Home జాతీయ వార్తలు నేడే కేంద్ర బడ్జెట్

నేడే కేంద్ర బడ్జెట్

Arun-Jaitlyచితికిన వ్యవసాయానికి చికిత్స చేస్తారా,
కార్పొరేట్లకే కార్పెట్ పరుస్తారా..?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిఅరుణ్ జైట్లీ 2016-17 సంవత్సరపు కేంద్ర బడ్జెట్‌ను సోమవారం (నేడు) ప్రవేశపెడతారు. దీనికి సమతూకపు బడ్జెట్‌గా మల్చడానికి, అన్ని కీలక రంగాల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దడా నికి జైట్లీ కఠిన పరీక్షను ఎదుర్కొన్నారు. వ్యవసాయ రంగం, వరుసగా ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలతో అయోమయంలో రైతు. మరోవైపు పరిశ్రమ లపై ప్రధాని మోడీ రాయితీల వెల్లువ, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియాల నినాదాల నడుమ పరిశ్రమలకు ప్రోత్సాహకాలకు సరైన చర్యలు తీసుకోవడం వంటి పరస్పర వైరుద్ధ అంశాలతో బడ్జెట్ రూపొందించేందుకు జైట్లీ అతిగానే కష్టపడాల్సి వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టడం  జైట్లీకి వరుసగా ఇది మూడోసారి. ప్రపంచస్థాయిలో తలెత్తుతున్న ప్రతికూల పరిస్థితులు, ఆర్థికంగా ఎదురుగాలులు వంటి పరిస్థితులలో అధికోత్పత్తికి అటు వ్యవసాయికంగా, ఇటు పారిశ్రామికంగా ప్రజా వ్యయం పెంపుదలకు అవసరమైన వనరుల సమీకరణ అత్యంత క్లిష్టంగా మారింది. ప్రధాని ఆదివారం మన్‌కీబాత్‌లో బడ్జెట్ తనకు కీలక పరీక్ష అని చెప్పడం జరిగింది. అయితే అసలు సిసలు పరీక్షను ఎదుర్కొంది ఆర్థిక మంత్రిగా జైట్లీనే. కార్పొరేట్ రంగానికి కేంద్రం ఎక్కువగా పెద్ద పీటవేస్తుందనే అంచనాలు రెండు రోజుల క్రితం వెలువడ్డ ఆర్థిక సర్వేతో వెల్లడయింది. ఇదే సమయంలో సబ్సిడీల కోతలు, సంస్కరణల ప్రక్రియలలో భాగంగా తీసుకునే చర్యలకు కూడా ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యతను ఇస్తారని విశ్లేషిస్తున్నారు. అయితే దేశంలో తీవ్రస్థాయిలో పెరుగుతున్న ధరలు ప్రత్యేకించి కీలక నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడం, సామాన్యుడికి అత్యవసరం అయిన పప్పుల ధరలు ఎప్పటికీ దిగిరాం రాం అంటూ ఎగబాకడం వంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా వ్యవసాయరంగం దీనావస్థ గురించి మోడీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. పరిశ్రమలను, ఇటు వ్యవసాయ రంగాన్ని సమతూకంలో పెడుతూ బడ్జెట్ చట్రం తీర్చిదిద్దే కసరత్తు పనిలో జైట్లీ తలమునకలు అయిఉన్నారు. ఇందులో ఎలాంటి ఫలితం ఎలా ఉంటుందనేది నేడే వెల్లడవుతుంది. ఆదాయపు పన్ను రంగంపై కేంద్రం ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం చేసింది. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్ల వనరులను ఎక్కువ శాతంలో రాబట్టుకోవాలని యత్నిస్తున్నారు. పన్నుల స్లాబ్‌లు యధాతథంగా ఉంటాయని భావిస్తున్నారు.అయితే మరింత ఎక్కువగా ఆదాయపరులను పన్నుల పరిధిలోకి తీసుకువచ్చే విషయం ఆలోచిస్తున్నారు. పన్నుల మినహాయింపులను ఎత్తివేయాలా? లేదా ఉంచాలా అనేది డోలాయమానంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో నైరాశ్యం నెలకొని ఉందనే విషయాన్ని కేంద్రం గమనించింది. వరుసగా కమ్ముకొస్తూ వస్తున్న కరవు కాటకాలు, రైతాంగ కూలీలకు పనిలేకపోవడంతో కేంద్రం ఈ రంగంలో ఖచ్చితమైన రీతిలో వ్యవహరించేందుకు బడ్జెట్ ప్రతిపాదనలకు వెళ్లాల్సి ఉంది. సామాజిక పథకాలను సమన్వయ పర్చడం, లేదా హేతుబద్ధీకరించడం వంటి చర్యలు చేపట్టాలని లేకపోతే ఆర్థిక వ్యవస్థ గాడితప్పుతుందని ఆర్థిక వేత్తలు పేర్కొన్నప్పటికీ ఆర్థిక మంత్రి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతిపై దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. ఇక సంస్కరణల ప్రక్రియకు పెట్టుబడులకు విదేశీ పెట్టుబడిదార్లు లింక్ పెట్టడంతో దీనిపై కూడా ఆర్థిక మంత్రి తగు ప్రతిపాదనలకు దిగనున్నారు.
