Friday, April 19, 2024

బ్రెజిల్‌లో కుట్రపూరిత విధ్వంసం!

- Advertisement -
- Advertisement -

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగా మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు, ఆయన ఆదేశాల మేరకు నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్షుని ప్యాలెస్‌లపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడి వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసి విఫలమైనారు. వీరి దాడిలో నేషనల్ కాంగ్రెస్ భవనం ధ్వంసం అయింది. చట్ట సభ్యుల కార్యాలయాల్లోకి చొరబడి నాశనం చేశారు. ప్రభుత్వంపై తిరగబడమని సైన్యాన్ని ఉద్దేశించి బ్యానర్లు ఎగురేశారు. సైన్యం లూలా డ సిల్వాకు మద్దతుగా నిలబడి తిరుగుబాటును అణచివేసింది.

దక్షిణ అమెరికా దేశాల్లో బ్రెజిల్ అతిపెద్ద దేశం. దక్షిణ అమెరికా భూ భాగంలో సగం విస్తీర్ణత కలిగి ఉంది. జనాభా రీత్యా ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశం. దక్షిణ అమెరికా ఖండంలో 45.3% భూభాగం కలిగి ఉంది. బ్రెజిల్‌లోని అమెజాన్ ముఖ ద్వారంలో విస్తారమైన ఉష్ణ మండల అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. వైవిధ్యమైన పర్యావరణం, విస్తారమైన జంతుజాలం, సహజ వనరులు అభయారణ్యాలకు నిలయంగా ఉంది. బ్రెజిల్ 1500 సంవత్సరం నుండి 1822 వరకు పోర్చుగీస్ వలస పాలన కింద ఉంది. 1822లో స్వాతంత్య్రం పొందింది. 1824లో మొట్టమొదటి రాజ్యాంగం ఆమోదం పొంది ద్విసభ శాసనసభ ఏర్పడింది.

ప్రస్తుతం బ్రెజిల్ ‘నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ బ్రెజిల్’ గా పిలవబడుతున్నది. 1889లో జరిగిన తిరుగుబాటు తర్వాత ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్‌గా మారింది. 1964లో మరో సైనిక తిరుగుబాటు జరిగి అధికారిక బ్రెజిలియన్ సైనిక నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడి 1985 వరకు అధికారంలో ఉంది. 1988లో రూపొందించిన ప్రస్తుత బ్రెజిల్ రాజ్యాంగం ఫెడరల్ రిపబ్లిక్‌గా గుర్తింపు పొందింది. ఐక్యరాజ్య స్థాపక దేశాల్లో బ్రెజిల్ ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచ అత్యున్నత ఆర్థిక వ్యవస్థలలో బ్రెజిల్ ఒకటిగా ప్రచారంలో ఉంది. వలస పాలనలో, సైనిక నియంతృత్వ పాలనలో ఆర్ధిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. సైనిక పాలన తొలగినా, దాని ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఆర్ధిక అసమానతల్లో మార్పులు సంభవించలేదు. దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమై విధానాలు అమలు జరిగాయి. పేదరికం, నిరుద్యోగం పెరిగింది. ప్రజా అణచివేత చట్టాలు అమలు జరిగాయి. విదేశీ పెట్టుబడులు, విదేశీ రుణాల శాతం పెరిగింది. దేశంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది.

సైనిక పాలనలో దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో బ్రెజిల్ వర్కర్స్ పార్టీ స్థాపన జరిగింది. అందుకు లూలా డ సిల్వా తోడ్పాటు అందించాడు. 1986లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో సావోపాలో రాష్ట్రం నుంచి దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఫెడరల్ డిప్యూటీగా ఎన్నికయ్యాడు. 1994, 1998 సంవత్సరాల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తిరిగి 2002లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాడు. 2006లోనూ అధ్యక్షునిగా తిరిగి ఎన్నికయ్యాడు. లులా డ సిల్వా పాలనలో ప్రజా అనుకూలమైన అనేక సంస్కరణలు అమలు జరిగాయి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల ద్వారా సంపదను పునః పంపిణీ చేసింది. కొనుగోలు శక్తి పెరగటానికి కనీస వేతనాన్ని పెంచింది. దాని ఫలితంగా దేశ స్థూల ఆదాయం (జిడిపి) అభివృద్ధి చెందింది. ప్రజలపై రుణ భారం, ద్రవ్యోల్బణం తగ్గింది.

