Friday, March 29, 2024

వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది

- Advertisement -
- Advertisement -

Bowenpally Vinod Kumar Responds to RBI Report on Telangana

హైదరాబాద్: గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్.బీ.ఐ) తన నివేదికలో వెల్లడించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్.బీ.ఐ, తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రం సాధించిన ఘనతపై వినోద్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఐదేళ్ళలో కేవలం వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లోనే రూ.ఒక లక్ష 81 వేల (రూ.1.81 లక్షలు) కోట్ల రూపాయల విలువ చేసే సంపదను తెలంగాణ రాష్ట్రం సృష్టించిందని ఆర్.బీ.ఐ. పేర్కొన్న విషయాన్ని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాల్లో సాధించిన ఈ ఆర్థిక ప్రగతి జాతీయ స్థాయిలో ఒక రికార్డు అని ఆర్.బీ.ఐ. స్పష్టం చేసిందని, ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ గర్వ కారణం అని వినోద్ కుమార్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అంకితభావ పని తీరుకు, చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పరిపాలనా దక్షతకు ఆర్.బీ.ఐ. నివేదిక నిలువుటద్దం అని వినోద్ కుమార్ తెలిపారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించలేదంటున్న కళ్ళు లేని కబోదులకు రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) దిమ్మ తిరిగిపోయే సమాధానమిచ్చిందని వినోద్ కుమార్ అన్నారు. వ్యవసాయ, అటవీ, మత్స్య రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటిందని అన్నారు. ఐదేళ్ల క్రితం రూ.95 వేల కోట్లు, ప్రస్తుతం రూ.1.81 లక్షల కోట్ల సంపద పెంచడం తెలంగాణ ప్రభుత్వ చర్యలే కారణమని, హ్యాండ్‌బుక్‌లో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వెల్లదించిందని వినోద్ కుమార్ వివరించారు.

2017-18లో రూ.95,098 కోట్లుగా ఉన్న ఈ మూడు రంగాల ఉత్పత్తుల విలువ.. 2021-22 నాటికి ఏకంగా రూ.1,81,702 కోట్లకు పెరిగినట్లుగా ఆర్.బీ.ఐ వెల్లడించిందని వినోద్ కుమార్ తెలిపారు. గత ఐదేళ్ళలో ఈ సంపద విలువ రూ.86,604 కోట్లు పెరిగిందని, ఇంతటి వృద్ధి మరే ఇతర రాష్ర్టాల్లోనూ లేదని, తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక చర్యల వల్లే ఈ మూడు రంగాల్లో గణనీయ వృద్ధి సాధ్యమైందని ఆర్బీఐ చెప్పిందని వినోద్ కుమార్ తెలిపారు. స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచే తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని, అందు కోసం లక్షల కోట్ల నిధులు ఖర్చు చేసిందని, రైతు బంధు ద్వారానే అన్నదాతలకు సుమారు రూ.58 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఫలితమే ఈ ప్రగతి అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును అందించేందుకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని అన్నారు. ఇప్పటివరకు రూ.353 కోట్లు ఖర్చుచేసి 425 కోట్ల చేప పిల్లల్ని ఉచితంగా పంపిణీ చేసిందని, ఆరేళ్ళలో రూ. 26 వేల కోట్ల సంపదను సృష్టించగలిగిందని వినోద్ కుమార్ తెలిపారు.

రాష్ట్రంలో గ్రీనరీని సాధించేందుకు అడవుల పెంపు, సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తుండటంతో రాష్ట్రంలో అడవుల శాతం భారీగా పెరిగి, రాష్ట్రం ఆకు పచ్చగా మారిందని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 2001 నుంచి 2014 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కెసిఆర్… ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ఫలితాలను సాధిస్తున్నారని వినోద్ కుమార్ వెల్లడించారు.

Bowenpally Vinod Kumar Responds to RBI Report on Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News