Home రంగారెడ్డి డ్వాక్రా గ్రూపుల్లో దళారుల ఇష్టారాజ్యం

డ్వాక్రా గ్రూపుల్లో దళారుల ఇష్టారాజ్యం

  • బ్యాంకర్లు బ్రోకర్లతో రుణాల్లో మోసం,  
  • డ్వాక్రా సంఘాలపై బ్యాంకర్ల ఒత్తిడి 
  • న్యాయంకాదని మండిపడుతున్న మహిళలు,  
  • చెల్లించకపోతే ఇళ్లకు తాళాలే

ఇది సమంజసం కాదు

బకాయిలు ఉన్న వారిని కలుపుతూ అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిన విధంగా బ్యాంకు ఆఫీసర్లు ప్రవర్తించడం సమంజసం కాదు. ఈ విషయంలో అధికారు లు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– మహిళాభర్త మల్లప్ప ఓ సంఘం సభ్యురాలు, గౌతాపూర్

House2మన తెలంగాణ/తాండూరురూరల్ : గత ఏడేళ్ల కిందట ఉన్న బ్యాంకు అధికారులు, మధ్యవర్తులు కలిసి డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన రుణాల్లో చేతివాటం చూసుకుని వారిని మోసం చేసిన సంగతి ప్రస్తుత అధికారులు రుణాలు చెల్లించమని వెళితే బయట పడిన విషయం తాజాగా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. శనివారం బ్యాంకు రికవరీ అధికారులు వెళ్లి రుణాలు చెల్లించమని ఒత్తిడి చేసిన సందర్భంగా ఇది తేట తెల్లమైంది. ఏళ్ల తరబడిగా బాంకులో ఉన్న రుణ బకాయిలను వెనువెంటనే చెల్లించాలి లేదంటే ఇళ్లకు తాళాలు వేస్తామంటూ బ్యాంకు రికవరీ అధికారులు మెడపై కత్తిపెట్టి ఒత్తిడి చేశారు. తాము తీసుకున్న రుణాల్లో కొంత మంది అప్పటి అధికారులతో కలిసి తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈ విషయం తెలిసిన స్థానిక డ్వాక్రా మహిళలు ఖిన్నులయ్యారు.

చెల్లించినవారికి తగు న్యాయం చేయాలి

బకాయిలు సకాలంలో చెల్లించిన వారికి తగు న్యాయం చేయాలి. ఈ విషయంలో ఆంధ్రాబ్యాంకు ఉన్నతాధి కారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. లేని పక్షంలో న్యాయం కోసం తాము ఉద్యమించాల్సి వస్తుంది.
– నర్సమ్మ, ఓ సంఘం సభ్యురాలు, గౌతాపూర్

అయితే ఈ విధమైన చర్యలకు ఉపక్రమించిన బ్యాంకర్లపై ఇదెక్కడి న్యాయ మంటూ డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు, పేదప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని సిఎం పదేపదే ప్రకటిస్తున్న సందర్భంలో ఇక్కడ మాత్రం ఇలా జరగడం గమనార్హం. శనివారం గ్రామానికి వచ్చిన ఆంధ్రాబ్యాంక్ రికవరీ అధికారి సురేష్, యలమందారెడ్డి, తాండూరు శాఖ మేనేజర్ గౌతమ్‌గోసాయి, ఫీల్డ్ ఆఫీసర్ సంగీతలు నేరుగా డ్వాక్రా సంఘాల వారిని కలిసి విషయాన్ని వివరించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… గత 2009-10 సంవత్సరంలో గ్రామంలో కొనసాగుతున్న దాదాపు సుమరు50 డ్వాక్రా సంఘాలకు ఒక్కో సంఘానికి మూడు నుండి ఐదు లక్షల వరకు రుణాలను ఆంధ్రాబ్యాంక్ ద్వారా అందజేశారు. అప్పట్లో ఉన్న బ్యాంకు అధికారులతో మధ్యవర్తులు కలిసి మంజూరైన రుణాల్లో ఒక్కో సంఘానికి రూ.50 వేలకు పైగా అవినీతికి పాల్పడినట్లు తేటతెల్లమవుతోంది. అప్పట్లో మంజూరైన రుణాన్ని గ్రామ సమాఖ్య ద్వారా పంపిణీ చేశారు. అయితే తమ సంఘం ఇంత రుణానికి దరఖాస్తు చేసుకుందని ప్రశ్నిస్తే మీకు ఇంతే మంజూరైందంటూ చెప్పుకొచ్చారు.

డ్వాక్రా మహిళలకు న్యాయం జరగని పక్షంలో పోరాటమే

ఇటు ప్రభుత్వాలు, అటు బ్యాంకులు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. కాని ఇందుకు విరుద్ధంగా గ్రామాల్లో పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని తాము వ్యతిరేకిస్తున్నాము. గౌతాపూర్ గ్రామంలో డ్వాక్రా సంఘాల విషయంలో బ్యాంకర్లు సభ్యులు కేసులు, తాళాల పేరుతో బెదిరించడం సబబుకాదు. ఒకవేళ అదే జరిగితే సిపిఎం,సిఐటియు తరపున ఉద్యమిస్తాం.
-శ్రీనివాస్, సిపిఎం, కన్వీనర్, తాండూరు డివిజన్

ఇది నమ్మిన ఆయా సంఘాల వారు ఇచ్చిన వరకు తీసుకుని మిన్నకుండిపోయారు. వీటికి సంబంధించి58 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు బ్యాంకు అధికారుల సమాచారం. కాగా ఈ సంఘాల్లో 38 సంఘాలు  బాగానే నడుస్తున్నా 16 సంఘాలు నడవడం లేదు.అందులో 12 సంఘాలు రుణ బకాయిల కింద నమోదయ్యాయి. బకాయిపడ్డ సంఘాల నుండిబ్యాంకు వారు ఎలాగైనా రుణాలు రికవరీ చేయాలనే ఉద్దేశంతో శనివారం గ్రామానికి వెళ్లి డ్వాక్రా సంఘాలసభ్యుల ‘ఇళ్లకు తాళం’ పేరిట హెచ్చరికలు జారీ చేశారు. పైగా సోమవారంలో గా చెల్లించని పక్షంలో లోక్ అదాలత్ ద్వారా కేసులు నమోదు చెస్తామని వెల్లడించారు. దీంతో అలజడి మొదలైంది. డ్వాక్రా సంఘాల్లో. ఏడు సంవత్సరాలుగా రుణబకాయిలు గుర్తుకురాని బ్యాంకర్లకు ఉన్నఫలంగా కడతారా, చస్తారా అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరుపై స్థానికం గా మహిళాసంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. బకాయి పడిన సంఘాల్లోని మొత్తం సభ్యుల్లో  రెగ్యులర్‌గా కడుతున్న వారిని వేరుగా చేసి బకాయి ఉన్న సభ్యులపై చర్యలు తీసుకో వాలనే వాదన స్థానికంగా వినిపిస్తోంది. అలా కాకుండా అందరిపైనా చర్యలకు పూనుకోవడం ఇదెక్కడి న్యాయమంటూ నిలదీస్తున్నారు. అటు బ్యాంకర్ల వాదన మరోవిధంగా ఉంది. సంఘం పేరుతోనే రుణం చెల్లించినందున అందరికీ వర్తిస్తుందని చెప్పుకొస్తున్నారు. దీంతో చెల్లించిన వారు, చెల్లించని వారు ఒకే గాటికిందకు వస్తున్నారని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని పలు సంఘాల సభ్యులు కోరుతున్నారు.