Wednesday, April 24, 2024

ఆసీస్‌తో అమీతుమీ

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నేటి నుంచి గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌లోని తొలిటెస్టు గురువారం నుంచి నాగ్‌పూర్ వేదికగా మొదలవనుంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 9.30నుంచి ఇరుజట్లు తలపడనున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ లైనప్‌పై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు. మేనేజ్‌మెంట్ సూచనల ప్రకారం రాహుల్, సూర్యకుమార్ యాదవ్, గిల్ తుదిజట్టులో కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు పేసర్లు స్కార్క్, జోష్ హజిల్‌వుడ్ సేవలను కోల్పోయింది. అయితే టెస్టుల్లో ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్ లబుషేన్ ఆసీస్ బ్యాటింగ్‌లో కీలకంగా మారనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌ను లబుషేన్ ఎలా ఎదుర్కుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్‌లో రిషభ్‌పంత్ అందుబాటులో ఉండకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది.

ఓపెనర్స్‌గా రోహిత్, రాహుల్?
హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్‌తో కలిసి భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. శుభ్‌మన్‌గిల్ గత మూడు నాలుగు నెలలుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీలతో పిచ్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ టి20క్రికెట్‌లో ఇప్పటికే సత్తాచాటి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. టెస్టు క్రికెట్లోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. సూర్యను కూడా ఓ ఆప్షన్‌గా పరిగణిస్తున్నట్లు స్కిప్పర్ రోహిత్‌శర్మ ప్రారంభానికి ముందు తెలిపాడు. సొంతగడ్డపై భారత్‌ను ఎదుర్కోవడం విదేశీ జట్లకు కత్తిమీద సాములాంటింది. స్పిన్ ప్రధాన ఆయుధంగా ఈసారి ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే దాదాపు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. సొంతగడ్డపై భారత్ చేతిలో రెండుసార్లు పరాజయంపాలైన ఆసీస్ పుంజుకుని పాకిస్థాన్, శ్రీలంకలపై సిరీస్ విజయాలను అందుకుంది. అదేవిధంగా భారత్ పర్యటనలోనూ సిరీస్ విజయాన్ని కైవసం చేసుకోవాలని సేన భావిస్తోంది.

స్పిన్నర్లదే రాజ్యం
నాగ్‌పూర్ ప్రధానంగా స్పిన్‌కు అనుకూలిస్తుందని గ్రౌండ్ రిపోర్టు తెలపడంతో ఇరుజట్లు స్పిన్నర్లుకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. భారత్ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో పేసర్లు కంటే స్పిన్నర్లతోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేసింది. నెట్‌బౌలర్లుగా సెలెక్టర్లు స్పిన్నర్లనే ఎంపికచేశారు. టీమిండియాలో అశ్విన్, అక్షర్‌పటేల్, రవీంద్ర జడేజాతోపాటు వాషింగ్టన్ సుందర్ కూడా చేరికతో భారత పటిష్ఠంగా ఉంది. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత బ్యాటింగ్ దళం బలంగానే ఉన్నా నంబర్ స్థానం ఇంకా ఖాళీగా ఉంది. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరమవడంతో ఈ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రిషభ్‌పంత్ దూరమవడంతో మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్ అవరసరం ఉంది. గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే ఈ స్థానంలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. మూడో స్పిన్నరుగా పటేల్ స్థానం ఖరారు అవగా ఇషాన్‌కిషన్ కంటే కేఎస్ భరత్‌వైపు రోహిత్ మొగ్గు చూపే అవకాశం ఉంది. పేస్ బాధ్యతలను షమీ, సిరాజ్ పంచుకోనున్నారు.

భారత్‌దే పైచేయి
భారత్ గత దశాబ్దకాలంలో సొంతగడ్డపై సిరీస్ ఓటమి అనేది లేకుండా అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. గత పదేళ్లలో భారత్ స్వదేశంలో 15సిరీస్‌ల్లో విజయం సాధించింది. ఈ కాలంలో కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే టీమిండియా పరాజయం పాలైంది. ఓడిన రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో పూణెలో జరిగిన టెస్టు మ్యాచ్ ఒకటి కావడం విశేషం. అయితే సిరీస్ విజయాన్ని మాత్రం భారత్ తన ఖాతాలో వేసుకుంది. కాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 450వికెట్ల మైలురాయికి కేవలం ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.

నాగ్‌పూర్ టెస్టులో అశ్విన్ వికెట్ తీస్తే వేగంగా ఈ ఘనత అందుకున్న బౌలర్ల జాబితాలో మురళీధరన్ తర్వాత రెండోస్థానంలో నిలుస్తాడు. మరోవైపు టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 2021నుంచి సగటుతో స్పిన్ బౌలింగ్‌లో 12సార్లు ఔటయ్యాడు. ఆఫ్‌స్పిన్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆరుసార్లు ఔటయ్యాడు. ఇదిలాఉండగా మ్యాచ్‌కు ముందే నాగ్‌పూర్ పిచ్‌పై ఆసీస్ ఆరోపణలు చేయడంతో భారత్ కెప్టెన్ రోహిత్‌శర్మ ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైంది. పిచ్ గురించి ఎక్కువ చింతించకుండా దృష్టిసారించాలని హితవు పలికాడు. బాగా ఆడిన జట్టు విజయం సాధిస్తుందని తెలిపాడు.

అంచనా భారతజట్టు: కేఎల్ రాహుల్, రోహిత్‌శర్మ పుజారా, విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్‌పటేల్, షమీ,

అంచనా ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవ్‌స్మిత్, ట్రావిస్‌హెడ్,పీటర్ హ్యాండ్స్‌కొంబ్/ మాట్ రెన్షా, అలెక్స్‌కేరీ (వికెట్‌కీపర్), పాట్‌కమిన్స్ (కెప్టెన్), ఆష్టన్‌అగర్, స్కాట్ బోలాండ్,నాథన్ లియన్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News