Home అంతర్జాతీయ వార్తలు పడవ బోల్తా, 100 మంది మృతి

పడవ బోల్తా, 100 మంది మృతి

లేక్ విక్టోరియాలో విషాదం
మృతుల సంఖ్య పెరిగే అవకాశం

boat

నైరోబి(టాంజానియా): ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్ద సరస్సుగా ఖ్యాతి కెక్కిన  లేక్ విక్టోరియాలో గురువారం  ఘోర పడవ ప్రమాదం జరిగింది. సామర్థానికి మించి మూడు వంతుల ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులతో వెళ్తున్న ఎంవి నైరేర్ బోటు లేక్ విక్టోరియాలో గల్లంతయింది. ఆ  ప్రమాదంలో  వంద మంది మృతి చెందినట్లు ఆ దేశ పోలీస్ చీఫ్ సైమన్ సిర్రో ప్రభుత్వ అధికారిక రేడియో టిబిసి టైఫా ద్వారా శుక్రవారం ప్రకటించారు. రెస్కూ బృందాలు నలభై నాలుగు మందిని  రక్షించారని తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే సంఖ్య కచ్చితంగా లేక పోవడంతో మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.  గల్లంతైన వారి కోసం, మృత దేహాల కోసం రెస్కూ టీమ్‌లు గాలిస్తున్నాయని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ఎంవి నైరేర్ బోటు సామర్థానికి మించిన ప్రయాణీకులతో బుగోలోరా నుంచి గురువారం బయలు దేరింది. మరి కొద్ది సేపట్లో ఉకారా ద్వీపాన్ని క్షేమంగా చేరుకోవాల్సి ఉండగా అకస్మాత్తుగా అదుపు తప్పి నీటిలో గల్లంతయింది. ప్రమాద సమయంలో  సుమారు 44 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించగా, శుక్రవారానికి మృతుల సంఖ్య వందకు చేరింది. వెలుతురు లేని కారణంగా గురువారం కేవలం 37 మంది ప్రయాణికులను మాత్రమే రెస్కూ టీమ్‌లు రక్షించాయని చీకటి పడడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బోటులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వలేక పోతున్నారు.  అయితే స్థానిక మీడియా నివేదికల ఆధారంగా సుమారు 400 నుంచి 500లకు ఉండొచ్చని వారు అంచనా వేస్తునారు. మ్వాన్జా గవర్నర్ జాన్ మొంగెల్లా మీడియాతో మాట్లాడుతూ బోటు ప్రమాదంలో గల్లంతైన వారిని రక్షించేందుకు ఆర్మీ, రెస్కూ టీమ్‌లు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అన్నారు. ప్రమాదం జరిగిన రోజు  40 మంది ప్రయాణికులను కాపాడటం జరిగిందని, శుక్రవారం ఉదయం నుంచి రక్షించిన వారి సంఖ్య తెలియాల్సి ఉందని అన్నారు.  సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. ఉకెర్వీ ద్వీపంలోని అతిపెద్ద టౌన్ అయిన బుగోలోరా వద్ద బోటు బయలు దేరిన సమయంలో  200లకు పైగా ప్రయాణికులు ఉన్నట్లు  ప్రభుత్వ అధికారిక టీవీ చానెల్లో ప్రత్యక్ష సాక్షుల కథనాలు ప్రసారమయ్యాయి. ప్రతి గురువారం  బుగోలోరాలో  సంత  జరుగుతుందని అందువల్ల అటు నుంచి వచ్చే బోటుల్లో మనుషులు, వస్తువులతో కిక్కిరిసి ఉంటుందని ఆ కథనాల్లో స్థానికులు వెల్లడించారు. ప్రమాద వార్త తెలిసిన   వెంటనే ప్రయాణికుల బంధువులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న తమ వారి కోసం తల్లడిల్లుతున్నారు. మృతుల బంధువుల రోదనలు ఒకవైపు, మరోవైపు తమ వారి జాడ తెలియక కన్నీరు మున్నీరవుతున్న వారి రోదనలు. కొత్త స్కూలు యూనీఫామ్ కోసం వెళ్లిన తండ్రి సోదరుడు కోసం ఒకరు, కొడుకు మృతదేహాన్ని చూసి రోదిస్తున్న తల్లి, భార్య ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న భర్త అనేక విషాద దృశ్యాలతో ఆ ప్రాంతం మరణ మృదంగంగా మారింది. ఇక్కడ నివసిస్తున్న వారి జీవితాలు ఇలాంటి విషాదాలతోనే నిండి పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సర్వీస్ ఏజెన్సీనే బాధ్యత వహించాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బోటులో ప్రయాణీకుల సంఖ్య గురించి తెల్సుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థదేనని, అయితే ఎం వి నైరేర్‌లో ఎంత మంది ప్రయాణించారో ఎవరికీ తెలియదని ఆరోపించారు. బోటు ప్రమాదం ఇదే మొదటిది కాదని గతంలో జరిగిన వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోక పోవడం వల్లనే ప్రమాదాలు పునరావృతమై అమాయకులు మరణిస్తున్నారని ఆరోపించారు. బోటులో ప్రయాణికులతో పాటు మొక్కజొన్న, అరటి, సిమెంట్ కూడా ఉన్నాయని ఇవే అధిక స్థలం ఆక్రమించాయని ఆరోపించారు.