Home తాజా వార్తలు దీపక్‌కు రజతం

దీపక్‌కు రజతం

 Boxer Deepak
వుహాన్: చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ సైనిక క్రీడల్లో భారత బాక్సర్ దీపక్ రజత పతకం సాధించాడు. శనివారం జరిగిన 49 కిలోల విభాగం ఫైనల్లో దీపక్ ఓటమి పాలయ్యాడు. కజకిస్థాన్ బాక్సర్ జుసుపోవ్‌తో జరిగిన ఫైనల్ సమరంలో దీపక్‌కు ఓటమి తప్పలేదు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో జుసుపోవ్ 50 తేడాతో దీపక్‌ను చిత్తు చేశాడు. ఆరంభం నుంచే దీపక్ ప్రత్యర్థి పంచ్‌లకు ఎదురు నిలువలేక పోయాడు. దూకుడును ప్రదర్శించిన జుసుపోవ్ అలవోకగా విజయాన్ని అందుకుని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అంతకుముందు సెమీ ఫైనల్లో దీపక్ 50 తేడాతో అజర్ బైజాన్ బాక్సర్ సల్మాన్‌ను చిత్తు చేసి పసిడి పతకం రేసుకు అర్హత సాధించాడు. సెమీస్‌లో దీపక్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థి బాక్సర్ సల్మాన్‌పై ఆధిపత్యం చెలాయించాడు. కళ్లు చెదిరే పంచ్‌లతో విరుచుకు పడిన దీపక్ ఏ దశలోనూ సల్మాన్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ అలవోకగా ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌కు చేరడం ద్వారా దీపక్ రజత పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కాగా, 56 కిలోల విభాగంలో మరో భారత బాక్సర్ చిరాక్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. కాగా, పురుషుల 1500 మీటర్ల పరుగులో భారత స్టార్ జాన్సన్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. దీంతోపాటు పురుషుల రిలేలో కూడా భారత బృందం ఫైనల్‌కు అర్హత సాధించింది.

 Boxer Deepak gets silver