Home ఆదిలాబాద్ బాల్యంపై బండెడు భారం

బాల్యంపై బండెడు భారం

student-wight-image

అమలుకు నోచుకోని చట్టాలు
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ బడులు
ఇష్టారీతిన కొనసాగిస్తున్న వ్యాపారాలు

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో: ఉదయాన్నే పుస్తకాల బ్యాగు భుజానికెత్తుకుని, లంచ్ బాక్స్ పట్టుకుని పాఠశాలలకు హూషారుగా వెళ్లే పిల్లలు…సాయంత్రం అవే బండెడు పుస్తకాల బరువును భుజానికెత్తుకుని నీరసంగా ఉసూరు మంటూ తిరిగి వస్తుంటే చూసి జాలి పడాలా..? లేక చదువు కోసమే కదా అని సర్దుకుపోవాలా..? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపుతున్నామని సంబరపడిపోతున్నామే తప్ప వారు మోస్తున్న పుస్తకాల బరువెంత…? ఎదురయ్యే సమస్యలేంటి అనే విషయాలను అటు తల్లిదండ్రులు, ఇటు విద్యా సంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. వయసుకు మించిన బరువుమోసి వెన్నెముక దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పసి వెన్నుపై పెను భారం పడుతోంది. భుజాన ఇసుక బస్తాలు మోసినట్లు పుస్తకాల బ్యాగులను మోస్తూ కార్పోరేట్ స్కూళ్లలో నాలుగైదు అంతస్తులు మెట్లు ఎక్కడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. కానీ మన భావి భారత పౌరులు రోజు అలానే మోస్తున్నారు. చదువుల పేరుతో వారితో బండెడు బరువు మోయిస్తున్నారు. బడి బ్యాగ్ విద్యార్థి బరువులో 10 శాతం మించకూడదని నిబంధలున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. విద్యార్థులు తమ బరువులో 25 నుంచి 30 శాతం బరువు మోసేస్తున్నారు. ఐదేళ్ల నుంచి పదిహేనేళ్ల వయస్సు గల పిల్లలు అధిక బరువు మోయరాదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక విద్యార్థి పుస్తకాలు, చూచిరాత నోట్స్‌లు, పెన్సిల్ బాక్స్‌చ వాటర్ బాటిల్. లంచ్ బాక్స ఇలా కలిపి దాదాపు 7 నుంచి 10 కిలోల బరువు ఉంటాయి. ఇది సుమారు ఆ పిల్లల బరువులో దాదాపు 30 శాతం ఉండటం గమనార్హం. పిల్లలను ఈ మోత నుంచి రక్షించడానికి ప్రభుత్వాలు చట్టాలను రూపొందించారు. కానీ అమలు మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. ఉచిత ప్రాథమిక నిర్బంద విద్యా చట్టం-2009, చిల్డ్రెన్ స్కూల్ బ్యాగ్ యాక్ట్-2006ల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన నిబందనలు ఉన్నాయి. ఆయా పాఠశాలలకు ఉత్తర్వులను సైతం పంపిస్తున్న అమలుకు నోచుకోవడం లేదు. చట్టాలపై అవగాహన లేక కొన్ని, తెలిసి నిర్లక్షంగా మరికొన్ని విద్యా సంస్థలు పిల్లలపై పెనుభారాన్ని తగ్గించడం లేదంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం 20104లో జీవో 22ను విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం 1 నుంచి 5వ తరగతి పిల్లలకు ఎటువంటి హోం వర్క్ ఇవ్వకూడదు. ఏయే తరగతికి ఎంతెంత బరువుండాలో సైతం జీవోలో సూచించారు. కానీ ఎవ్వరు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఐఐటీ కోచింగ్, స్మార్ట్ క్లాసులు, రివిజన్ టెస్ట్‌ల పేరుతో సాధారణ పాఠ్యపుస్తకాలతో పాటు సొంత ముద్రణ సంస్థల పుస్తకాలనున కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. వీటితో ఆర్థిక భారంతో పాటు పిల్లలకు మోత బరువు పడుతోంది. ఇదిలా ఉంటే పిల్లలు తమ బరువు కంటే 10-15 శాతం కన్న బరువు మోస్తే ఎముకల మధ్య ఉన్న మెత్తటి పదార్థం పగిలిపోవడంతో డిస్క్ కంప్రెషన్ జరిగి నడుము నొప్పి, కాళ్లు, పాదాల నొప్పులు వస్తాయంటున్నారు. అంతే కాకుండా ఎముకల పెరుదల ఆగి ఎత్తు అగిపోయి, గూని, స్కోలియోసిస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ యాజమాన్యాలు పుస్తకాల బరువును తగ్గించాలని పులువురు అంటున్నారు.