Thursday, April 25, 2024

రెండు రోజుల్లోనే…!

- Advertisement -
- Advertisement -

Building-permits

మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు
అతి త్వరలో టిఎస్ బిపాస్ విధానం అమలు
‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ పద్ధతికి సన్నాహాలు
మంత్రి కెటిఆర్ సూచనతో విధుల్లో నిమగ్నమైన అధికారులు

హైదరాబాద్ : తెలంగాణ మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు మరింత సులభతరం కానున్నాయి. దరఖాస్తు అందిన రెండు పనిదినములలోనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేకంగా స్వీయ ధృవీకరణ పత్రం (‘సెల్ఫ్ సర్టిఫికేషన్’) పద్దతిని కార్యరూపంలోకి తీసుకువస్తున్నది. అతి త్వరలోనే ఈ నూతన సాంకేతిక వ్యవస్థను కార్యరూపంలోకి తీసుకు రావాలని రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్లానింగ్ విభాగంలోని ఉన్నతస్థాయి అధికారులతో హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని రాష్ట్ర పురపాలన, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు నిర్వహించారు.

ముందుగా విభాగంలోని ప్రణాళికా విభాగం అధికారులకు భవన నిర్మాణ అనుమతల మంజూరుకై తీసుకువస్తున్న సాంకేతిక వ్యవస్థ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం(టిఎస్ బిపాస్)పై అవగాహనపొందాలని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. అనంతరం కొత్త మున్సిపల్ చట్టం 2019కు లోబడి ప్రత్యేకంగా నియమ నిబంధనలను రూపకల్పన చేయడంలో పురపాలక శాఖ నిమగ్నమైంది. కొత్త చట్టం అమలుతో నూతనంగా ఏర్పడిన పురపాలక సంఘాలు, సంస్థల పరిధిలో భవన నిర్మాణాల అనుమతులు మరింత సరళతరం చేయడం ద్వారా దరఖాస్తుదారులు తరచూ కార్యాలయాల చుట్టూ తిరగడమనేది ఉండకూడదని ప్లానింగ్ అధికారులను మంత్రి కెటిఆర్ అదేశించినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుదారులు తమతమ దరఖాస్తులతో పాటు స్వీయ ధృవీకరణ పత్రం(సెల్ఫ్ సర్టిఫికేషన్)ను సమర్పించే నూతన పద్దతిని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

సెల్ఫ్ సర్టిఫికేషన్

భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకునే వారు నేరుగా ఆన్‌లైన్‌లో తమ స్వంత కంప్యూటర్, ఫోన్, ఇసేవ, మీ సేవల ద్వారా అందజేయాలి. దరఖాస్తును పూరించేందుకు ప్రత్యేకంగా ఒక నమూనాను పురపాలక శాఖ తయారు చేస్తున్నది. ఈ నమూనాలో పొందుపరిచిన లేదా అడిగిన విషయాలకు సంబంధించిన ప్రతి పత్రం జతపరిచితే చాలు భవన నిర్మాణ అనుమతి షార్ట్‌ఫాల్స్ లేకుండా మంజూరు చేస్తారని అధికారులు వెల్లడిస్తున్నారు. దరఖాస్తుతో పాటు నియమాలకు లోబడి నిర్మాణం చేపడతామని, రిజిస్ట్రేషన్ దస్తావేజులు, లింక్ దస్తావేజులు, భూమికి సంబంధించిన ఫోటోలు, భవనాల నమూనాలు, ప్లాటు ముందున్న రోడ్డు వెడల్పు వంటి విషయాలను స్పష్టంగా పేర్కొంటూ ప్రమాణ పూర్వకంగా వాస్తవమని, ఏదేని సమాచారం దాచినా, తప్పుడు సమచారమిచ్చినా అందుకు తగిన చర్యకు బాధ్యుడను అని పేర్కొంటూ దరఖాస్తుదారుడు నేరుగా ఆన్‌లైన్‌లో తమ పరిధి మున్సిపాలిటీకి లేదా కార్పోరేషన్‌కు దరఖాస్తును సమర్పించాలి.

ఆ దరఖాస్తు మున్సిపాలిటీకి చేరిన మరుసటి పనిదినం నాడు భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని నియమాలను రూపొందిస్తున్నారు. ఆ అనుమతితో భవనాల నిర్మాణం వెంటనే చేపట్టవచ్చును. అనుమతి మంజూరు అనంతరం 21 రోజుల్లో ఆ భవనం వద్దకు ప్లానింగ్ అధికారులు చేరుకుని సెల్ఫ్ సర్టిఫికేషన్‌లో దరఖాస్తుదారుడు పేర్కొన్న విషయాలు, ప్లాటు వద్ద ఉన్న విషయాలను సరిపోల్చుతూ ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. అన్ని సవ్యంగా ఉంటే అనుమతులను ధృవీకరిస్తారు. లేని పక్షంలో దరఖాస్తుదారుడికి 25 శాతం జరిమానా విధించడంతో పాటు చర్యలు ఉంటాయి.

ప్రస్తుత డిపిఎంఎస్‌తో జాప్యం

ఈజి ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఇఓడిబి) విధానంలో అమ లు చేస్తున్న డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం(డిపిఎంఎస్) పద్దతిని అమలు పరుస్తున్న మున్సిపల్ కా ర్పోరేషన్‌లలో దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించినా షార్ట్‌ఫాల్స్ పేరుతో అనుమతులు మంజూరులో నెలల తరబడి జాప్యం జరుగుతుంది. డిపిఎంఎస్ పద్దతిలో కేవ లం 21 రోజుల్లోనే అనుమతులు రావాలి.

కానీ, దరఖాస్తుదారుడు సరైన పత్రాలు జతపరచకపోవడం, సాంకేతికంగా ప్లాన్‌లను నియమాలకు లోబడి చేయకపోవడం తో దరఖాస్తుల పరిష్కారం తీవ్రంగా జాప్యం జరుగుతుం ది. ఫలితంగా సంస్థ లేదా సంఘంపై చెడు ప్రచారం చోటుచేసుకుంటుంది. దీనిని నివారించేందుకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాన్ని పురపాలక శాఖ మరో నెల రోజుల్లో అమలులోకి తీసుకువస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Building permits in municipalities within two days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News