Home ఆఫ్ బీట్ చలిపై పులి నల్ల గొర్రె ఉన్ని గొంగడి

చలిపై పులి నల్ల గొర్రె ఉన్ని గొంగడి

black Gongadi is special in Telangana culture

 

కనుమరుగవుతున్న తెలంగాణ దక్కనీ రగ్గు 

పల్లెటూరి తాతయ్య భుజాన గొంగడి బాధ్యతలా కనిపించేది. పశువులు కాసే చిన్నోడికి కవచంలా ఉండేది. తాతల జ్ఞాపకంగా మిగిలిపోయిన గొంగడి ఇటీవలి కాలంలో గత చరిత్రగా మిగిలిపోతోంది. తెలంగాణ సాహిత్య, సామాజిక, సాంస్కృతిక జీవనానికి ప్రతీకగా ఉన్న గొంగడి దక్కన్ ప్రాంతానికే ప్రత్యేకతగా నిలిచింది. వందల ఏళ్లుగా తెలంగాణ పల్లె జీవన సంస్కృతిలో భాగమైన ఈ గొంగడి ఇప్పుడు మాయమైపోతోంది. అవసరాల్లోంచి పుట్టుకొచ్చిన గొంగడి సంస్కృతి వేల కుటుంబాలకు జీవనాధారంగా కూడా ఉండింది. దక్కనీ జానపదాల్లో అడుగడుగునా కనిపించే గొంగడి ప్రపంచీకరణ ఫలితంగా ‘మేడ్ ఇన్ తెలంగాణ’గా గుర్తింపు పొందింది. చలిలో వెచ్చదనాన్ని, మండుటెండలో చల్లదనాన్ని ఇచ్చే ఈ పేదోడి దుప్పటి కాలక్రమంలో కనుమరుగవుతోంది. తెలంగాణ సంస్కృతిలో విడదీయరానివిగా చెప్పుకునే వాటిల్లో గొంగడి ప్రత్యేకతే వేరు. చలిని తట్టుకోడానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రగ్గులు ఉనికిలో ఉన్నాయి.

కశ్మీర్ లాంటి చలి ప్రదేశాల్లో ఉండే ఊలు దుప్పట్లు ఒక రకమైతే దక్కనీ ప్రాంతంలో కనిపించే గొంగడి మరో రకమైనది. మారుతున్న జీవన విధానానికి తగినట్లుగా ఇప్పుడు ఆన్‌లైన్ మార్కెట్‌లో సింథటిక్ ఊలు దుప్పట్లు, రగ్గులు ఉనికిలోకి వచ్చాయి. ఈ నవీన సంస్కృతి గొంగడి ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. రంగురంగుల సింథటిక్ రగ్గులపై నేటి తరానికి ఆసక్తి పెరుగుతోంది. ముతకగా కనిపించే నల్లగొంగడిని వాడడం నామోషీగా భావిస్తున్నారు. నల్లజాతి గొర్రెలతో పాటే దక్కనీ ప్రతీకగా వెలుగొందిన గొంగడి క్రమంగా అంతరించిపోతోంది. అనేక సంవత్సరాలుగా గొంగళ్ల తయారీని నమ్ముకొని బతికిన చాలా కుటుంబాలు ఆ వృత్తికి ఇప్పుడు దూరమయ్యాయి. ప్రస్తుతం మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో 20 కుటుంబాలే నేత గొంగళ్లను తయారు చేసి విక్రయిస్తూ జీవిస్తున్నాయి. ఈ కుటుంబాల్లోనూ పాతతరం వాళ్లు తప్ప నేటి తరం యువతీ యువకులు వృత్తికి పూర్తిగా దూరమయ్యారు.