రెండు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరికం, అసమానత, నిరక్షరాస్యత, నిరుద్యోగం, శిశు మరణాలు, బాల కార్మికుల రేటు గణనీయంగా తగ్గింది. కనీస వేతనం, సగటు ఆదాయం పెరిగింది. ఆ విధంగా కొన్ని పరిమిత ప్రజా అనుకూల విధానాలతో తన పాలనలో లులా డ సిల్వా మార్పులు తీసుకొచ్చాడు. పెట్టుబడిదారుల ఆధిపత్యాన్ని తగ్గించే విధానాలు అమలు జరపడంలో మెతక వైఖరి అనుసరించాడు. లూలా ఆర్థిక విధానాలు పెట్టుబడిదారుల, సంపన్న వర్గాల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండటంతో, వాటిని వ్యతిరేకిస్తూ లూలా వ్యతిరేక ప్రచారం తీవ్రంగా చేశారు. ఈ ప్రచారానికి తోడుగా 2014లో ఆపరేషన్ కార్ వాచ్ ద్వారా కొందరు మంత్రు ల అవనీతి బయటపడటం, దానికి లూలాను బాధ్యత చేసిన ఫలితంగా 12 సంవత్సరాల శిక్ష విధించి జైలుకు పంపటం కుట్రపూరితంగా జరిగింది.

లూలా వారసుడిగా బ్రెజిల్ వర్కర్స్ పార్టీ తరపున సుడు దిల్మారౌసెఫ్ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆమె స్థూల ఆర్ధిక పన్ను మినహాయింపులు, సబ్సిడీలు ప్రవేశపెట్టారు. 2014 సంవత్సరం లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పిఎస్‌డిబి అభ్యర్ధి ఏసియా నెవ్స్‌ను స్వల్ప తేడాతో ఓడించి దిల్మా రౌసెఫ్ అధ్యక్షురాలుగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక వివాదాస్పదం కావటం, ఆఫరేషన్ కార్ వాస్, ఆర్ధిక సంక్షోభం కారణంగా దిల్మా రౌసెఫ్‌పై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. 2015 నాటికి ఆమె అనుకూల రేటు 8% పడిపోయింది. అందుకు కారణం ఆమె అనుసరించిన విధానాలే కారణంగా ఉన్నాయి. 2014 జూన్ నుండి బ్రెజిల్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశం స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 2015లో 3.5% ఉండగా, 2016లో 3.3%కి పడిపోయింది. నిరుద్యోగం 2014లో 6.8% ఉండగా, 2015 నాటికి 8.5% కి చేరుకుంది. 2015లో ఆర్థిక వ్యవస్థ 1.5 మిలియన్ల ఉద్యోగాలను కోల్పోయింది. 2016 నాటికి నిరుద్యోగం పెరుగుతూ 12% కి చేరుకుంది. నిరుద్యోగులు కోటి ఇరవై లక్షల 30 వేల మందిగా ఉన్నారు.

రెండు సంవత్సరాల క్రితం 20 లక్షల 80 వేల ప్రైవేట్ ఉద్యోగాలు తగ్గించబడ్డాయి. వీటన్నిటి ఫలితంగా దిల్మా రౌసెఫ్ నాయకత్వంపై అసంతృప్తి ప్రబలింది. 2019 మొదటి త్రైమాసికంలో మొత్తం నిరుద్యోగం రేటు 12.7% ఉంది. మాంద్యం, ఆర్థిక సంక్షోభానికి పెరుగుతున్న బడ్జెట్ లోటుకి కారణమైంది. ఆర్థిక మాంద్యం కారణంగా గత రెండేళ్లలో పన్నుల వసూళ్ల తగ్గి ఖర్చులు పెరిగాయి. వాలర్ ఎకనామిక్ అనే మ్యాగజైన్ ద్వారా పొందిన పంఢా కో గెట్యువియో వర్గాస్ (ఎఫ్‌జివి) లో భాగమైన (Institute to Brasileiro de Economia (IBRE) 2019 అధ్యయనం ప్రకారం సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. మరోవైపు గత ఏడేళ్లలో 10% అగ్రశ్రేణి సంపన్నుల సంపద 8.5% పెరిగింది. పేదల సంపద 14% పడిపోయింది. ఈ పరిణామాలకు కారణం లులా డ సిల్వా అమలు జరిపిన విధానాలకు ఆమె తిలోదకాలు ఇవ్వటమే. దేశంలో ఏర్పడిన సంక్షోభం వలన దిల్మా రౌసెఫ్ అభిశంసనకు గురైంది. ఫలితంగా రౌసెఫ్ స్థానంలో మిచెల్ టిమెర్ అధ్యక్షుడయ్యాడు.

