Home వరంగల్ గుళ్లపల్లి రాజ్‌కుమార్ అలియాస్ బాంబుల కుమార్

గుళ్లపల్లి రాజ్‌కుమార్ అలియాస్ బాంబుల కుమార్

Bomber Kumar's relations with the Bhadrakali fire wars bomb blasts

తెర వెనుక కథేంటి…..

మనతెలంగాణ/వరంగల్ అర్బన్ జిల్లా: భద్రకాళీ ఫైర్ వర్స్ బాంబు పేలుళ్ల సంఘటనకు పరిశ్రమ యాజమాని గుళ్లపల్లి రాజ్‌కుమార్ అలియాస్ బాంబుల కుమార్‌కు ఉన్న సంబంధాలు ఎలాంటివి…? అసలు గుళ్లపల్లి రాజ్‌కుమార్, బాంబుల కుమార్ ఒకరేనా..? ఈ రెండు పేర్లతో సంబంధం ఉన్న వ్యక్తి ఒకరేనా..ఇద్దరా..? ఇద్దరైతే అసలు బాంబుల కుమార్ ఎవరు …? గుళ్లపల్లి రాజ్‌కుమార్‌కు బాంబుల కుమార్ అని పేరు ఎలా వచ్చింది. అసలు తెర వెనుక ఉన్న కథ ఎంటి..? ముందుగా బాంబుల కుమార్ వ్యక్తి గురించి పరిశోధించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి. బాంబుల కుమార్ అసలు పేరు వంగర కుమారస్వామి. ఇతనిది వరంగల్ జిల్లా కేంద్రంలోని కరిమాబాద్ స్వస్థలం. వంగర కుమారస్వామికి దీపావళి బాంబులను కాల్చడం చిన్నప్పటి నుంచి అమితమైన ఇష్టం. ఇందులోనే తన నైపుణ్యాన్ని పెంచుకోవాలని తన 17వ యేటనే ఆంధ్రలోని అనకాపల్లి, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలలో దీపావళి బాంబులు ఎలా తయారుచేస్తారు అని ఆ ప్రాంతానికి సంబంధించిన సూరిబాబు, మస్తాన్, పాషా, సంజీవ్‌బాబులను పరిచయం చేసుకోని వారి ద్వారా బాంబుల తయారి వాటిని టెక్నిక్‌గా పేల్చడం లాంటి వాటిలో పూర్తి స్థాయి శిక్షణను తీసుకున్నారు. మూడు 8 సంవత్సరాల తర్వాత వరంగల్‌లో చిన్న బాంబుల కొట్టును ఏర్పాటు చేసుకోని అమ్మకాలు నిర్వహిస్తూ దసరా, దీపావళి పండుగలకు నరకసుర వధకు బాంబులను అమర్చి చాకచక్యంగా పేల్చేవారు. ముందుగా ఉర్సు, కరిమాబాద్‌లోని రంగలీల మైదానంలో వరంగల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేది. ఆ కార్యక్రమంలో నరకాసుర వధకు వంగర కుమారస్వామిని వివిధ ఆకృతులతో కూడుకున్న బాంబులను అమర్చి పేల్చే బాధ్యతను ఆయనకు అప్పజెప్పడంతో అక్కడకు వచ్చిన ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయే విధంగా బాంబులు పేలేవి. అక్కడి నుంచి వంగర కుమారస్వామి వ్యాపార ప్రస్తావన మొదలై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వంగర కుమారస్వామిని రావణవధ, నరకాసుర వధలను నిర్వహించడానికి నిర్వాహకులు ఆహ్వానించేవారు. అప్పుడే ఆయన ఇంటి పేరు వంగర పోయి బాంబుల కుమార్‌గా నామకరణం జరిగింది. బాంబుల కుమార్ అంటే రావణ, నరకాసుర సంహార కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారని అధికారులకు, ప్రజాప్రతినిధులకు గుర్తుండి పోయాడు. దానికి అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ మహేశ్ దత్ ఎక్కా ఆధ్వర్యంలో రంగలీల మైదానంలో మొదటి సారిగా బాంబుల కుమార్ అలియాస్ వంగర కుమారస్వామి పేరుతో అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత కొండ దంపతుల అవార్డులతో పాటు ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం పరంగా అవార్డుల పంట కొనసాగింది. ఇంతా పేరు, ప్రఖ్యాతలు, నైపుణ్యం సంపాదించిన బాంబుల కుమార్ ఆర్ధికంగా పెద్దగా ఎదగాలేదు. అప్పుడే గుళ్లపల్లి రాజ్‌కుమార్ స్థానికుడైనప్పటికి వంగర కుమరస్వామితో పరిచయం ఏర్పాటు చేసుకోని అతని వద్దనే బాంబుల తయారి, వాటిని పేల్చివేయడంపై శిక్షణను తీసుకున్నాడు. అంతటితో వంగర కుమారస్వామితో గుళ్పపల్లి కుమారస్వామి సంబంధాలు తెగదెంపులు చేసుకోలేదు. 2005లో గుళ్లపల్లి కుమారస్వామి మరో వ్యక్తి బాలరాజుతో కలిసి రాజరాజేశ్వర పైర్ వర్క్ పరిశ్రమను స్థాపించారు. అందులో వంగర కుమారస్వామి బాంబులు తయారుచేయడానికి నెలసరి వేతనంపై రాజ్‌కుమార్ నియమించుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అందులో బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రాణనష్టం జరుగకుండా వారిపై కేసు నమోదు కావడంతో బాలరాజు, రాజ్‌కుమార్‌లు జైలు పాలయ్యారు. ఆ తర్వాత భద్రకాళీ ఫైర్ వర్స్ పరిశ్రమను స్థాపించారు. అందులో వంగర కుమారస్వామిని బాంబుల తయారికి ప్రధాన వ్యక్తిగా నియమించుకోని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. 2007 నుండి భద్రకాళీ ఫైర్ వర్స్ ఉత్పత్తులు ఎక్కువగా విక్రయం కావడంతో క్రమక్రమంగా బాంబుల కుమార్ అలియాస్ వంగర కుమార్ ఎవరో బయటి సమాజానికి తెలియకుండా పోయింది. అవార్డులు పొందిన బాంబుల కుమార్ పరిశ్రమ ఉత్పత్తి కేంద్రానికి పరిమితం కావడం అనుహ్యంగా గుళ్లపల్లి కుమారే బాంబుల కుమార్‌గా అవతారమెత్తాడు. దాంతో ఆయన దశే మారిపోయింది.

