Home తాజా వార్తలు రెరాతో మేలు

రెరాతో మేలు

Builders perfect record in rera: KTR

ఇళ్ల కొనుగోలుదారులకే ప్రయోజనం
బిల్డర్లు గత జనవరి నుంచి మొదలైన ప్రాజెక్టులన్నింటినీ రెరా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : కెటిఆర్ 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ‘రెరా’ చట్టం వలన కొనుగోలు దారులకు మేలు జరుగుతుందని ఐటి, మున్సిపల్ శాఖమంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్, ఎలి గార్డ్‌లోని డిటిసిపి ప్రాంగణంలో రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) కార్యాలయా న్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు ఆయన ఎంపీలు మల్లారెడ్డి, దత్తాత్రేయలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ జనవరి 1వ తేదీ 2017 సంవత్సరంలో రెరా చట్టాన్ని అమలు చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వలన అది ఆలస్యం అయ్యిందన్నారు. జనవరి, 2017 నుంచే బిల్డర్లు రెరా కింద రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2017 జనవరి 1 తరువాత ప్రారంభమైన లే ఔట్లు, నిర్మాణాలకు సంబంధించి రెరా నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 500 గజాలకు పైన వ్యాపారం చేసే ప్రతి బిల్డర్ రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనన్నారు. దీనివల్ల కొనుగోలు దారుడితో పాటు బిల్డర్లకు మేలు జరుగుతుందని, వీరిద్దరి మధ్య పారదర్శకత నెలకొంటుందని ఆయన తెలిపారు. బెంగళూరు కన్నా హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌లో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు చాలామంది ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతుందని భయపెట్టారని ప్రస్తుతం వారి నోళ్లు మూసుకుపోయేలా రియల్ రంగం ముందుకు దూసుకెళుతుందన్నారు. పలువురి నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఆ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని ఆయన హామినిచ్చారు.

కమిటీ చైర్మన్, మెంబర్‌ల నియామకం
రెరా చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశామని ఇది కోర్టులాగే పనిచేస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. వినియోగదారుడు గానీ, బిల్డర్లు తమ సమస్యల గురించి కమిటీకి ఫిర్యాదు చేస్తే వెంటనే కమిటీ వాటికి పరిష్కారం చూపిస్తుందన్నారు. కమిటీ చైర్మన్‌గా రాజేశ్వర్ తివారీ, మెంబర్‌గా విద్యాధర్‌లను నియమించామని, త్వరలో మరో ఇద్దరు మెంబర్లను నియమిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఒక్కో బిల్డర్ వేర్వేరు చోట్ల వెంచర్లను చేసినా వాటికి సంబంధించి రెరా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కొనుగోలు దారుడికి విషయం తెలిసేలా రెరా చట్టంలో పలు అంశాలను పొందుపరిచా మన్నారు. రెరా వెబ్‌సైట్ ప్రారంభించిన మొదటిరోజే 7 రియల్ సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయన్నారు.

70 శాతం మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త నిర్మాణాలన్ని తప్పనిసరిగా రెరా నిబంధలను పాటించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రెరా అథారిటీ నుంచి అనుమతి పొందిన తరువాతే ఆ ప్రాజెక్టు వివరాలను తెలియచేయాల్సి ఉంటుందన్నారు. కొనుగోలు దారుల నుంచి డెవలపర్లు వసూలు చేసే సొమ్ములో 70 శాతం మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమచేయాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఆ సొమ్మును నిర్మాణ పనులకు వినియోగించుకోవాలంటే దానికి సంబంధించిన లెక్కలను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. సరైన అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే వారిపై రెరా కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. రెరా పరిధిలోకి రాని నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, మున్సిపల్ అడ్మిన్‌స్ట్రేటీవ్, అర్భన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.