2018లో జరిగిన ఎన్నికల్లో సోషల్ క్రిష్టయన్ పార్టీ తరపున బాల్సొనారో పోటీ చేసి గెలుపొందిన తరువాత 2019లో దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. బాల్సోనారో పచ్చి మితవాద, చాందసవాద పెట్టుబడిదారీ వర్గ రాజకీయాలకు ప్రతినిధి. 1964 నుండి 1985 వరకు బ్రెజిల్‌ని పాలించిన సైనిక ప్రభుత్వం పట్ల అభిమానాన్ని వ్యక్తం చేశాడు. సైనిక ప్రభుత్వంలో కెప్టెన్ అయ్యా డు. అనేక సార్లు పార్టీలు మారి చివరికి సోషల్ క్రిష్టియన్ పార్టీలో చేరి అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడవటానికి ఎన్నికల ప్రచారంలో అనేక బూటకపు వాగ్దానాలు చేశాడు. అవినీతిని రూపుమాపుతానని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తానని, 2015 పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని, లులా డ సిల్వా సంస్కరలు వలన దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ప్రత్యర్ధులకు అవకాశం ఇస్తే దేశం నాశనమవుతుందని ప్రజల్లోకి అవాస్తవాలను బలంగా తీసుకెళ్ళాడు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేయటానికి నిరంతర ప్రయత్నం చేశాడు. స్త్రీల పట్ల అమిత ద్వేషాన్ని, మానవత్వ విలువల పట్ల వ్యతిరేకత ప్రదర్శించాడు. మురికివాడల్లో నివసించే పేదలను నేరస్థులుగా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులుగా చిత్రించా డు. పర్యావరణం పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా, అమెజాన్ అడవుల విధ్వంసానికి పూనుకున్నాడు. ప్రజల మధ్య విద్వేషాలు పెంచాడు. పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుకూల విధానాలు అమలు పర్చాడు. సుప్రీంకోర్టును తన అనుయాయులతో నింపాడు. ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా కేంద్రీకృతానికి మార్చాడు. నిరుద్యోగం, పేదరికం పెరిగింది. అవనీతి కుంభకోణాలకు పాల్పడ్డాడు. వీటన్నిటి ఫలితంగా ప్రజల ఆగ్రహానికి గురైనాడు.

2022 బ్రెజిల్ ఎన్నికల నాటికి లులా డ సిల్వా జైలు నుంచి విడదలై వచ్చాడు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశాడు. బొల్సొనారో, లులా డ సిల్వా పరిపాలన మధ్య వ్యత్యాసం చూసిన ప్రజలు లులా డ సిల్వాను తిరిగి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని బొల్సానారో అభిమానులు, బడా పెట్టుబడిదారులు లులా గెలుపును గుర్తించమని, ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి దింపాలని, సైన్యం జోక్యం చేసుకోవాలని నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. చివరికి అధ్యక్షుడి భవనం, నేషనల్ కాంగ్రెస్, సుఫ్రీమ్ కోర్టు భవనాల విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రజా వ్యతిరేక దోపిడీ పాలకులు, పెట్టుబడిదారులు పరిమితమైన ప్రజా అనుకూల సంస్కరణలను కూడా సహించరని ఈ విధ్వంసం వెల్లడిస్తున్నది. రాజ్యాంగాన్ని, సైన్యాన్ని సమూలంగా మార్చకుండా ప్రజా హితం కోరే ప్రభుత్వాలు మనుగడ సాగించటం క్షణక్షణం గండమన్న వాస్తవాన్ని ఈ విద్వంసం తెలియచేస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News