చైనాలో శిక్షణ : అంతరాష్ట్రాలకు బాంబుల ఎగుమతి వంగర కుమారస్వామి అలియాస్ బాంబుల కుమార్ ఉత్పత్తి కేంద్రానికి పరిమితం అయి లక్షల్లో వ్యాపారం టర్నోవర్ అవుతుండగా దీని రేంజ్‌ను ఇంకా పెంచాలనే ఉద్దేశ్యంతో గుళ్లపల్లి రాజ్‌కుమార్ చైనాకు వెళ్లి కొత్త కొత్త బాంబుల తయారిపై శిక్షణ తీసుకున్నాడు. రాజ్‌కుమార్ సూచ మేరకు వంగరకుమారస్వామి మరో 20 మంది కార్మికులతో కలిసి కొత్త కొత్త డిజైన్‌లతో కూడిన బాంబుల ఉత్పత్తిని పెంచారు. దానివల్ల రాజ్‌కుమార్ స్థానికంగా ఉన్న వ్యాపారాన్ని డిల్లీ, బెంగుళూరు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, చత్తిస్‌ఘడ్‌లకు బాంబులను ఎగుమతి చేసి వ్యాపారాన్ని కోట్ల రూపాయల టర్నోవర్‌కు పెంచేసాడు. ఒక్క పరిశ్రమతో ప్రారంభమైన భద్రకాళీ ఫైర్‌వర్క్ మూడు గోదాంలకు కోట్ల రూపాయల సరుకు నిల్వకు ఎదిగింది. రాజ్‌కుమార్‌కు మార్గం చూపి ఉత్పత్తి రంగంలో అందె వేసిన చేయి గా సహకరించిన వంగర కుమారస్వామికి 2009లో పక్షవాతం వ్యాది వచ్చి నోటి మాట కూడా పడిపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో అసలు బాంబుల కుమార్ చరిత్రే ముగిసిపోయినట్లు అయ్యింది. కుటుంబం గడవకపోవడంతో తన ఇద్దరు కొడుకులు శివకుమార్, రాకేశ్‌లు మైనర్లు అయినప్పటికి అదే పరిశ్రమలో పనికి పంపాడు. వారితో పాటు అత ని బావమర్ది కుమారుడు మల్లికార్జున్ కూడా అందులోనే నియమించారు. అప్పటినుండి ఇప్పటివరకు అదే పరిశ్రమలో వారు పనిచేస్తూ కుటుంబానికి ఆసరగా నిలిచారు. గత సంవత్సరం కుమారస్వామి పెద్దకోడుకు శివకుమార్‌కు వివాహం కావడంతో అతను బాంబుల తయారి పనికి బందయ్యాడు., రాకేశ్, మల్లికార్జున్‌లు యదావిధిగా కొనసాగారు.

జీతం పెంచమని, మృత్యు వు ఒడిలోకి : కుమారస్వామి కొడుకు రాకేశ్, అతని బావమర్ది కొడుకు మల్లికార్జున్ కూడా జీతం తక్కువగా ఉంది . జీతం పెంచితే ఇందలో కొనసాగుదాం లేదంటే వేరే పని చూసుకుందామని ప్యాక్టరికి వెళ్లిన ఇద్దరు బాంబు పేలుల్లో ముక్కలు ముక్కలు అయిపోయారని కుమారస్వామి భార్య దేవి, కుమారస్వామిలు కన్నిరుమున్నిరుగా విలపిస్తున్నారు. రాజ్‌కుమార్‌కు దారిచూపి న కుమారస్వామి అలియాస్ బాంబుల కుమార్ అవిటితనంతో మంచానికి పరిమితం అయిపోగా ఎదిగొచ్చిన కొడుకు బాంబు పేలుల్లో అంతం కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అవార్డులతో పేరు, ప్రతిష్టతలు, గౌరవప్రదమైన వృత్తి ఉంటుంది అనుకుంటే ఆ వృత్తే కుటుంబాన్ని సర్వ నాశనం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోతున్నాయి. కన్న కొడుకు దూరమైన కడుపుకోత బాదను కొంత కూడా తీర్చలేకపోయాయి. చివరకు బాంబుల కుమార్ భార్యకు భారంగా బ్రతికే పరిస్థితి వచ్చిందని కాలనీవాసులు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి మార్గాన్ని చూపిన బాంబుల కుమార్ కుటుంబానికి గుళ్లపల్లి రాజ్‌కుమార్ తన కొడుకుకు ఉపాధి చూపించి లేకుండా చేశాడే తప్పా ఆ కుటుంబానికి అనా పైసా సహాకారం కూడా జరుగలేదు. ప్రస్తుతం ఆ కుటుంబ పరిస్థితి హృదయ విదారకంగా తయారైంది.