Home జాతీయ వార్తలు మోడీ శివాజీ అంతటివాడా?

మోడీ శివాజీ అంతటివాడా?

Book Book

 

బిజెపి నేత పుస్తకంపై భగ్గు

న్యూఢిల్లీ : ప్రధాని మోడీని మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీతో పోలుస్తూ రాసిన పుస్తకం వివాదాస్పదం అయింది. టుడేస్ శివాజీ నరేంద్ర మోడీ పేరిట వచ్చిన పుస్తకాన్ని బిజెపి నేత జై భగవాన్ గోయల్ రాశారు. ఆయననే ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో విడుదల చేశారు. అయితే ఈ పుస్తకంపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం నెలకొంది. తమకు అత్యంత అభిమాన పాత్రుడైన శివాజీతో మోడీని ఎలా పోలుస్తారని విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మూడు పార్టీలు శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపిలు ఈ అంశంపై ఇప్పుడు భగ్గుమన్నాయి.

ధీరోదాత్త మరాఠా నేత శివాజీ ఆదర్శాలను ఈ పుస్తకం కించపర్చిందని ఈ పార్టీల నేతలు వేర్వేరుగా మండిపడ్డారు.పుణేలో ఎన్‌సిపి , శంభాజీ దళం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. 48 గంటలలో పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే తీవ్రస్థాయి ఉద్యమాలు తప్పవని శంభాజీ బ్రిగేడ్ వారు హెచ్చరించారు. పుస్తకాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు. పుస్తకాన్ని తీసుకువచ్చిన గోయల్ గతంలో మహారాష్ట్రను, మరాఠీలను దుయ్యబట్టారని రౌత్ విమర్శించారు. అటువంటి వ్యక్తి రాసిన పుస్తకం ఇప్పుడు బిజెపి కార్యాలయంలో ప్రత్యేకంగా ఆవిష్కరించారు. దీనిని బట్టే బిజెపి వైఖరి ఏమిటనేది అర్థమవుతుందని తెలిపారు.

ఈ పుస్తకాన్ని తిడుతూ ఎన్‌సిపి నేత, మహారాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి ధనంజయ్ ముండే ట్వీటు వెలువరించారు. తమ శివాజీకి ఎవరూ సాటిరారని, ఆయనకు ఆయనే సాటి అని స్పష్టం చేశారు. పుస్తకంపై కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. మోడీని శివాజీతో పోల్చడాన్ని తాము ఖండిస్తున్నామని కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ స్పందించారు. శివాజీ తన ఆదర్శాలతో అందరినీ సంఘటితపర్చాడు. స్వరాజ్యను చాటి చెప్పాడు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి ఆ విలువలన్నింటికి చేటు కల్గిస్తున్నాడని, సరిపోల్చడం ద్వారా శివాజీ స్థాయిని దిగజార్చినట్లు అయిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

గోయల్‌కు సేన గతం
గోయల్ గతంలో శివసేన నేతగా ఉన్నారు. అయితే శివసేన వ్యవహరిస్తున్న ఉత్తర భారత వ్యతిరేక ధోరణికి నిరసనగా 2008లో సేనను వీడారు. 2014లో బిజెపిలో చేరిన ఆయన ఢిల్లీలో ఉంటున్నారు. బిజెపితో శివసేన విడిపోయి, మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన దశలో ఈ పుస్తకం వెలువడటం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయి కూర్చుంది.

Book comparing Modi with Shivaji rouses anger