చెల్లింపుల భారం భారీ స్థాయిలో
దాదాపు రూ 1.02 లక్షల కోట్ల భారీ స్థాయి చెల్లింపుల భారం ఉండటంతో జైట్లీ చిట్టాకు పలు సమస్యలు ఎదురయ్యాయి. ఏడవ వేతన సంఘం సిఫార్సులతో ప్రభుత్వోద్యోగులకు చెల్లింపుల భారం భారీ స్థాయిలో ఉంది. దీనిని ఇప్పుడు ఎలా భర్తీ చేస్తారనేది ప్రశ్నగా మారింది. గతంలో తాము తాము ద్రవ్యోల్బణాన్ని జిడిపిలో 3.5 శాతంగా కట్టడి చేస్తామని చెపుతూ వచ్చిన ఆర్థిక మంత్రి ఈ భారం చెల్లింపులను ఎలా చేపట్టే చిట్టాపద్దు చూపిస్తారనేది కీలకంగా మారింది. గత ఏడాది ఇచ్చిన వాగ్దానం మేరకు జైట్లీ కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి క్రమేపీ తగ్గించే ప్రక్రియను అమలు చేసే వీలుంది. ఇక పన్నుల మినహాయింపు ప్రక్రియతో ఆదాయ లక్షం కనీసం తటస్థీకరణ దిశలో అయినా ఉండేందుకు చర్యలు తీసుకోనున్నారు. పెరుగుతున్న వ్యయంతట్టుకోవడానికి ఆర్థిక మంత్రి పరోక్ష పన్నుల రేట్లను పెంచవచ్చు లేదా కొత్త పన్నులకు దిగవచ్చు. సేవా పన్ను గత ఏడాది14.5 పెరిగింది. దీనిని ఇప్పుడు పెంచి 18 శాతానికి పెంచే వీలుంది. వస్తు సేవల పన్ను బిల్లులో దీనినే ప్రతిపాదించారు. స్టార్టప ఇండియా లేదా డిజిటల్ ఇండియా వంటి మోడీ ప్రతిష్టాత్మక పథకాలకు నిధుల వేటకు కొత్త సెస్సుల విధింపు ప్రక్రియ జరిగే వీలుంది. గత ఏడాది స్వచ్చభారత్ సెస్సు విధించారు. ఈ మాదిరిగా ఇప్పుడు మరికొన్ని సెస్సులు దూసుకువచ్చే వీలుంది. పెట్టుబడుల వలయం పునరుద్ధరణకు జైట్లీ అజెండాగా పెట్టుకున్నారు. కాగా ప్రస్తుత ఏడాది మూల పెట్టుబడుల అంతకు ముందటి సంవత్సరం కన్నా పాతిక శాతం కన్నా ఎక్కువగా పెరిగింది. ఇది జడిపి స్థాయిలో పోలిస్తే 1.7 శాతంగా ఉంది. ఇది కనీసం మరో రెండు శాతం పెరగాల్సి ఉంది. ప్రజా వ్యయాన్ని పెంచడం ప్రత్యేకించి మౌలిక నిర్మాణ రంగంలో పెట్టుబడులను పెంచేందుకు చర్యలు తీసుకోవచ్చు. ప్రైవేటే పెట్టుబడుల స్థాయి ప్రభుత్వం ఆర్బాటంగా ప్రకటిస్తున్న స్థాయిలో ఎంతకూ వాస్తవిక రూపంలోకి రాకపోవడంతో ఇతరత్రా చర్యలపై బడ్జెట్ ద్వారా దృష్టి కేంద్రీకరించే వీలుంది.