Home ఎడిటోరియల్ బ్లాక్ మనీ – బ్లాక్ ఎకానమీ

బ్లాక్ మనీ – బ్లాక్ ఎకానమీ

block-money1

నల్లధనాన్ని తొలగించటం, నకిలీ కరెన్సీ నోట్లను ఏరివే యటం, టెర్రరిజానికి నిధులు నిలుపు చేయటం, లంచగొండి తనాన్ని అరికట్టటం, భారీగా కరెన్సీ నోట్లను దాచుకున్న వారిని దెబ్బకొట్టటం కొరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐదొందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్ల చలామణీని రద్దు చేసింది.
ఇది అరాచక పరిస్థితికి దారి తీసింది. రిటైల్ మార్కెట్ నడవ టం లేదు, ప్రజలు కూరగాయలు, ఇతర నిత్య జీవితావస రాలు కొనుక్కోలేకపోతున్నారు, వారాంతపు వీధి సంతలు పని చేయటం లేదు. బ్యాంకుల ముందు ఎడతెగని క్యూలు చూస్తున్నాం. వాణి జ్యం నిలిచిపోయింది. ఇవి కొత్త కరెన్సీలోకి మార్పిడి తిప్పలు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తగ్గుతాయి, తొలగి పోతాయి.

అయితే స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజి మానిపులేటర్స్ అడ్మినిస్ట్రేటర్ పి.కె. ప్రుస్టీ ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా అటువంటి చర్యలు సఫలం కాలేదు. యూరోపియన్ యూనియన్ కూడా నల్లధనాన్ని రూపుమాపటానికై 2016 మే నెలలో యూరో 500 కరెన్సీని ఉపసంహరించింది. దాని సఫలత చర్చనీయాంశం. మోడీ ప్రభుత్వ చర్యవల్ల భారత దేశంలో కొంత కాలం పాటు నల్లధనం తగ్గుతుంది. అంతేగాని రూపుమాపటం సాధ్యం కాదు.

ఆందోళన చెందాల్సింది నల్లధనం గూర్చి కాదని, దేశం యొక్క “నల్ల ఆర్థిక వ్యవస్థ” గూర్చి అని ప్రుస్టీ నొక్కి చెబుతున్నాడు. స్మగ్లింగ్, మత్తు మందుల దొంగ రవాణా, నగదు అక్రమ రవాణా (మనీ లాండరింగ్), విదేశాలకు వెళ్లిన నల్లధనం చుట్టూ తిరిగి ఎఫ్‌ఐఐ/ ఎఫ్‌పిఐల ద్వారా షేర్లు, బాండ్లు, ఇతర ప్రభుత్వ హామీ పత్రాల రూపంలో తిరిగి దేశంలోకి ప్రవేశించటం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిందే నల్లధనం. మరో విధం గా చూస్తే నల్లధనం కూడా చట్టబద్ధంగా ఆర్జించిందే. ఆర్జనపై పన్ను చెల్లించనందున దాన్ని నల్లధనంగా పిలుస్తున్నాము. పెనాల్టీ సహా పన్ను చెల్లిస్తే అది తెల్లధనం అవుతుంది.

ఇటీవల ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం కింద రూ. 65 వేల కోట్లు తెలుపుగా మారింది. పన్ను – పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి రూ. 30 వేల కోట్లు సమకూరింది. 1997 లో రూ. 33 వేల కోట్లను స్వచ్ఛం దంగా డిక్లేర్ చేయగా, ప్రభుత్వానికి పన్ను కింద రూ. 9,584 కోట్లు లభించింది. అంతకు ముందు కూడా అటువంటి ఐచ్ఛిక వెల్లడి పథకాలు ప్రకటించారు. కాని నల్లధనం ఉత్పత్తి, పన్ను ఎగవేత ఆగిపోలేదు. మన ఆర్థిక వ్యవస్థలో రూ. 12 లక్షల కోట్లు అక్రమార్జన చలామణీలో ఉన్నట్లు అంచనా. కొందరు తమ సంపదను ఇవాళ తగలబెట్టి ఉంటారు!

