Thursday, April 25, 2024

బూస్టర్ అధ్యాయం

- Advertisement -
- Advertisement -

covid 19 second wave in india

దేశంలో కరోనా బూస్టర్ టీకా అధ్యాయం మొదలైంది. ఈ విషయంలో మనం అమెరికా, పాశ్చాత్య దేశాల సరసన నిలబడినట్టే. విరుచుకుపడే విపత్తు తరణోపాయాల వైపు తరుముతుంది. ప్రాణాంతక స్థాయిలో ముంచుకొచ్చే వరదల్లో చేతికేది అందితే దానిని పట్టుకొని వొడ్డెక్కాలని ఆరాటపడడం సహజం. శాస్త్రీయ రుజువులు లేనప్పుడు అన్ని దారులనూ ఆశ్రయించక తప్పదు. వాస్తవానికి, దేశ జనాభా మొత్తానికి రెండు డోసుల టీకా పూర్తి కాలేదు. 2021 సంవత్సరాంతానికే ఈ లక్షాన్ని చేరుకోవాలని సంకల్పించాము. కాని దానిని చేరుకోలేకపోయాము. రెండవ టీకా తీసుకోనివారు దేశంలో ఇంకా విశేష సంఖ్యలో ఉన్నారు. రెండు డోసులు తీసుకొన్నవారికి తగినంత సమయం గడచిన తర్వాతనే బూస్టర్ డోసు వేస్తారు. వేసుకొన్న రెండు టీకాలు కొవిడ్‌తో పోరాటంలో శక్తి కోల్పోయే దశలో బూస్టర్ డోసు టీకా అవసరమవుతుంది.

పూర్తిస్థాయిలో టీకా (రెండు డోసులు) ప్రపంచమంతటికీ సమానంగా అందేలా చూసినప్పుడే కొవిడ్ కొత్త వేరియంట్లను అరికట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుత టీకాలు వొమిక్రాన్‌ను అరికట్టడంలో ఎంతవరకు పని చేస్తాయో ఇంకా నిర్ధారణ కాలేదని అది వొక నివేదికలో పేర్కొనగా, వొమిక్రాన్ మీద మూడో డోసు బూస్టర్ టీకా బాగా పని చేస్తుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ యోగ్యతా పత్రం ఇచ్చింది. అందుకు కొవిషీల్డ్ మేలైన టీకా అని చెప్పింది. ప్రస్తుతం వినియోగిస్తున్న టీకాల బూస్టర్ (మూడో ) డోసు వొమిక్రాన్ పై బాగా పనిచేస్తుందని, కొవిడ్ వ్యాక్సిన్‌ల మీద పరిశోధిస్తున్న ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్ జాన్ బెల్ ధ్రువీకరించారు. మొత్తానికి టీకా అందుబాటులో ధనిక పేద దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసమున్నప్పటికీ బూస్టర్ డోసు తీసుకోడం మంచిదేనని నిర్ధారణ అయినట్టుగానే భావించాలి. ఇరవై రోజుల క్రితం విడుదలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అప్పటికే ప్రపంచవ్యాప్తంగా రోజూ వేస్తున్న టీకాల్లో 20 శాతం బూస్టర్ టీకాలే. ఇప్పటికే 36 దేశాలు బూస్టర్ వేయడం ప్రారంభించాయి. 2021 సంవత్సరాంతానికి చాలా దేశాలు 41% పూర్తి వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని కూడా చేరుకోకపోగా, కొన్ని దేశాలు సమగ్ర టీకా కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని బాలల టీకాలు, బూస్టర్ వ్యాక్సిన్లను కూడా వేస్తున్నాయని ప్ర.ఆ.సంస్థ పేర్కొన్నది. కొవిడ్‌తో అసమ పోరాటం ఆ విధంగా సాగుతున్నది.

ధనిక నిర్ధనిక వ్యత్యాసం ఘనంగా దర్శనమిస్తున్నది. నూట ముప్పై కోట్ల మంది జనాభా గల మన దేశంలో, ముఖ్యంగా టీకా అవసరాన్ని గుర్తించే తీరిక ఆసక్తిలేని నిరుపేదలు చీమల బారుల్లా గల చోట అనేక అవతారాలుగా ముంచుకొస్తున్న కరోనాతో పోరాటంలో బహుముఖ ఉపాయాలను ఆశ్రయించక తప్పదు. సోమవారం నుంచి దేశంలో మొదలైన బూస్టర్ డోసు టీకా మొదట ముందుగా డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు వంటి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వేస్తారు. అలాగే 60 యేళ్ళు దాటిన వారికీ ఇస్తారు. ఇందుకు తగిన విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా గత నవంబర్ మూడో వారంలోనే బూస్టర్ మొదలు పెట్టింది. అక్కడ వొక్క రోజులో పది లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతటి తీవ్రతను బట్టి అమెరికా బూస్టర్‌ను ఆశ్రయించడం అర్ధం చేసుకోదగినదే. 2021 గడిచే వరకు బూస్టర్‌కు వెళ్లొద్దని డబ్లుహెచ్‌వొ సూచింది. మనం దానిని పాటిస్తూ బూస్టర్‌కి వెళ్ళాము. దీనిని విజయవంతం చేసుకొంటూనే మామూలు టీకా కార్యక్రమాన్నీ సంపూర్ణంగా సాధించుకోవలసి ఉంది. అనేక కారణాల రీత్యా టీకా వేయించుకోడానికి ఇష్టపడని వారు దేశంలో ఇప్పటికీ కొల్లలుగా వుంటారు. వారికి సరైన అవగాహన కలిగించి టీకాలు వేసుకునేలా చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల యంత్రాంగాలపై వుంది. దేశంలో ఇప్పటి వరకు నూట యేభై కోట్లకు పైగా టీకాలు వేసినట్టు సమాచారం.

యూరపు, అమెరికాల్లో కొవిడ్ తీవ్రతతో బాటు వ్యాక్సినేషన్ సైతం గరిష్ఠ స్థాయిలో సాగుతుండగా, ఆఫ్రికాలో గల నూట ఇరవై కోట్ల మందిలో 6.6% మందికే రెండు డోసుల టీకాలూ పడ్డాయి. కరోనా ఆవహించినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల కేసులు నమోదయ్యాయి. 50 లక్షల మందికి పైగా మరణించారు. విశ్వమంతా వొక్క ఆయుధమై కరోనాతో సంఘటిత పోరాటం చేయలేకపోయిన చేదు నిజం భయాన్ని కలిగిస్తున్నది. మన దేశంలోనే వాస్తవ మృతుల సంఖ్య 15 నుంచి 20 లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వ బయటి గణాంకాలు చెప్పాయి. అలాగే ఇతర దేశాల్లో సైతం అధికారిక, అనధికారిక లెక్కలుండొచ్చు. అంటే మానవాళి ఇటీవలి కాలంలో ఎన్నడూలేని స్థాయి మారణదాడికి బలయింది. ఈ ఊచకోత ఇప్పట్లో ఆగేటట్టు లేదు. ఇప్పటికైనా ప్రపంచమంతా వొక్కటై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్శకత్వంలో ప్రణాళికాబద్ధంగా సంఘటితంగా కరోనాపై పోరాడవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News