Home Default బ్రెగ్జిట్ కొత్త ఒప్పందం

బ్రెగ్జిట్ కొత్త ఒప్పందం

Sampadakiyam       ప్రధాని బోరిస్ జాన్సన్ కొత్త బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంటు ఆమోదాన్ని పొందగలిగితే యూరపు ఐక్య సంఘటన (ఇయు) నుంచి బ్రిటన్ నిష్క్రమణ పర్వం ఈ నెలాఖరులో ప్రారంభం అవుతుంది. లేకపోతే నిష్క్రమణ గడువును సంవత్సరాంతం వరకు ఇయు పొడిగించడమో, ఎటువంటి ఒప్పందం లేకుండా బ్రిటన్ వైదొలగడమో జరగవలసి ఉంటుంది. ఇంతకు ముందరి ప్రధాని థెరిసా మే రూపొందించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంటు మూడు సార్లు తిరస్కరించడంతో ఆమె తప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు ప్రధాని జాన్సన్ యూరపు యూనియన్ చేత అవుననిపించుకుని బ్రిటన్ పార్లమెంటు ముందుంచిన కొత్త ఒప్పందం పట్ల 10 మంది ఎంపిల బలమున్న మిత్ర పక్షం డెమొక్రాటిక్ యూనియనిస్ట్స్ పార్టీ (డియుపి) తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నది. ప్రతిపక్ష లేబర్ పార్టీ కూడా పెదవి విరిచింది. పర్యవసానంగా నేడు బ్రిటన్ పార్లమెంటు ఓటింగ్‌లో ఈ ఒప్పందమూ వీగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

స్వల్ప తేడాతోనైనా జాన్సన్ ఒప్పందం పరాజయం పాలవుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. బ్రిటన్ ప్రయోజనాలను యూరోపియన్ యూనియన్‌కు తాకట్టు పెడుతున్న ఒప్పందంగా దీనిని డియుపి వర్ణించింది. యూరపు యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయే క్రమానికి బీజాలు వేసిన 2016 జూన్ నాటి ప్రజాభిప్రాయ సేకరణలో స్వల్ప ఆధిక్యంతో నిష్క్రమణ ప్రతిపాదన నెగ్గింది. ఉన్నపళంగా, బేషరతుగా కాకుండా ఇయుతో ఒప్పందం ద్వారా నిష్క్రమణ జరిగితే బ్రిటన్‌కు కొన్ని ప్రయోజనాలు కలుగనున్నందున దాని రూపకల్పన కసరత్తు మొదలయింది. అటువంటి ఒప్పందం అటు యూరపు యూనియన్, ఇటు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం తప్పని సరిగా పొందవలసి ఉంది. ఆ ఘట్టం ఎప్పటికీ పూర్తికాకపోడంతో నిష్క్రమణ కూడా నిరవధికంగా వాయిదా పడుతూ వస్తున్నది. బ్రిటన్ 1973లో అప్పటి యూరపు ఆర్థిక సంఘటన (యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) లో చేరింది. ఇప్పుడది విడిపోతే ఇయు నుంచి నిష్క్రమించిన మొదటి దేశమవుతుంది.

మామూలుగా అనుకున్నదాని ప్రకారం ఈ నిష్క్రమణ ఈ ఏడాది మార్చి 29నే ప్రారంభమయి ఉండవలసింది. కాని ఆ గడువు తేదీ రెండు సార్లు వాయిదా పడింది. జాన్సన్ కుదుర్చుకున్న కొత్త ఒప్పందం ప్రకారం బ్రిటన్‌లో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లాండు ఇయు కస్టమ్స్ సుంకాల పరిధిలో ఉంటుంది. ఇయు సభ్యురాలుగా, ప్రత్యేక దేశంగా ఉన్న రిపబ్లిక్ ఐర్లాండుకు బ్రిటన్‌లో అంతర్భాగంగా కొనసాగుతున్న ఉత్తర ఐర్లాండుకు మధ్య సరిహద్దులు ఉండరాదనే 1998 నాటి గుడ్‌ఫ్రైడే ఒప్పందం స్ఫూర్తిని కాపాడడానికి ఈ ఏర్పాటును ఉద్దేశించినట్టు చెబుతున్నారు. దీనిని డియుపి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పాలక కన్జర్వేటివ్ పార్టీకి పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ లేనందున ప్రధాని జాన్సన్ తన ఒప్పందాన్ని నెగ్గించుకోడానికి బయటి మద్దతు మీద ఆధారపడవలసి ఉంటుంది.

అయితే ఉత్తర ఐర్లాండు ప్రతినిధులు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి సమావేశమై ఇయు కస్టమ్స్ జోన్‌లో కొనసాగాలా వద్దా అనే విషయమై తాజా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఈ ఒప్పందంలో యూరపు యూనియన్ కలిగించింది. ఇంతకు ముందు అందుకు ససేమిరా అంటూ వచ్చింది. జాన్సన్ ఒప్పందం ప్రకారం ఇయు కస్టమ్స్ జోన్ ఒక్క ఉత్తర ఐర్లాండు భాగానికే వర్తిస్తుంది. ఇయు నుంచి ఎటువంటి సుంకాలు లేకుండా ఉత్తర ఐర్లాండులోకి సామగ్రి రావచ్చు. కాని అది ఉత్తర ఐర్లాండు భూభాగానికే పరిమితమై ఉండాలి. బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాలకు వాటిని చేరవేస్తే వాటిపై బ్రిటన్ సుంకాలు విధిస్తుంది. ఇప్పుడు బ్రెగ్జిట్ అమలు ఆరంభమయినప్పటికీ 2020 సంవత్సరాంతం వరకు బ్రిటన్‌కు ఇయు నిబంధనలే వర్తిస్తాయి. విడాకుల బిల్లు కింద 33 బిలియన్ పౌండ్లను బ్రిటన్ ఇయుకి చెల్లించవలసి ఉంటుంది.

బ్రిటన్‌లోని యూరపు, ఇయులోని బ్రిటిష్ పౌరుల హక్కులు కొనసాగుతాయి. ఐర్లాండ్లకు సంబంధించిన నిబంధనల కారణంగా జాన్సన్ ఒప్పందం చిక్కుల్లో పడినట్లు ఇప్పటికే స్పష్టమవుతున్నది. ఈ ఒప్పందం కూడా పార్లమెంటులో వీగిపోతే బ్రెగ్జిట్‌పై తాజా రెఫరెండంకు వెళ్లాలనేవారి బలం పుంజుకుంటుంది. గత రెఫరెండంలో అత్యధికంగా 72 శాతం మంది బ్రిటన్ ఓటర్లు పాల్గొనగా 52 శాతం మంది బ్రెగ్జిట్‌కు అనుకూలంగా, 48% మంది ప్రతికూలంగా ఓటు వేశారు. ప్రధాని జాన్సన్ కొత్త ఒప్పందం నిలుస్తుందా, గంగలో కలుస్తుందా అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ సుదీర్ఘ ప్రతిష్టంభన తొలగుతుందో, కొనసాగు తుందో బ్రిటన్ పార్లమెంటు సభ్యులు ఏమి చేస్తారో వేచి చూడాలి.

Boris Johnson agrees new Brexit deal with EU