Thursday, April 25, 2024

మారని దృశ్యం

- Advertisement -
- Advertisement -

BJP won in Bihar assembly elections

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల, మధ్యప్రదేశ్ సహా పలు శాసన సభ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఎదురులేని తనాన్ని చాటాయి. కేంద్రం లో అది తీసుకు వచ్చిన ప్రజా వ్యతిరేక సంస్కరణలు, సాగు చట్టాల ప్రభావంగాని, ఆకస్మిక లాక్‌డౌన్ దాపురింప చేసిన కష్టనష్టాలుగాని జనంలో బిజెపి పట్ల వ్యతిరేకతను కలిగించలేదని, ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల క్షీణత కూడా అక్కడి ఉప ఎన్నికల్లో దానికి ప్రతికూల వాతావరణాన్ని నెలకొల్పలేదని ఫలితాలు రుజువు చేశాయి. అన్నిటికీ మించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కమలనాథుల విశేష ప్రాబల్యాన్ని చాటాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ (జెడియు) తోడు లేకుండా 53 స్థానాలు గెలుచుకున్న బిజెపి ఈసారి ఆయనతో కలిసి రంగంలో దిగి తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నది. 74 స్థానాలతో సభలో రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జెడి మహాఘట్‌బంధన్ శిబిరం నుంచి పోటీ చేసి 70 స్థానాలు గెలుచుకున్న నితీశ్ పార్టీ ఈసారి కేవలం 43 సీట్లకే పరిమితం కావలసి వచ్చింది.

గత ఎన్నికల తర్వాత 2017లో అర్ధంతరంగా మహాఘట్‌బంధన్‌కు నితీశ్ స్వస్తి చెప్పారు. బిజెపి మద్దతుతో ఎన్‌డిఎ ముఖ్యమంత్రిగా కొనసాగారు. బీహార్ ముఖ్యమంత్రి పదవిని తానే చేపట్టాలన్న లక్షంతో బిజెపియే నితీశ్‌ను బలహీనపరిచిందని అందుకోసమే ఆయన మీదికి చిరాగ్ పాశ్వాన్ (లోక్‌జనశక్తి పార్టీ ఎల్‌జెపి) ను మంత్రించి వదిలిపెట్టిందని, ఆ వ్యూహం ఫలించిందని అనిపించడాన్ని తప్పుపట్టలేము. ప్రధాని మోడీ గొప్పతనమే కావచ్చు, కాషాయ బలాలు అట్టడుగు స్థాయిలో కష్టపడి పని చేసినందువల్లే కావచ్చు బిజెపి బాగా పుంజుకొని, జెడి(యు) దెబ్బతిన్నందు వల్ల ఎన్‌డిఎకి గలిగిన నష్టాన్ని భర్తీ చేసి కూటమిని అగ్రస్థానంలో నిలబెట్టింది. అధికారం ఆ కూటమి చేజారిపోకుండా కాపాడింది. అలాగని ఇప్పుడు నితీశ్‌ను కాదని ముఖ్యమంత్రి పీఠం మీద తానే కూచోడానికి బిజెపి సాహసిస్తుందా? లోతుగా పరిశీలిస్తే అది ఆ తెగువ చూపించబోదని అర్థమవుతుంది. ఎందుకంటే బీహార్‌ను బిజెపి నేరుగా పాలించడానికి దాని సొంత బలం చాలదు. జెడి(యు) మద్దతు మీద ఆధారపడక తప్పదు. అర్ధంతరంగా అవతలి కూటమిలోకి దూకి అధికార త్రాసును తారుమారు చేయడానికి వెనుకాడని నితీశ్ కుమార్ బిజెపి పాలన పుట్టిని ఏ క్షణంలోనైనా ముంచగలరు.

