Thursday, April 18, 2024

పరిశ్రమలకు కఠోర నియమాలు!

- Advertisement -
- Advertisement -

Blatant rules for industries

 

ముందు నోటీసు లేకుండా కేవలం నాలుగు గంటల వ్యవధి ఇచ్చి దేశమంతటా లాక్‌డౌన్‌ను విధించిన కేంద్ర ప్రభుత్వం రెండు నెలలు గడిచిన తర్వాత ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరిపించే విషయంలో తప్పటడుగులు, తప్పుటడుగులు వేస్తున్నది. రాష్ట్రాలతో కేంద్రం సమన్వయ లోపం కారణంగా సోమవారం నాటి దేశీయ విమానయాన పునరుద్ధరణ ఘట్టం ఘోరంగా విఫలమై ప్రయాణీకులు విమానాశ్రయాలకు వచ్చిన తర్వాత ఎన్నో ఇక్కట్లకు గురి కావల్సి వచ్చింది. విమానాలు లేక ఇళ్లకు తిరుగు ముఖం పట్టక తప్పలేదు. ముందుగా ప్రకటించి టిక్కెట్లు అమ్మిన 630 విమానాలు చివరి నిమిషంలో రద్దు కావడంతో చెప్పనలవికాని గందరగోళం ఏర్పడింది. పరిశ్రమలను తిరిగి తెరిపించే విషయంలోనూ కేంద్రం జారీ చేసిన నియమ నిబంధనలు వాటికి గుది బండలుగానే నిరూపించుకుంటున్నాయి. సంపన్న దేశాల్లో మాదిరిగా కాకుండా సంఘటిత రంగం పరిమితమై అసంఘటిత పారిశ్రామిక వ్యవస్థ అపరిమితంగా ఉన్న మన దేశంలో ప్రభుత్వాలు విధించే కఠిన నిబంధనలను పాటించడం యాజమాన్యాలకు సులభతరం కాదు.

అటువంటి షరతులు పెట్టడం వల్ల పరిశ్రమల యజమానులు ఉత్పత్తి కృషికి స్వస్తి చెప్పే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అందుచేత ప్రభుత్వాలు వాస్తవిక దృష్టితో నియమ నిబంధనలను రూపొందించాలి. కరోనా లాక్‌డౌన్ ముగింపు దశలో దేశంలోని పారిశ్రామిక రంగానికి తిరిగి అనుమతి ఇస్తూ నియమావళిని రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞతను పాటించలేదు. లాక్ ఓపెన్ విషయంలో కేంద్రం వైఖరి నోటితో ఆహ్వానించి నొసటితో తిరస్కరించిన విధంగా ఉన్నదనే అభిప్రాయానికి తావు కలిగింది. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఏప్రిల్ 20వ తేదీ నుంచి తెరుచుకోడానికి పరిశ్రమలను కేంద్రం అనుమతించింది. కాని ఆ అనుమతికి స్పందనగా ఆ రోజు తెరుచుకున్న పరిశ్రమలు 5 శాతం కంటే తక్కువేనని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తెరవడానికి అనుమతిస్తూనే కఠోరమైన, ఆచరణ సాధ్యం కాని కరోనా నిబంధనలు విధించారని అందుచేతనే తాము పరిశ్రమలను తిరిగి ప్రారంభించలేకపోయామని యజమానులు స్పష్టం చేశారు.

తెరచిన తర్వాత పరిశ్రమలోని వారెవరికైనా వైరస్ సోకితే యాజమాన్యాలపై కేసులు పెడతామని కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన వారిలో భయోత్పాతాన్ని కలిగించింది. చాలా రాష్ట్రాలు ఈ విషయాన్ని గమనించి దీని నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పినా యాజమాన్యాల్లో ధైర్యం కలగడం లేదు. ఇందుకు తోడుగా తమ ఉత్పత్తులను రవాణా చేసే ట్రక్కులపై పోలీసుల జులుం తమను భయపెడుతున్నదని చాలా యాజమాన్యాలు ఫిర్యాదు చేయడం గమనించవలసిన విషయం. ఇటువంటి అంశాలను సహేతుక దృష్టితో గమనించి నియమ నిబంధనలను ఆచరణ సులభంగా రూపొందించి ఉంటే ఈ సరికి దేశ వ్యాప్తంగా పారిశ్రామిక వాతావరణం వెల్లివిరిసి ఉండేది. కాని అలా జరగలేదంటే కేంద్ర ప్రభుత్వం తీరే అందుకు కారణమని చెప్పక తప్పదు. కరోనా ఎందుకు, ఎలా సోకుతున్నదో ఇప్పటికీ నిగూఢమే.

దాని మూలాలెక్కడున్నాయో అది వ్యాప్తి చెందకుండా నిరోధించడమెలాగో తెలియక, భారీ ఎత్తు పరీక్షలతో ఇతరత్రా వైద్యపరమైన జాగ్రత్తలతో దాని ఉనికిని కనుగొని అప్రమత్తంగా ఉండే అవకాశాలు, మౌలిక సౌకర్యాలు కొరవడినందున ప్రభుత్వాలే మాసాల తరబడి లాక్‌డౌన్ విధింపును తరణోపాయంగా ఎంచుకున్నప్పుడు పరిశ్రమల యజమానులు తమ వద్ద పని చేసే వారికి వైరస్ సోకకుండా ఎలా చేయగలుగుతారు? ప్రభుత్వాలకే అలవికాని పని వారికి ఎలా సాధ్యమవుతుంది? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం పరిశ్రమల పునరుద్ధరణ సమయంలో పాటించదగు షరతులను రూపొందించినప్పుడు కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉదయించకపోడం విడ్డూరమే. రెండు మాసాల సుదీర్ఘ లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతగా దెబ్బతిన్నదో చెప్పలేం. దాని పర్యవసానంగా వృద్ధిరేటు పెరుగుదల ఆగిపోయి మైనస్ బాట పడుతుందని రిజర్వు బ్యాంకు గవర్నరే అంగీకరించారు.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు పూర్తిగా తెరదించి ఆర్థిక వ్యవస్థ తిరిగి పరిపూర్ణంగా తెరుచుకునేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతగా వ్యవహరించవలసి ఉంది. వలస కార్మికుల విషయంలో అది ప్రదర్శించిన నిర్లక్షం కారణంగా వారు ఎదుర్కొన్న కష్టాలు ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించాయి. ఇప్పుడు ఉత్పత్తి, నిరాణ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో తిరిగి పుంజుకోవాలంటే కోట్లాది మంది కార్మికుల పాత్ర అనివార్యం. పని స్థలాల నుంచి ఇళ్లకు చేరిపోయిన వలస కార్మికుల్లో భయాలను పోగొట్టి తగిన ప్రోత్సాహ ప్రోద్బలాలను కల్పించి వారు తిరిగి ఆర్థిక గమనంలో పాల్గొనేటట్టు చేయవలసి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాల, కార్పొరేట్, ఇతర పరిశ్రమల యజమానుల సహకారాన్ని కూడా కేంద్రం తీసుకోవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News