Friday, March 29, 2024

బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషికపూర్
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయ్‌లోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ మృతి చెందారు. బుధవారం రాత్రి రిషికపూర్ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతుండడంతో వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. చివరికి హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొంది ఇండియాకు తిరిగి వచ్చారు రిషికపూర్. ఆ తర్వాత పలు అనారోగ్య సమస్యలతో ఫిబ్రవరిలో రెండు సార్లు ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాదాపు 51 చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించిన రిషి కపూర్ 41 చిత్రాల్లో మల్టీ స్టారర్ కథానాయకుడిగా నటించారు. బాబీ, లైలా మజ్నూ, సర్గమ్, నగీనా, చాందినీ, హనీమూన్, దీవానా, గురుదేవ్ చిత్రాలు ఈ దిగ్గజ నటుడికి మంచి గుర్తింపు తెచ్చాయి. హీరోగానే కాకుండా సహాయ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా సినిమాలు చేశారు రిషికపూర్. ఇక ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో దిగ్గజ నటుడు రిషి కపూర్ కూడా మరణించడంతో బాలీవుడ్‌ను షాక్‌కు గురిచేసింది. రిషి కపూర్ మరణ వార్త విన్న వెంటనే అతని స్నేహితుడైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.“రిషీ కపూర్ కొద్దిసేపటి క్రితమే మరణించారు. హి ఈజ్ గాన్..! రిషీ కపూర్ .. గాన్.. జస్ట్ పాస్ డ్ అవే.. ఐ యామ్ డిస్ట్రాయ్డ్!” అంటూ అమితాబ్ తీవ్ర కలతకు గురయ్యారు.

1952 సంవత్సరం సెప్టెంబరు 4న ముంబయ్‌లో జన్మించారు రిషి కపూర్. బాలీవుడ్ లెజెండ్ రాజ్‌కపూర్ రెండో కుమారుడు ఆయన. రాజ్ కపూర్ నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రిషికపూర్.. ఒక దశలో రొమాంటిక్ హీరోగా, లవర్‌బాయ్‌గా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు.
బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం…
తన తండ్రి రాజ్‌కపూర్ హీరోగా చేసిన ‘మేరా నామ్ జోకర్’ చిత్రంతో రిషి బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. అదేవిధంగా రాజ్‌కపూర్ ‘శ్రీ 420’ చిత్రంలోని ఓ రెయిన్ సాంగ్‌లోనూ ఆయన దర్శనమిచ్చారు. ఇక ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడే నేషనల్ అవార్డు అందుకున్న రిషికపూర్.. 1973లో వచ్చిన ‘బాబి’ సినిమాతో హీరోగా మారారు. తొలి సినిమాతోనే ఆయన బెస్ట్ యాక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డ్ అందుకోవడం విశేషం. తన కెరీర్‌లో సోలో హీరోగా 51 సినిమాలు చేశారు రిషి కపూర్. వీటిలో బాబి, నాగిన, చాందిని, కర్జ్, ప్రేమ్ రోగ్ లాంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఆయన నటించిన 41 మల్టీస్టారర్ సినిమాల్లో 25 చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి.
రాజేష్ ఖన్నాను హీరోగా తీసుకోవడానికి డబ్బుల్లేక…
రాజ్‌కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాబి’ చిత్రంతో రిషికపూర్ కథానాయకుడిగా పరిచయమయ్యారు. డింపుల్ కపాడియా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 1973లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ‘బాబి’ చిత్రం గురించి ఓ సందర్భంలో రిషి కపూర్ మాట్లాడుతూ “నటుడిగా నన్ను వెండితెరకు పరిచయం చేయడానికి ‘బాబి’ సినిమా తెరకెక్కించారని అందరూ అపోహపడుతున్నారు. కానీ ‘మేరా నామ్ జోకర్’ సినిమాకు ఉన్న అప్పులు తీర్చడం కోసం ఈ సినిమాని మా తండ్రి తెరకెక్కించారు. ఓ యువ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన భావించారు. అయితే ఈ సినిమాలో రాజేశ్ ఖన్నాను హీరోగా తీసుకోడానికి డబ్బుల్లేక నన్ను హీరోగా పరిచయం చేశారు” అని తెలిపారు. ఈ సినిమాతోనే రిషికపూర్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకోవడం విశేషం.
దర్శకుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా…
1999 సంవత్సరంలో దర్శకుడిగా కూడా మారిన రిషికపూర్ 2000 సంవత్సరం నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అదేవిధంగా ఆర్.కె.ఫిలిమ్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు నిర్మించారు. హమ్ తుమ్, ఫనా, నమస్తే లండన్, లవ్ ఆజ్ కల్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే గత ఏడాది వరకు ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో రిషి కపూర్ కీలక పాత్రలో నటించిన ‘ది బాడీ’ చిత్రం విడుదలైంది. ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో శోభితా దూళిపాళ్ల హీరోయిన్‌గా చేసింది. ఈ ఏడాది కూడా ఆయన ఓ కొత్త సినిమాను ప్రకటించారు. ఇంతలోనే ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం ఆయన అభిమానులకు ఎంతో బాధపెట్టింది.
సహనటితో వివాహం…
తన సహనటి నీతూసింగ్‌ను 1980లో పెళ్లాడారు రిషికపూర్. వీళ్లిద్దరూ కలిసి 15 సినిమాల్లో నటించారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. కూతురు రిద్దిమా కపూర్ డిజైనర్ గా స్థిరపడగా, కొడుకు రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.
చిరునవ్వులు రావాలి తప్ప కన్నీరు రాకూడదు…
రిషికపూర్ మృతి చెందడంతో పలువురు సెలబ్రిటీలు ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే ఆయన మరణవార్త విన్న వెంటనే బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకున్నారు. రిషి కపూర్ కుటుంబసభ్యులను ఓదార్చడానికి ఆమె అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా రిషి కపూర్ మరణ వార్తను ధృవీకరిస్తూ ఆయన కుటుంబసభ్యులు ఓ భావోద్వేగపు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. బాలనటుడిగా, హీరోగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన రిషి కపూర్ గుర్తుకు వస్తే ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు రావాలి తప్ప కన్నీరు రాకూడదని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఏప్రిల్ 2న చివరి ట్వీట్…
‘ది బాడీ’ చిత్రం తర్వాత ఆయన ఏ చిత్రంలోనూ కనిపించలేదు. సినిమాల్లో నటించనప్పటికీ సోషల్‌మీడియా వేదికగా పలు సందర్భాల్లో ఆయన స్పందించేవారు. కరోనా వైరస్‌పై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు సెల్యూట్ చేస్తూ రిషి కపూర్ ఏప్రిల్ 2 తేదీన తన చివరి ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఎలాంటి ట్వీట్లు చేయలేదు.
చివరి వీడియో…
రిషికపూర్ చివరిసారిగా దర్శనమిచ్చిన వీడియో ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ‘దీవానా’ చిత్రంలోని ‘తేరీ దర్ సే దిల్ అబాద్ రహా’ పాటను ఆలపిస్తుండగా రిషికపూర్ హాస్పిటిల్ బెడ్‌పై పడుకొని ‘వెరీ గుడ్’ అంటూ కనిపించారు. అనంతరం ఆ యువడిని ఆయన ఆశీర్వదించారు. ఈ వీడియోలో రిషికపూర్ ఎంతో సంతోషంగా కనిపించారు.

