Home ఎడిటోరియల్ సంపాదకీయం: మళ్లీ బరితెగించిన పాక్ సైన్యం

సంపాదకీయం: మళ్లీ బరితెగించిన పాక్ సైన్యం

Sampadakeeyam-Logoజమ్మూ-కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఒసి) వెంట గస్తీలో ఉన్న ఇద్దరు భారత జవాన్‌లను మాటువేసి చంపి, వారి భౌతిక కాయాలను ముక్కలుగా నరికిన పాకిస్థానీ సైనికుల నీచమైన చర్యపట్ల భారత సైన్యం, ప్రభుత్వం, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సైనికుడు’ అనే పదానికే అవమానకరమైన హేయమైన రాక్షసకృత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ సైన్యంపై ఆరోపణను ఖండించిన పాకిస్థాన్ సైన్యం తమ సైనికులు పూర్తిస్థాయి ‘ప్రొఫెషనల్స్’ అని, వారు అటువంటి అమానుష కృత్యానికి పాల్పడరని సమర్థించింది. అయితే భారతసైన్యం 22వ సిక్కు కాల్బలానికి చెందిన జెసిఒ పరమ్‌జీత్‌సింగ్, బిఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్‌లను చంపిందెవరు? టెర్రరిస్టులను భారత్ భూభాగంలోకి ప్రవేశపెట్టే టప్పుడు పాకిస్థాన్ సైనిక దళాలు తమ స్థావరాలనుంచి భారత సైనిక స్థావరాల పైకి భారీగా కాల్పులు జరుపుతుంటాయి. సోమవారంనాడు అదే జరిగింది.

పాకిస్థాన్ సైన్యం కాల్పులను భారతసైన్యం ఎదురుకాల్పులతో తిప్పికొడు తుండగా పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ టీం (బిఎటి) వాస్తవాధీన రేఖ దాటివచ్చి గస్తీలో ఉన్న భారత్ జవాన్ లపై కాల్పులు జరిపింది, ఆ పై వారి శరీరాలను ముక్కలు చేసింది. బిఎటిలో సాధారణంగా పాకిస్థాన్ కమాండోలు, సుశిక్షితులైన మిలిటెంట్లు ఉంటారు. పాకిస్థాన్ సైన్యం అంటున్నట్లు తమ సైనికులు ప్రత్యక్షంగా హత్యాకాండకు ఒడిగట్టి ఉండక పోవచ్చు. కాని ఈ దారుణ కృత్యం వారి కనుసన్నల్లోనే, అండతోనే జరిగినందున బాధ్యతనుంచి అది తప్పించుకోజాలదు. ఇటువంటి అమానుష కృత్యాలు వారికి కొత్త కాదు. జమ్మూ-కశ్మీర్‌లో గత ఆరుమాసాల్లో బిఎటి దాడి ఇది రెండవసారి. 2016 నవంబర్ 22న కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లో బిఎటి దాడిలో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు, ఒకరి భౌతికకాయం ముక్కలు చేయబడింది.

2016 అక్టోబర్ 28న పాక్ సైన్యం కాల్పుల రక్షణ కింద మిలిటెంట్లు మచిల్‌లో ఒక సైనికుని చంపి ముక్కలు చేశారు. నవంబర్ 23న భారత సైన్యం జరిపిన ప్రతీకార కాల్పుల్లో ముగ్గురు పాకిస్థానీ సైనికులు మరణించారు. ఎల్‌ఒసి వెంట ఇటువంటి మారణకృత్యాలు సహజమైనప్పటికీ, వాస్తవాధీన రేఖ దాటివచ్చి మన సైనికులను మట్టుపెట్టి, ముక్కలు చేయటమన్నది అత్యంత క్రూరమైన చర్య. ఇందుకు ప్రతీకారం తప్పదు. సర్జికల్ దాడితో తమ మిలటరీ నైపుణ్యాన్ని చాటిచెప్పిన మన సైన్యం ఏ చర్య తీసుకున్నా యావద్దేశం దానివెంట ఉంటుంది. ఇరుదేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నందున సంయమనం అవసరమే అయినా సాంప్రదాయక యుద్ధతంత్రంతో ఎప్పుడు ఏమి చేయాలో మన సైన్యానికి బాగా తెలుసు.

పాకిస్థాన్ సైన్యాధిపతి క్వామర్ బిజ్వా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని హాజీపీర్ సెక్టార్‌ను సందర్శించి, భారత కశ్మీర్‌లోని నిరసన ఆందోళనకు తమ తోడ్పాటు ప్రకటించి వెళ్లిన మరుసటి రోజే కృష్ణ ఘటి సెక్టార్‌లో భారత్ జవాన్‌ల వధ జరిగింది. పాకిస్థాన్ రాజకీయ వ్యవహారాల్లో సైన్యం తిరిగి క్రియాశీల పాత్ర వహిస్తున్న నేపథ్యంలో దీన్ని చూడాలి. పనామా పేపర్స్‌లో బయటపడిన ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులపై సుప్రీంకోర్టు దర్యాప్తుకు ఆదేశించటంతో అసలే బలహీనమైన షరీఫ్ స్థానం నామమాత్రమైంది. దేశంలో ఇస్లామిస్ట్ గ్రూపులను అదుపు చేయటంలో సైన్యం అనాసక్తిపై పౌర అధికారులు సైనికాధికారులను నిలదీశారన్న సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణపై షరీఫ్ తన ముఖ్య సలహాదారులిద్దర్నీ సైన్యం ఒత్తిడిపై కొద్దిరోజుల క్రితం బర్తరఫ్ చేశాడు.

నరేంద్రమోడీ, నవాజ్‌షరీఫ్‌కు మిత్రుడైన భారత వ్యాపారి షరీఫ్‌ను కలుసుకోవటంతో పాకిస్థాన్ మరణశిక్ష విధించిన భారత మాజీ అధికారి విషయమై తెరచాటు దౌత్యం జరుగుతోందన్న అనుమానించిన సైన్యం దాన్ని భగ్నం చేసేందుకు ఎల్‌ఒసి వద్ద ఘాతుకానికి పాల్పడిందన్న సందేహం కూడా లేకపోలేదు. ఏదిఏమైనా, నరేంద్రమోడీ ప్రభుత్వ పాకిస్థాన్ విధానంలో నిలకడలేక పోవటాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. సర్జికల్ దాడికి ప్రశంసలు పొందినా అవి నిష్ఫలమైనాయి. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు ఏది అనువైన మార్గమో ఆచితూచి నిర్ణయం చేయాల్సి ఉంటుంది.