Friday, March 29, 2024

నాగాలాండ్‌ ఎన్నికల బరిలో బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ త్వరలో నాగాలాండ్‌లో కాలుమోపనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆ రాష్ట్రానికి చెందిన ఎన్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు వై. సులంతుంగ్ హెచ్ లోథా బిఆర్‌ఎస్ పార్టీని విస్తరింప చేసేందుకు తీవ్ర ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వరతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆదరణ లభిస్తోందని మంత్రి కొప్పులకు లోథా వివరించారు. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్‌లో చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు తీవ్ర స్థాయిలో ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

నాగాలాండ్ ప్రజల్లో కూడా బిఆర్‌ఎస్ పార్టీ పట్ల పెద్దఎత్తున చర్చ జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ స్థాపపై మంత్రి కొప్పులతో లోథా చర్చించినట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో నాగాలాండ్‌లో జరగనున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరపున పోటీ చేసేందుకు పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొప్పులకు వివరించారు. కాగా ఇదే విషయాన్ని బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో సమగ్రంగా చర్చిద్దామని ఆయనకు కొప్పుల సూచించారు. త్వరలోనే కెసిఆర్ అపాయింట్‌మెంట్‌ను కోరనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీనికి కెసిఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే బిఆర్‌ఎస్ పక్షాన పోటీ చేస్తున్న తొలి రాష్ట్రంగా నాగాలాండ్ కానుంది.
ఇదిలా ఉండగా లోథా 1980..1981 మధ్య కాలంలో కోహిమా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా కొనసాగారు. ఆ తర్వాత
ఆల్ నాగాలాండ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడుగా ఉన్నారు. తదనంతరం డెమోక్రటిక్ లేబర్ పార్టీ స్థాపించి 1993 సాధారణ ఎన్నికల్లో సానిస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్‌లో ఇమడలేక మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవర్ స్థాపించిన ఎన్‌సిపి పార్టీలో చేరారు. ప్రస్తుతం నాగాలాండ్ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలతో పాటు నేషనల్ కిసాన్ సెల్ వైస్-ఛైర్మెన్‌గా కొనసాగు తున్నారు. కాగా ఇటీవల ఢిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా లోథా హాజరయ్యారు. తమ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని కెసిఆర్‌కు
సులంతుంగ్ హెచ్ లోథా హామీ ఇచ్చారు. ఈ మాటకు కట్టుబడి ఆయన త్వరలోనే బిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగాలాండ్‌లో లోథా నేతృత్వంలో పెద్దఎత్తున పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా మంత్రి కొప్పులతో చర్చలు జరిపిన వారిలో లోథాతో పాటు కొత్తగూడెం బిఆర్‌ఎస్ స్టూడెంట్ వింగ్ నాయకులు అనుదిప్, మోర భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News