Home తాజా వార్తలు అక్కాతమ్ముడి సెంటిమెంట్‌తో ‘బ్రూస్‌లీ’

అక్కాతమ్ముడి సెంటిమెంట్‌తో ‘బ్రూస్‌లీ’

chiru“నాకు ఇష్టమైన మాట బ్రూస్‌లీ. తను నటించిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా నేను చాలాసార్లు చూశాను. ఆయన పేరుతో సినిమా చేస్తున్న రామ్‌చరణ్ ధన్యుడు”అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘బ్రూస్‌లీ’ ఆడియో విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరు బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి సీడీని వివి వినాయక్‌కు అందించారు. వినాయక్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “ఎంటర్ ది డ్రాగన్‌లాగా ఈ సినిమాలో కూడా బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ ప్రాధాన్యంగా ఉంటుంది. ‘బ్రూస్‌లీ’ టైటిల్ కథకు సముచితంగా, న్యాయంగా ఉంది. సినిమా ఈనెల 16న విడుదలవుతుంది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్స్… ఇలా అన్ని కోణాలను టచ్ చేసి సినిమా చేశారు. కామెడీ టైమింగ్ విషయంలో శ్రీనువైట్ల తరువాతే ఎవరైనా. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రకుల్ చాలా రొమాంటిక్‌గా ఉంది. ఈ సినిమాలో నా ఎంట్రీ కొసమెరుపు. నా కోసం ప్రత్యేకంగా సీన్ క్రియేట్ చేశారు”అని అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ “మొదటిసారిగా అయిదు నెలల్లో నేను సినిమా షూటింగ్ పూర్తిచేశాను. ‘బ్రూస్‌లీ’ సాంగ్ షూటింగ్ ఒక్కటే మిగిలి ఉంది. అది రేపే పూర్తి చేయనున్నాం. ఈ సినిమాలో కృతి, నదియా కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. కృతి నాకు అక్కగా నటించింది. సినిమా కథ అంతా అక్క, తమ్ముడి మధ్య నడుస్తుంటుంది. నాన్నగారితో మొదటిసారి షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఆయన ఉన్న ఐదు నిమిషాలు సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది”అని చెప్పారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ “చిరంజీవి మొదట నా స్క్రిప్ట్ విని సినిమాకు ఓకే చేశారు. చరణ్‌ను నాకు ఇవ్వడంతో పాటు చిరంజీవి కూడా ఈ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివివి దానయ్య, రకుల్‌ప్రీత్‌సింగ్, తమన్, నదియా, కృతికర్బందా, అల్లు అరవింద్, బివిఎన్‌ఎస్ ప్రసాద్, సాయిధరమ్‌తేజ్, కోనవెంకట్, జానీ మాస్టర్, రామజోగయ్యశాస్త్రి, అరుణ్ విజయ్, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.