నల్ల గొంగళ్ళ తయారీ ఒక నైపుణ్య కళ
తెలంగాణ సంస్కతిలో నల్ల గొంగడి ప్రత్యేక స్థానముంది. దీనిలోని ప్రతి పోగూ ఆనాటి సాంప్రదాయాన్ని వెల్లడిస్తాయి. ఒకప్పుడు మనదేశ సైన్యానికి సైతం ఈ గొంగళ్ళు తెలంగాణ నుంచి జైళ్ళ శాఖ ద్వారా సరఫరా అయ్యేవి. ఇతర రాష్ట్రాలకూ వీటి సరఫరా జరిగేది. బరువుతో నిమిత్తం లేకుండా చలి నుంచి తట్టుకునే అవసరానికీ, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ గొంగళ్లను తయారు చేసేవారు. తయారీలోనే ప్రత్యేక జాగ్రత్తలు ఉండేవి. దక్కనీ నల్లజాతి గొర్రెల ఉన్నితో గొంగడి తయారవుతుంది. నల్లజాతి గొర్రెల ఉన్నిని సేకరించిన తర్వాత ఆ ఉన్నిని చేతితో వడికాల్సి ఉంటుంది. ఈ పనిని మహిళలు చేపడితే, మగవారు వడికిన ఉన్నిని ప్రత్యేక తరహాలోని మగ్గంపై గొంగడిగా నేస్తారు. గొర్రెల నుంచి బొచ్చు సేకరించి శుద్ధి చేసి దారంలా రూపొందించి నాలుగు అడుగుల వెడల్పు, ఆరడగుల పొడవైన గొంగడిని మగ్గంపై నేయడానికి కనీసం 25 రోజులు పడుతుంది. ఒక గొంగడి తయారు చేయడానికి ఏడాది వయసు దాటిన గొర్రెలు కనీసం 25 అవసరమవుతాయి. వాటి నుంచి మాత్రమే 2 అంచుల పొడవున్న గొర్రె బొచ్చు లభిస్తుంది.

గొర్రె వయస్సు పెరిగే కొద్దీ వెంట్రుకల పొడవు తగ్గి గొంగళ్ల తయారీకి పనికి రాకుండా పోతుంది. గొంగడి తయారీలో ఊలును నూకటం చాలా ముఖ్యమైన అంశం. ఐదేళ్ల కిందట మూడు కేజీల ఊలును నూకితే రూ. 350 రూపాయలు లభించేది. ప్రస్తుతం రూ. 1800ల వరకు వస్తోంది. మూడు కేజీల ఊలును నూకటానికి మూడు వారాల సమయం పడుతుంది. నేసేవారికి ఒక్కో గొంగడికి రూ. 350 రూపాయలు కూలీ వచ్చేది. ఇప్పుడు అది రూ. 2000 వేల దాకా లభిస్తోంది. గొర్రెల నుంచి ఊలును ఏడాదికి రెండుసార్లు తీస్తారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గొర్రెల నుంచి దీపావళి పండుగ తర్వాత ఉన్ని లభించేది. ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడంతో రెండు నెలల ఆలస్యమవుతోంది. దీపావళి సమయానికి పత్తి పంట చేతికొస్తున్నందున మహిళలు, కూలీలు ఆ పనుల్లో నిమగ్నం కావడంతో గొర్రెల ఉన్ని అవసరాలకు వచ్చేవారు కాదు. దీంతో సంక్రాంతి వరకూ పడుతోంది.

సమిష్టి జీవనం గడిపిన గొర్రెల కాపర్లు గొర్రెల నుంచి ఉన్నిని కత్తిరించడానికి వారిలో వారే డ్యూటీలు వేసుకునేవారు. ఒక గ్రామంలోని గొర్రెల కాపర్లందరికీ ఈ డ్యూటీ పడేది. మే నెల నుంచి రెండు మాసాల పాటు జరిగే గొర్రెల బొచ్చు కత్తిరింపులో ఒక్కో రోజు ఒక్కో బృందానికి డ్యూటీ పడేది. బొచ్చును కత్తిరించిన తర్వాత వాటిని ఊరి చెరువు దగ్గరకు తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించడం, ఇంటిని కూడా పండుగకు శుభ్రం చేసుకున్నట్లుగా ఒక పవిత్ర కార్యంగానే కాపర్లు పాటించేవారు. గొర్రె నుంచి తీసిన ఉన్నిని విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బును ఇంటి అవసరాలకు కాకుండా గొర్రె పిల్లల్ని కొనడానికి, వృత్తిపరమైన అవసరాలకే వినియోగించేవారు.

