Home జాతీయ వార్తలు వరవరరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజురు

వరవరరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజురు

Bombay HC granted 6-month bail to varavara rao

 

హైదరాబాద్: బీమా కోరేగావ్ కేసులో 81 ఏళ్ల కవి, విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో వున్న వరవరరావుకు ఆరోగ్య పరిస్థితులు రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఆరు నెలల పాటు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే, ఆయన బెయిల్ సమయంలో ముంబయిలోనే ఉండాలని, విచారణకు అందుబాటులో ఉండాలని షరతులు విధించింది. వరవరరావు వయసు, ఆరోగ్య పరిస్థితులతో పాటు తలోజా జైల్ హాస్పిటల్‌లో తగిన సౌకర్యాలు లేకపోవడాన్ని బెయిల్ మంజూరు చేయడానికి సహేతుక కారణాలుగా భావిస్తున్నట్లు కోర్టు చెప్పిందని ‘లైవ్ లా’ వెబ్‌సైట్ వెల్లడించింది. వరవరరావుకు బెయిల్ నిరాకరిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సంక్రమించిన మానవ హక్కులు, ఆరోగ్య హక్కు పరిరక్షణ బాధ్యతను విస్మరించినట్లేనని ధర్మాసనం అభిప్రాయపడింది. తీర్పు కాపీ అందాక పూర్తి వివరాలు చెబుతామని వరవరరావు బంధువు వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ అన్నారు.

‘మాకు ఇంకా తీర్పు కాపీ అందలేదు. కానీ ముంబైలోనే ఉండాలి అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే, బెయిల్ రానట్టే లెక్క. ముంబైలో ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఆయన భార్య కూడా ప్రస్తుతం అక్కడ ఉండే పరిస్థితుల్లో లేరు. తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తిగా చెప్పగలం’ అని వేణుగోపాల్ అన్నారు. వరవరరావు బీమా కోరేగావ్ అల్లర్ల కేసులో 2018 జనవరిలో అరెస్టయ్యారు. అప్పట్నించీ పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ఆయనపై తీవ్రవాద నిరోధక చట్టం (యుఏపిఏ) ఆరోపణలు మోపారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా వరవరరావును విడుదల చేయాలని ఆయన కుటుంబసభ్యులు కోరారు. విరసం నేత, కవి వరవరరావుకు బెయిల్ ఇవ్వడం కుదరదని గతేడాది నవంబర్‌లో బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు వీడియో కాల్ ద్వారా పరిశీలిస్తారని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్లి వైద్య సహాయం అందిస్తారని అప్పట్లో కోర్టు తెలిపింది.

Bombay HC granted 6-month bail to varavara rao