అందుచేత బిజెపి మరోసారి ఆయనకే కిరీటాన్ని తొడగక తప్పదు. అతి తక్కువ సొంత బలమున్న నితీశ్ కుమార్ దాని మద్దతుతో ఎంత కాలం సవ్యంగా సుఖంగా పరిపాలించగలరనేది ముఖ్యమైన ప్రశ్న. నితీశ్ కుమార్‌కు, కమలం పార్టీకి సైద్ధాంతికంగా బొత్తిగా పొసగదు. ఈ ఎన్నికల ప్రచార ఘట్టంలోనే ఆ విషయం బయటపడింది. రిజర్వేషన్లను ఆయా కులాల జనాభాను బట్టి ఇవ్వాలని నితీశ్ వాల్మీకి నగర్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారపర్వంలో అభిప్రాయపడగా వెంటనే బిజెపి ఆయనతో విభేదించింది. తనను బలహీన పరచడానికే చిరాగ్ పాశ్వాన్‌ను బిజెపి ప్రయోగించిందనే బాధ లోపల ఉన్నా ముఖ్యమంత్రి పదవి కోసం దానితో మంచిగా నడుచుకోక తప్పని పరిస్థితి నితీశ్‌ది. అయితే ముఖ్యమంత్రిగా ఆయన తీసుకోబోయే కొన్ని నిర్ణయాల సందర్భంలోనైనా బిజెపితో విభేదాలు తలెత్తకుండా ఉండవు. అలాగే కూటమిలో తనకున్న విశేష బలాధిక్యతతో బిజెపి నితీశ్‌కు సైద్ధాంతికంగా పొసగని నిర్ణయాలను తీసుకునేందుకు ఆయనపై ఒత్తిడి తేవచ్చు.

నితీశ్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమే అయినా ఆ పడవ ఎంత కాలం సజావుగా సాగుతుంది, అందుకోసం ఆయన ఏ మేరకు రాజీపడగలుగుతారు? మళ్లీ ప్రతిపక్షంగా అవతరించిన మహాఘట్‌బంధన్ అధినేతగా తేజస్వి యాదవ్ ఈసారి అపూర్వ శక్తిమంతుడనిపించుకున్నారు. తండ్రి లాలూ యాదవ్ ప్రత్యక్షంగా రంగంలో లేని ఎన్నికలలో తానొక్కడే ఒకే ఒక్కడన్న రీతిలో స్వైర విహారం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో కాబోయే ముఖ్యమంత్రి అని నిర్ధారణ అయిన తేజస్వి ఫలితాల ప్రకటన ఘట్టం చివరి వరకూ ఎన్‌డిఎ కూటమికి ముచ్చెమటలు పట్టించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలిద్దరూ (మోడీ, నితీశ్) శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి ఎదిరించినప్పటికీ ఆర్‌జెడిని తిరిగి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరింప చేశారు. 23.08 శాతంతో ఓట్ల పరంగానూ ఆర్‌జెడి మిగతా పార్టీలన్నింటికంటే పైన ఉండడం తేజస్వి ఘనతను మరింత పెంచింది.

మహాఘట్ బంధన్ భాగస్వాములుగా సిపిఐ(ఎంఎల్) 12 స్థానాలు, సిపిఐ, సిపిఎం చెరి రెండు సీట్లు సాధించుకోడం ఆ కూటమి ప్రజాస్వామిక వామ కేంద్రక లక్షణాన్ని చాటింది. కాంగ్రెస్ ఒక్కటే గుదిబండగా మారడంతో కూటమి అధికారాన్ని అందుకోలేకపోయింది. మహాఘట్‌బంధన్ ఇదే ఐకతతో ముందు ముందు కూడా నడిస్తే ఎన్‌డిఎ కూటమికి మరింత వెరపు కలిగించగలదు. 5 స్థానాలు గెలుచుకున్న అసదుద్దీన్ ఒవైసికిచెందిన ఎఐఎంఐఎం మరోసారి తెలంగాణ బయట తన బలాన్ని చాటుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News