పడిపోతున్న నల్ల గొర్రెల సంఖ్య
దక్కనీ గొంగళ్ళ తయారీకి నల్లజాతి గొర్రెలు మాత్రమే పనికొస్తాయి. గడచిన 20 ఏళ్ళుగా తెలంగాణలో నల్ల జాతి గొర్రెల సంఖ్య భారీగా పడిపోయింది. రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన ఇంటిగ్రేటెడ్ శాంపిల్ సర్వే లైవ్‌స్టాక్ రిపోర్టు ప్రకారం- 2010లో తెలంగాణ ప్రాంతంలో మొత్తం 1.35 కోట్ల గొర్రెలుంటే వాటిలో 18 లక్షలు మాత్రమే డక్కనీ (నల్లజాతి) గొర్రెలు. 2018 నాటికి రాష్ట్రంలో మొత్తం గొర్రెల సంఖ్య రెండున్నర కోట్లకు పెరిగింది. ఇందులో నల్లజాతి గొర్రెలు మాత్రం కేవలం 10 వేలు మాత్రమే ఉన్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్థానిక వాతావరణ పరిస్థితులకు నల్లగొర్రెలు తట్టుకుని నిలబడడమే కాక ఆత్మరక్షణలో భాగంగా ఉన్ని ఉత్పత్తిని సమతుల్యం చేసుకుంటాయి. ఆరు నెలలకల్లా ఒక్కో నల్లగొర్రెపై కనీసంగా రెండున్నర అంగుళాల పొడవైన ఉన్ని ఉత్పత్తి అవుతుంది. కాపర్లు ప్రత్యేక తరహా కత్తెరలను ఉపయోగించి ఆ ఉన్నిని కత్తిరిస్తారు. కానీ ప్రకృతిలో వచ్చిన మార్పులతో నల్లగొర్రెల సంఖ్య తగ్గిపోవడంతో పాటు ఆ ప్రభావం ఉన్ని ఉత్పత్తిపై కూడా పడింది.

మేత మేసే ప్రాంతంలో నీటి కుంటలు లేకపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడం, గొర్రెలు జబ్బుల బారిన పడినప్పుడు వైద్య సేవలందించడంలో ఉన్న సమస్యలు తదితరాలన్నీ నల్లగొర్రెల సంఖ్య పడిపోవడానికి కారణాలయ్యాయి. గొర్రెలు ఉన్ని ఉత్పత్తి చేసుకోవడంపై కూడా పడింది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం, పరిశ్రమల నుంచి కాలుష్యం వెలువడడం, పత్తి పంటల విస్తీర్ణం పెరగడం, వాటికోసం వాడే పురుగు మందులు, రసాయనాలు కూడా అన్ని రకాల గొర్రెల ఆహారంపై ప్రభావం చూపుతున్నాయి. మొక్కలు, గాలి విషతుల్యంగా మారడంతో గొర్రెలకు కొత్త రోగాలు సోకుతున్నాయి.

మాంసం అవసరాలతో పెరిగిపోయిన తెల్ల, ఎర్ర గొర్రెల సంఖ్య
సమైక్య రాష్ట్రంలో మాంసం అవసరాల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఎర్ర, తెల్ల గొర్రెల దిగుమతి గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవడంతో గడచిన రెండు దశాబ్దాలుగా ఈ దిగుమతి ఊపందుకుంది. దీంతో తెలంగాణ ప్రాంతంలో నల్లగొర్రెల కంటే దిగుమతి అవుతున్న గొర్రెలే పెరిగాయి. అయితే ఐదేళ్ళ క్రితం వచ్చిన తుపాను కారణంగా నెల్లూరు, మిశ్రమ జాతికి చెందిన గొర్రెలు ఎక్కువగా మరణించాయి. కానీ డక్కనీ గొర్రెలు మాత్రం ఇలాంటి అనేక విపత్తులను తట్టుకొని నిలబడగలిగాయి. గొంగళ్ళలో నల్ల గొంగళ్ళకే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. గొర్రెల నుంచి ఉత్పత్తి అయ్యే నాలుగైదు రకాల ఊలులో నల్ల రంగు ఉన్నికే ఎక్కువ మన్నిక ఉంటుంది.

నల్ల గొంగడి ఇచ్చినంత వెచ్చదనాన్ని మరే రంగు గొంగళ్ళు ఇవ్వకపోవడంతో గొర్రెల కాపర్లు వీటినే ఎక్కువగా వినియోగిస్తారు. మాంసం అవసరాలకు ఎర్ర, తెల్ల గొర్రెలు తక్కువ రోజుల్లోనే పనికొచ్చే పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఈ విధాన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని పశువుల కాపర్లు కూడా వాటివైపే మొగ్గు చూపారు. సంతల్లో క్రయ విక్రయాల్లో నల్లజాతి కంటే నెల్లూరు లాంటి ప్రదేశాల నుంచి దిగుమతి అవుతున్న తెల్ల, ఎర్ర గొర్రెలకే డిమాండ్ ఎక్కువగా ఉండడం ఇందుకు కారణమైంది. నల్లగొర్రెలతో పోలిస్తే తెల్ల, ఎర్ర గొర్రెల బొచ్చు ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలబడలేకపోతోంది. కంపలు తగిలినా రాలిపోతూ ఉంది. అందుకే ఎర్ర, తెల్ల గొర్రెల బొచ్చు గొంగళ్ళ తయారీకి పెద్దగా ఉపయోగపడడంలేదు.