పలు అవార్డులు అందుకొని…


బాలీవుడ్ అగ్ర నటుడు రిషికపూర్ హీరోగా తన తొలి చిత్రం ‘బాబి’తో ఉత్తమ నటుడిగా 1974లో ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. 2008లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయనను వరించింది. 2011లో ‘దో దూని చార్’ చిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డును రిషికపూర్ అందుకున్నారు. అదేవిధంగా ‘కపూర్ అండ్ సన్స్’ చిత్రానికి గాను 2017లో ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు ఆయనకు దక్కింది. ఇక టిఎస్‌ఆర్ టివి9-నేషనల్ ఫిల్మ్ అవార్డును 2014లో రిషికపూర్‌కు అందజేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు శతృఘ్నసిన్హా, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబుల సమక్షంలో రిషికపూర్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు. వీటితో పాటు పలు అవార్డులను రిషికపూర్ అందుకున్నారు.


అంత్యక్రియలు పూర్తి…
రిషికపూర్ అంత్యక్రియలు ముంబయ్ చందన్‌వాడి స్మశానంలో జరిగాయి. అంత్యక్రియలకు ఆయన కుటుంబసభ్యులు, కొందరు ప్రముఖులు హాజరయ్యారు. రిషి భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణ్‌ధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అలియా భట్, అభిషేక్ బచ్చన్ తదితరులు ఈ అంత్యక్రియల్లో పాల్గొని రిషికపూర్‌కు అంతిమ వీడ్కోలు పలికారు.

