున్న డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ను అధికారంలోకి రాకుండా కట్టడి చేసేందుకు అన్నాడిఎంకెకు ప్రాణం పోసి, ఆ పార్టీ ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తికాలం అధికారంలో ఉండే విధంగా బిజెపి చేయగలిగింది. స్టాలిన్ అధికారంలోకి వస్తే దేశంలో బిజెపి వ్యతిరేక స్వరం వినిపించే బలమైన ముఖ్యమంత్రిగా మారే అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్‌తో ఆయనకు పొత్తు ఉండడం కూడా బిజెపికి ఇబ్బందికరమే. ఆయన కుమార్తె ఇంటిపై పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఐటి దాడులు జరపడం ఈ అంశాన్నే వెల్లడి చేస్తుంది. ‘నేను చెప్పిన మాటలు రాసిపెట్టుకోండి. పదేళ్లలో స్టాలిన్ ప్రధాని అవుతారు’ అంటూ డిఎంకె ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ జోస్యం చెప్పటం జాతీయ రాజకీయాలపై డిఎంకె వర్గాలలో నెలకొన్న ఆసక్తిని వెల్లడి చేస్తుంది. విశేషమైన ప్రజా మద్దతు ఉంది, ప్రతిపక్షాలు ఏవీ ఢీ కొనే పరిస్థితుల్లో లేవని పాలకులు అజాగ్రత్తగా ఉంటే శూన్యం నుండే బలమైన రాజకీయ శక్తులు ఆవిర్భవిస్తాయని చరిత్ర పాఠాలు స్పష్టం చేస్తున్నాయి.

1980వ దశకంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను ఎదిరించే బలమైన రాజకీయ శక్తీ లేదు. కానీ ఎటువంటి రాజకీయ ప్రాతిపదిక లేకుండా అధికారంలోకి వచ్చిన ఎన్‌టి రామారావు ఆంధ్రప్రదేశ్ నుండే ప్రతిపక్ష కూటమికి బీజం పోసి, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం తెలిసిందే. అటువంటి ప్రాతిపదిక నుండే వాజపేయి ఆధ్వర్యంలో ఎన్‌డిఎ సుస్థిర ప్రభుత్వం అందించింది. ‘అంతా వెలిగిపోతుంది’ అనుకున్న వాజపేయి పాలనకు యుపిఎ చరమగీతం పాడింది. యుపిఎకు ఎదురు లేదనుకున్నప్పుడు నరేంద్ర మోడీ వచ్చారు. అందుకనే మమతా, స్టాలిన్ ప్రభావాన్ని బిజెపి తక్కువగా అంచనా వేయడం లేదు. బెంగాల్‌లో బలమైన రాజకీయ ప్రాతిపదికను ఏర్పర్చుకోవడంలో బిజెపి విజయం సాధించినా, తమిళనాడులో మాత్రం ‘ప్రజా వ్యతిరేకత’ ను నిలుపుదల చేయలేకపోతున్నది. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘మీరు మా నియోజక వర్గానికి వచ్చి మా ప్రత్యర్థులకు ప్రచారం చేస్తే మేము గెలిచే అవకాశాలు మెరుగవుతాయి’ అని పలువురు డిఎంకె అభ్యర్థులు ట్వీట్ ల ద్వారా ఎద్దేవా చేయడం ఈ ధోరణిని స్పష్టం చేస్తుంది.

మమత లేఖలు రాసిన 10 మంది నాయకులలో సగం మంది ఇప్పటికే బహిరంగంగా ఆమెకు మద్దతుదారులుగా ఉన్నారు. మిగిలిన వారెవ్వరూ ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేకపోయినా వారిలో పలువురికి ఆమెతో మంచి సంబంధాలే ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపి లేకుండా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోరుకొంటున్న నాయకులు దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే వారందరినీ కలిపి తీసుకురాగాల వారెవరన్నదే ప్రశ్నార్ధకరంగా మారింది. మమత, స్టాలిన్ ఇప్పుడు అటువంటి పాత్ర వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే ఎన్నికలలో మరోమారు గెలిస్తే జాతీయ రాజకీయాల కోసం తన ప్రభుత్వాన్ని ‘త్యాగం’ చేయడానికి మమత సిద్ధపడకపోవచ్చు. అందుకనే ఆమె ఓటమి చెందితేనే బిజెపికి మరిన్ని చిక్కులు తీసుకు వచ్చే అవకాశం ఉంది. స్టాలిన్ ఓటమి చెందితే దేశంలో ఎవ్వరు ఆయనను సీరియస్ గా తీసుకోరు. గెలువపండితేనే ఒక కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News