బడ్జెట్ కేటాయింపులు పెరిగినట్లు అన్పించినప్పటికీ దేశ ద్రవ్య పరిస్థితి ఇప్పుడు చిత్రీకరణకు వస్తోన్న రేటింగ్‌ల పరిధి కన్నా బలహీనంగానే ఉంటుందని, ఇది వాస్తవం అవుతుందని మూడీస్‌కు చెందిన ఆర్థిక విశ్లేషకులు ఒకరు ఇటీవలే సెలవిచ్చారు. ఈ ఏడాది విదేశీ పెట్టుబడిదార్లు తమ షేర్లను 2.4 బిలియన్‌డాలర్ల మేర విక్రయించుకుని దుకాణం దులిపేసుకున్నారు. చైనా తరువాత ఇంత భారీ స్థాయిలో ఆసియాలో జరిగిన విదేశీ షేర్ల అమ్మక ప్రక్రియ ఇదే. ఇక గ్లోబల్ డిమాండ్ తగ్గడం, అత్యధిక సరఫరాతో సరుకుల సంబంధిత రంగాలకు బడ్జెట్‌లో ఇప్పుడు అత్యవసరంగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉందని విశ్లేషకులు తెలిపారు. పే కమిషన్ చెల్లింపులతో పాటు బ్యాంకులకు భారీ పెట్టుబడుల సమీకరణ కీలకంగా మారింది. తక్కువ స్థాయిలో దిగుబడితో వ్యవసాయరంగం కుంటుపడటంతో కూలీలకు అందించాల్సిన గ్రామీణ ఉపాధి హామీ పనులపై కేంద్రం దృష్టి కేంద్రీకృతం చేయాల్సి ఉంది. ఇక ఇటీవల ప్రకటించిన ప్రధాన ఫసల్ బీమా యోజనతో పంటల బీమా నిధులను పెంచాల్సి ఉంది. సాగునీటి పథకాలకు కేటాయింపులు పెరగాల్సి ఉంది. సంస్కరణల రంగానికి సంబంధించి ఇతర రంగాలకూ దీనిని విస్తరించే వీలుంది. కార్మిక ప్రోత్సాహ రంగాలు ( లెదర్, జువెలరి) వంటివాటికి పన్నుల బ్రేక్‌లు కల్పించే వీలుంది. ఇక ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం దిగుమతి చేసుకున్న ముడిచమురు, పెట్రోలు, డీజిల్‌పై కస్టమ్స్ సుంకం తిరిగి విధించే వీలుంది. గతంలో దీనిని ఎత్తివేశారు. అప్పటి భారీ ధరలతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే దీనిని ఇప్పుడు తిరిగి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచే వీలుంది. బంగారం దిగుమతులు ఏడాదిగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ పరిణామంతో ఫోరెక్స్ వెల్లువతో వాణిజ్య లోటుకు, రూపాయి పతనానికి దారితీస్తోంది. అన్నట్లు రూపాయి పతనం కాకుండా చూస్తామని ఇది బలోపేతం అవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదని అయినా అంతర్జాతీయ పరిస్థితులలో భారతదేశ ఆర్థిక వ్యవస్థనే భేషుగ్గా ఉందని ఆర్థిక సర్వేలో చంద్రుడిని చూపించిన జైట్లీ బడ్జెట్ వాస్తవాలతో ప్రజలకు ఎలాంటి చుక్కలు చూపెడుతారనేది మరికొద్ది క్షణాలలో తేలనుంది.