ఆదాయపు పన్ను రేటును 15 శాతానికి తగ్గిస్తే పన్ను చెల్లింపు దారులు సంఖ్య రెట్టింపుఅవుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. నల్లధనం ప్రభావం కన్నా నల్ల ఆర్థిక వ్యవస్థ పర్యవసానాలు ప్రమాదకరం.అది దేశ సామాజిక, ఆర్థిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపటమే గాక అత్యంత ప్రమాద కరమైన అనేక చట్ట విరుద్ధ కార్యకలాపాలను కూడా పెంపొం దిస్తుంది. పెద్దనోట్ల చలా మణీ రద్దు టెర్రరిస్టులకు నిధులను అదుపు చేయవచ్చు, నకిలీ నోట్లను ఏరివేయవచ్చు.

భారతదేశ జిడిపిలో నల్ల ఆర్థిక వ్యవస్థ 1955లో 4 శాతంగా ఉండగా ఈనాటికది 60 శాతానికి పెరిగినప్పుడు పై రెండు సత్ఫలితమే అవుతాయి. అయితే అటువం టి ఆపరేటర్లకు తమ డబ్బును మార్చుకోవటమెలాగో తెలుసు. ప్రధానమంత్రి డీమానిటైజేషన్ ప్రకటించిన రాత్రే బంగారం అమ్మకాలు అనుహ్యంగా పెరిగిపో వటం, హవాలా ఆపరేటర్లు మహా చురుకుగా కార్యకలాపాలు నిర్వహించటం చూశాం. 5 నుంచి 20 శాతం కమిషన్ సంపాదించారు.

ప్రభుత్వ చర్య కొన్ని రాజకీయ పార్టీలను దెబ్బ కొట్టింది. పలు రాజకీయ పార్టీలు ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం విరాళాలు సేకరించి నిల్వ చేసుకుని ఉన్నాయి. అది చాలా వరకు మూలాలు తెలియని ధనం.

కార్పొరేట్ల వద్ద కూడా పెద్ద మొత్తంలో నగదు ఉంది. అయితే దాన్ని మార్చుకోవటమెలాగో వారికి తెలుసు. నగదు ఆర్థిక వ్యవస్థ శాపమో, పాపమో అయినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. లావా దేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరపాలని పెద్ద లాబీ పని చేస్తోంది. అది సరైన వాదన కాదు. ప్రస్తుతం హవాలా కూడా బ్యాంకుల ద్వారానే జరుగుతున్నట్లు చెప్పబడుతు న్నది. 2007లో లేమాన్ బ్రదర్స్ వంటి మహా బ్యాంకులు, ఎఐజి (అమెరికాలో అతిపెద్ద బీమా కంపెనీ) వంటివి దివాలా ఎత్తినపుడు అమెరికా, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలటం గుర్తు చేసుకోదగింది. అతిపెద్ద నగదు ఆర్థిక వ్యవస్థే భారతదేశాన్ని కాపా డింది. 1990లో దారుణంగా తయారైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్య, 2007-08లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ఇటీవల వెల్లడైన రూ. 12 లక్షల కోట్ల బ్యాంక్ నిరర్థక ఆస్తుల (కార్పొరేట్లు ఎగగొట్టిన మొండి బాకీలు) కుంభకోణం వంటి సంక్షోభాలను అది తట్టుకుని నిలబడగలిగింది.

డిపాజిట్లపై మూలంలోనే పన్ను వసూలు ప్రవేశపెట్టినందున పెద్ద మొత్తాల డిపాజిటర్లు చాలా మంది బ్యాంకుల నుంచి, తమ డిపాజిట్లు తీసేసుకున్నారు. డిపాజిట్లపై టిడిఎస్ ఎత్తివేస్తే బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతాయి, బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చే భారం ప్రభుత్వంపై తగ్గుతుంది. నగదు వ్యవస్థ మన దేశ బలం. ఉదాహరణకు టోకు వ్యాపారం, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో ఎలా 80 శాతంపైగా నగదులోనే జరుగుతుం టుంది. ఎగవేత బహుతక్కువ.

ఇప్పుడు బ్యాంకుల నిరర్థక ఆస్తులు అతిపెద్ద సమస్య. ఇది వాస్తవానికి సామాన్య ప్రజల డిపాజిట్లను హరించటం, ప్రజా ధనాన్ని స్వాహా చేయటమే. వీటిని వసూలు చేయటంలో వైఫల్యం ప్రభుత్వానికి గుది బండ అవుతోంది. వాటి వసూలుకు గట్టి చర్యలతోపాటు నల్ల ఆర్థిక వ్యవస్థను తిప్పికొట్టటానికి మర్ని చర్యలు అవసరం.