చిత్ర సీమ ఆణిముత్యాన్ని కోల్పోయింది…
బాలీవుడ్ అగ్ర నటుడు రిషి కపూర్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రిషిని అద్భుతమైన టాలెంట్ ఉన్న శక్తిమంతుడిగా అభివర్ణించారు మోదీ. బహుముఖ ప్రజ్ఞాశాలి రిషితో తన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. మూవీలే తన ప్రాణమని చెప్పే రిషి ఈ దేశ అభ్యున్నతికి తన వంతు కృషి చేశారన్నారు. అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రిషికపూర్ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రలు పోషించి.. రొమాంటిక్ హీరోగా పాపులర్ అయిన రిషి మృతితో ఈ దేశం అత్యంత ఆప్తుడైన కొడుకును, చిత్ర సీమ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిషీ కపూర్ మృతిపై ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అమిత్ షా తన ట్వీట్‌లో రిషీ కపూర్ మృతి చాలా బాధాకరమైన ఘటన అని అన్నారు. ఆయన మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కోలుకోలేని నష్టమని చెప్పారు. రిషి కపూర్ తన అసాధారణమైన ప్రతిభతో ఎల్లప్పుడూ గుర్తుంచుకోబడతారని చెప్పారు. అతని కుటుంబానికి సంతాపం ప్రకటించారు. వీరితో పాటు రాహుల్ గాంధీ, శశిథరూర్ వంటి వారు సోషల్ మీడియా ద్వారా రిషి కపూర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సినీ ప్రముఖుల సంతాపం…
రిషి కపూర్ మరణించడంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో రిషి కపూర్ జీవితంలోని సంఘటనలు, ఆయన పోషించిన పాత్రలు, ఆయనతో తమకున్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఆయనకు కడసారిగా చూసి నివాళులు అర్పించే అవకాశం కూడా లేకపోవటంతో సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ మాత్రమే కాదు రిషి కపూర్ మరణం పట్ల యావత్ భారత చలనచిత్ర రంగ ప్రముఖులు ఎమోషనల్ అయిపోయి తమ నివాళులు అర్పిస్తున్నారు.
రిషి జీ లేరనే వార్త ఒక్కసారి నన్ను కుదిపేసింది. నాకు అత్యంత స్నేహితుడు, గొప్ప నటుడు ఆయన. లవర్ బాయ్ ఇమేజ్‌తో లక్షలాది మంది హృదయాలను దోచుకొన్న హీరో. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆయనకు నా కన్నీటి వీడ్కోలు చెబుతున్నా. — చిరంజీవి
రిషీ కపూర్ మరణం నన్ను కలిచివేసింది. ఆర్‌ఐపి.. మై డియరెస్ట్ ఫ్రెండ్‌” — రజనీకాంత్
రిషీ కపూర్ చనిపోయారు. ఆయన మరణం నన్ను కుంగిపోయేలా చేసింది. — అమితాబ్ బచ్చన్
పరిస్థితులు చూస్తుంటే మనం పీడకల మధ్యలో ఉన్నట్టు ఉంది. ఇప్పుడే రిషి కపూర్ లేరనే హృదయాన్ని కలిచివేసే వార్త విన్నాను. ఆయన ఒక లెజెండ్, గొప్ప సహచర నటుడు. మా కుటుంబానికి మంచి స్నేహితుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. — అక్షయ్ కుమార్
ఒకదాని తర్వాత మరో విషాదం. రిషి కపూర్ జీ మరణం తీవ్రంగా కలిచివేసింది. రాజు చాచా (2000) చిత్రంతో మా ఇద్దరి ప్రయాణం, బంధం మొదలైంది.. అప్పటి నుంచి అది కొనసాగుతూనే ఉంది. నీతూజీ,- రణబీర్, – రిధిమాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. — అజయ్ దేవగన్
రిషీ కపూర్ సార్ గురించి విన్న వార్త హృదయ విదారకం. సినిమా పరిశ్రమకి మరో కోలుకోలేని నష్టం. ఆయన ప్రతిభావంతుడైన నటుడు. నిజమైన లెజెండ్. రణబీర్, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియాజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. — మహేష్ బాబు
రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. — నందమూరి బాలకృష్ణ
మీరు లేకపోవడం మా కుటుంబానికి పెద్ద నష్టమే అవుతుంది సార్. ఇలాంటి కఠిన సమయాల్లో కపూర్ కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. — వెంకటేష్
నిజంగా హార్ట్ బ్రేక్ అయింది. నిన్న అద్భుతమైన టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్‌ని కోల్పోయాము. ఇక ఇప్పుడు మరో లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ సాబ్ కూడా మన నుంచి దూరమయ్యారు. సినిమా ఇండస్ట్రీకి ఇది దారుణమైన దెబ్బ. మంచి నటులను కోల్పోయాము. — ఎన్టీఆర్
ప్రముఖ నటుడు రిషి కపూర్ ఇక లేరు అనే వార్తతో నా గుండె ముక్కలైంది. భారతీయ సినిమాకు విశేష సేవలందించిన నట దిగ్గజ తార నేలరాలింది. కపూర్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. — రామ్‌చరణ్
రిషి కపూర్ ఇకలేరనే వార్తతో నోట మాటలు రావడం లేదు. రిషి మరణంతో సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. — జాగర్లమూడి క్రిష్

రిషి కపూర్ మరణం నాలో చాలా విషాదాన్ని నింపింది. 24 గంటల్లోనే ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం షాక్ కు గురిచేసింది. సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు. వారి సినిమాల ద్వారా వారు జీవించే ఉంటారు. – నందమూరి కల్యాణ్‌రామ్
ఓ మై గాడ్.. ఇది జరిగి ఉండాల్సి కాదు. రిషి కపూర్ సార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 24 గంటల్లో ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం ఎలా ఉంటుంది?.. ఇది తీరని నష్టం. — కాజల్ అగర్వాల్
నేను ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. ఈ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జరుగుతుంది చూస్తుంటే భయమేస్తోంది. ఇంతా త్వరగా మరో లెజెండ్ మనల్ని విడిచిపోయారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. — పూజా హెగ్డే

Bollywood Actor Rishi Kapoor passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News