Home ఖమ్మం మేరా ‘భగత్’ మహాన్ హై

మేరా ‘భగత్’ మహాన్ హై

అతనొక మేధావి
అతనొక ఆర్థిక శాస్త్రవేత్త
అతనొక సామాజికవేత్త
అతనొక చరిత్రకారుడు
అతనొక ఉద్యమకారుడు
అతనొక స్వాతంత్య్ర సమరయోధుడు
అతనొక మార్కిస్టు సిద్ధాంతకర్త
అతనొక విప్లవకారుడు
అతనొక జగమెరిగిన వీరుడు
అన్నింటికీ మించి అమరుడతడు
అతనే మన సర్దార్ భగత్‌సింగ్…
నేడు ఆ మహనీయుడి
వర్ధంతి సందర్భంగా
“మన తెలంగాణ” ప్రత్యేక కథనం

వేల కాగడాలు ఏకమైతే… లక్ష గొంతులు ఒక్కటైతే.. కోటి ఆశలు నిలువెల్లా నింపుకుంటే… అతనొక్కడవుతాడు. జాతి ఆత్మఘోష గుండెలనిండా నింపుకుని పుట్టినవాడు. అన్నానికి బదులు ఆవేశం తిని పెరిగినవాడు. వేలమంది ప్రాణాలు విడిచిన మట్టివాసననే ప్రాణవాయువుగా పీల్చుకుని బతికినవాడు. తెల్లదొరల ముందు.. ధైర్యంగా మీసం మెలేసిన పౌరుషమతడు. ఉరితాడును సైతం ఎంతో ఇష్టంగా ముద్దాడిన పోరాటయోధుడతను. భారత స్వాతంత్య్రచరిత్రలో అరుణారుణాక్షరాలతో లిఖించబడిన విప్లవ వేగుచుక్క భగత్‌సింగ్.

BhagatSingh

ఆ.. యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబొడుస్తాయి. బ్రిటీష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్ చేస్తారు. పన్నెండేళ్లకే ఆ వీరుడు భరతజాతి విముక్తి కోసం కంకణం కట్టాడు. పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అడుగు పెట్టాడు. ఇరవై మూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు. దటీజ్ భగత్‌సింగ్,

ధైర్యానికి ప్రతీక…

భగత్‌సింగ్…ధైర్యానికి ప్రతీక. దేశభక్తికి ప్రతిరూపం. భగత్‌సింగ్.. ధీరత్వానికి మారుపేరు. నవతరానికి ఒక స్ఫూర్తి. భయమెరుగని భారతీయుడు భగత్‌సింగ్. అంతులేని ధైర్యానికి కొలమానం. ఉరితాడుతో ఉయ్యాలలూగిన భారత తేజం. ఆ విప్లవవీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రే లేదు.
1907 సెప్టెంబర్ 28న జననం..

1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్‌లోని లాయర్‌పూర్ జిల్లా బంగాలో కిషన్‌సింగ్, విద్యావతి దంపతులకు భగత్‌సింగ్ జన్మించారు. చిన్ననాటి నుంచే నరనరాల్లో దేశభక్తిని ఇనుమడింపజేసుకున్నాడు భగత్‌సింగ్. అందు కే దశాబ్దాలు గడిచినా ఆ విప్లవవీరుడి త్యాగం ఇంకా సజీవంగానే ఉంది. దేశవిదేశాల్లో ఎన్నో పోరాటాలకు ఆజ్యం పోసింది. కోట్లాదిమందిలో తెగువ నింపింది.

ఉరకలేస్తున్న యవ్వనం..దేశానికే అకింతం

ఉరకలేస్తున్న యవ్వనాన్ని దేశానికి అంకితం చేశాడు. పరవళ్లు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్య్రం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు. 12 ఏళ్ల వయసులోనే జలియన్ వాలిబాగ్ దారుణాలను చూసి భగత్ రగిలిపోయాడు. సామ్రాజ్యవాద బ్రిటీష్ పాలకులపై కసి పెంచుకున్నాడు. 14 ఏళ్ల ప్రాయంతోనే మహాత్ముని పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు. గాంధీ అకస్మాత్తుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని
నిలిపివేయడం భగత్‌సింగ్‌కు నచ్చలేదు. అందుకు తన పంథాలోనే పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు నచ్చే వేదికలను వెదుక్కున్నాడు. 1926లో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి, స్వాతంత్య్ర పోరాటాన్ని కొనసాగించాడు.

సైమన్ కమిషన్.. పోలీసుల దాడి…

1928లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో.. లాలాలజపతిరాయ్ చనిపోవడంతో భగత్‌సింగ్ నెత్తురు ఉడికిపోయింది. సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలన్న ప్లాన్ వేశారు. ఇంక్వి లాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలువెదజల్లారు.

జైల్లో భగత్ దీక్ష…

1928 ఏప్రిల్ 8న బాంబు దాడి జరిగింది. భగత్ లొంగిపోయి కోర్టులో తన వాదనతో గర్జించాడు. యావత్ దేశం అట్టుడికి పోయింది. జైల్లో కూడా ఖైదీల సౌకర్యాల కోసం నిరాహార దీక్ష చేపట్టాడు. దీక్షతో బక్కచిక్కి పోయిన భగత్‌సింగ్‌ను కోర్టులో చూసిన ప్రజలు తట్టుకోలేకపోయారు. జైల్లో ఉన్నప్పుడే “నేను ఎందుకు నాస్తికుడిని అయ్యాను” అని ఒక వ్యాసం రాశాడు. అలాగే విప్లవ వారసత్వ వీలునామా, పార్టీ అనుసరించాల్సిన వ్యూహం గురించి వివరింగా కార్యకర్తలను ఉద్దేశించి ఒక లేఖ రాశాడు.

1931 మార్చి 23న లాహోర్‌లో ఉరి..

బ్రిటీష్ హై కమిషన్ సాండర్స్‌ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్‌సింగ్‌తోపాటు రాజ్‌గురు, సుఖ్ దేవ్‌లను 1931 మార్చి 23న లాహోర్‌లో సాయంత్రం 7.33 నిమిషాలకు ఉరి తీశారు. అనంతరం అత్యంత పాశవికంగా భగత్‌సింగ్ మృతదేహాన్ని తెగనరికి దహనం చేశారు. కానీ భగత్‌సింగ్ ఎవరినీ చంపలేదని పాకిస్తాన్ పోలీస్ శాఖ లాహోర్ న్యాయస్థానానికి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే పోరాటయోధుడిని కావాలనే బ్రిటీష్ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తోంది. ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా… తన ఉరి దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగిలిస్తుందనే భావనతో చావును స్వాగతించాడు.

నేటి తరానికి వెలుగుదారి…

చరిత్ర వీరుల్ని, విప్లవ ధీరుల్ని పుట్టిస్తుంది. అలాంటి పోరాట యోధుడే భగత్‌సింగ్. భరతమాత సంకెళ్లను తెం చేందుకు, ఉరితాడునే పూలమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి. త్యాగం, ఆదర్శానికి భగత్‌సింగ్ నిలువెత్తు నిదర్శనం. అదే నేటి వెలుగుదారి.