గొంగళ్ళ తయారీ నుంచి ఇతర పనులకు
ఎర్ర, తెల్ల గొర్రెల నుంచి ఉన్ని ఉత్పత్తి పెద్దగా లేకపోవడంతో పాటు ఆ ఉన్ని గొంగళ్ల తయారీకి అనుకూలంగా ఉండదు. ఉన్ని సేకరణకు నల్ల గొర్రెలు మాత్రమే ఏకైక వనరుగా ఉంది. దక్కన్ గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం అధ్యయనం ప్రకారం ప్రస్తుతం గొంగళ్ల తయారీ మెదక్ జిల్లాలో తప్ప తెలంగాణలో మరెక్కడాలేదు. గతంలో ఈ జిల్లాలోని నారాయణ్‌ఖేడ్ పరిసర ప్రాంతాల్లోని చాలా ఊళ్ళలో కనీసం రెండు, మూడు కుటుంబాలు గొంగళ్లను తయారు చేసేవి. వాటిపైనే ఆధారపడి బతికేవి. సామాజికంగా గొల్ల, కురుమలు మాత్రమే గొంగళ్ళను తయారుచేస్తారు. కానీ వాటి వినియోగం మాత్రం కులాలకు అతీతంగా ఉంటుంది. జమీందారీ వ్యవస్థ ఉనికిలో ఉన్నప్పుడు గొంగడిని ధరించడం సంపన్నులకు ఒక సామాజిక హోదాగానే ఉండేది. కానీ గొర్రెలు కాయడంపైనే ఆధారపడేవారు మాత్రం ప్రకృతి నుంచి రక్షణ కోసం వినియోగించేవారు. ప్రస్తుతం నారాయణ్‌ఖేడ్, శివ్వంపేట, బిజిలీపూర్ ప్రాంతాల్లో 20 కుటుంబాలే గొంగళ్ళ తయారు చేస్తున్నాయి.

నల్లజాతి గొర్రెలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు వాటి ఉన్నిపై ఆధారపడి గొంగళ్ళ తయారీ బాగానే జరిగేది. అందువల్లనే తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల్లో దాదాపు 600 వరకు ఉన్ని సహకార సంఘాల పనిచేశాయి. ఈ సంఘాలు గొంగడి నేతను ప్రోత్సహించటంతో పాటు ఉన్ని సేకరణపై కూడా దృష్టి పెట్టేవి. గొంగళ్ళను యంత్రాలపై తయారుచేసే మిల్లులకు కూడా ఉన్నిని సరఫరా చేసేవి. ఒక్కో సంఘంలో సుమారు 500 నుంచి 1000 మంది సభ్యులుండేవారు. ప్రత్యక్షంగా సుమారు ఐదు లక్షల కుటుంబాలు, పరోక్షంగా మరో ఐదు లక్షల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి ఆర్థికంగా భరోసా పొందేవి. నల్ల గొర్రెలు లేకపోవడంతో వీరంతా ఇప్పుడు ఇతర పనులవైపు మొగ్గు చూపుతున్నారు.

ఆరోగ్య ప్రదాయిని నల్ల గొంగడి
నల్లటి గొంగడి ఆరోగ్య ప్రదాయిని. ఎన్ని రకాల దుస్తులు, సదుపాయాలు అందుబాటులోఉన్నా కాలానికి తగినట్లు సేవలందించడంలో నల్లగొంగడి ప్రత్యేకతే వేరు. అందుకే తెలంగాణ జీవితంలో, సంస్కృతిలో, ఆటపాటల్లో భాగమైంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో దసరా పండుగ తర్వాత జరుపుకునే అలాయ్ బలాయ్‌లోసైతం నల్లగొండికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గోచి, గొంగడి తెలంగాణ సంస్కృతిలో కళా రూపాలుగా ఉండేవి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న గొంగడి ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. వీటి ధర లూ పెరిగాయి. ఉన్ని సేకరణ కష్టం కావడంతోపా టు గొంగడి ఉత్పత్తి వ్యయ మూ పెరిగింది. ఒక్కో గొం గడి ఖరీదు రూ. 6000 నుంచి రూ.9,000 వరకు పలుకుతోంది.

                                                                                                             – బి.అరుణ్ కుమార్

black Gongadi is special in Telangana culture