Friday, April 19, 2024

అంతర్జాతీయ ప్రమాణాలతో సిరిసిల్ల డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ ప్రమాణాలతో సిరిసిల్ల డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్
ఐటిడిఆర్‌ను యువత సద్వినియోగం చేసుకోవాలి
స్వల్పకాలిక శిక్షణ కోర్సులు అవసరం
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర యువత సద్వినియోగం చేసుకొని నిపుణులైన డ్రైవర్లుగా సేవలందించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కోరారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ఏర్పాటు చేసిన ఐటిడిఆర్ సంస్థ నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా సంస్థలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ కూడా పఠనం లాంటిదేనని.. వాహన చోదక రంగంలో అన్ని అంశాలను ఆమూలాగ్రం నేర్చుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి కెటిఆర్ ప్రత్యేక చొరవతో అశోక్ లేలాండ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐటిడిఆర్‌ను మండేపల్లిలో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున రాష్ట్ర యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిపుణులైన డ్రైవర్లుగా సేవలందించాలని కోరారు.

తెలంగాణలో ఐటిడిఆర్ లాంటి సంస్థ ఉండాలని మంత్రి కెటిఆర్, తాను ఎంపిగా ఉన్నప్పుడు భావించామని గుర్తుచేశారు. అశోక్ లేలాండ్ సంస్థ తో మాట్లాడి విశాలమైన స్థలంలో అన్ని సదుపాయాలతో ఐటిడిఆర్ ఏర్పాటు చేశారన్నారు. దీని ప్రధాన ఉద్దేశం వాహన చోదకులకు నిపుణులచే అత్యుత్తమ శిక్షను అందించడం తద్వారా ప్రమాదాలను నివారించడం అని తెలిపారు. దేశంలో ప్రతి ఏడాది 2 లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని తెలిపారు. దాదాపుగా 5 లక్షల మంది ప్రమాదాల బారిన పడి వైకల్యం బారిన పడుతున్నారని తెలిపారు. దీనిని నివారించాలంటే నిపుణులైన డ్రైవర్లను తీర్చిదిద్దడమొక్కటే పరిష్కారం అని పేర్కొన్నారు. తొలి రోజుల్లో డ్రైవర్లకు శిక్షణ ఉండేది కాదన్నారు. స్వీయ ప్రయత్నంతో డ్రైవింగ్ నేర్చుకొని పెద్ద వాహనాలను కూడా నడిపేస్థాయికి ఎదిగే వారని తెలిపారు. కాలక్రమంలో డ్రైవర్లకు శిక్షణ ప్రాధాన్యతను గుర్తించిన సింగరేణి, ఆర్టీసీ వంటి సంస్థలు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేపిస్తున్నాయని తెలిపారు.

ఐటిడిఆర్‌లో కూడా సింగరేణి సంస్థ సౌజన్యంతో డ్రైవర్లకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి నిపుణులచే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. స్వల్పకాలిక శిక్షణ నిర్వహిస్తే డ్రైవర్లకు వృత్తి నైపుణ్యాలు మరింత పెంపొందించేందుకు, కొత్త సాంకేతికతను అంది పుచ్చుకునేందుకు వీలు అవుతుందన్నారు. డ్రైవింగ్‌లో డిప్లమో, సర్టిఫికెట్ కోర్సులు కూడా పెట్టాలని డ్రైవర్ల నుంచి డిమాండ్ వస్తున్న దృష్ట్యా ఆ ఆలోచన చేయాలని ఐటిడిఆర్ బాధ్యులను ఆయన సూచించారు. తాను కూడా సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కొండల్‌రావు, ఐటిడిఆర్ బాధ్యులు నుజుమ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News