Home తాజా వార్తలు అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం

అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం

suicide

 

ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

కమాన్‌పూర్ : ఆస్తి తగదాల కారణంగా అన్నదమ్ములు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని రొంపికుంట గ్రామం చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రొంపికుంట గ్రామానికి చెందిన కందుల సాయిరెడ్డి అనే సింగరేణి కార్మికుడికి ఇద్దరు కుమారులు కందుల సతీష్, కందుల శ్రీనివాస్‌లు ఉన్నారు. సాయిరెడ్డి భార్య మృతి చెందడంతో మరో మహిళ రాజేశ్వరిని రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య రాజేశ్వరికి కుమారుడు సంతోష్, కుమార్తె సవితలు ఉన్నారు. కొద్ది నెలల క్రితం సాయిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగా కుమారుడైన కందుల సంతోష్‌కు తండ్రి ఉద్యోగం ఇచ్చారు.

ఇదిలా ఉండగా సంతోష్‌కు తండ్రి ఉద్యోగం రావటంతో మొదటి భార్య కుమారులు ఆస్తి మొత్తం తమకే చెందాలని అడిగారు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో తమకున్న నాలుగున్నర వ్యవసాయ భూమిలో మొదటి భార్య కుమారులైన సతీష్, కుమార్‌లకు చెరో రెండెకరాలు ఇవ్వడంతో పాటు, రెండవ భార్య రాజేశ్వరికి 20 గుంటల భూమిని కేటాయిస్తూ తీర్మానం చేశారు. ఈ మేరకు రెండవ భార్యకు ఇచ్చిన 20 గుంటల భూమి కూడా తమకే ఇవ్వాలని మొదటి భార్య పిల్లలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రెండవ భార్య రాజేశ్వరికి, మొదటి భార్య కుమారులకు వాగ్వివాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్, సతీష్‌లు పొలం వద్దనే గడ్డి మందు తాగి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డారు.

గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం పెద్దపల్లి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా శ్రీనివాస్ మృతి చెందాడు. మృతునికి భార్య వసంత, కుమార్తె ఉన్నారు. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో రొంపికుంటలో విషాదం నెలకొంది. కమాన్‌పూర్ ఎస్‌ఐ శ్యాంపటేల్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Brothers suicide attempt