Home వరంగల్ కాంగ్రెస్ మార్క్ ఘర్షణ

కాంగ్రెస్ మార్క్ ఘర్షణ

uttam-kumar-reddyమన తెలంగాణ/వరంగల్: ప్రతిష్టాత్మకంగా మారిన వరంగల్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం సైతం కాంగ్రెస్ ‘మార్క్’ ఘర్షణతోనే ప్రారంభమైంది. ఎన్నికల కార్యాచరణ ఆచరణకు నోచుకోకముందే పాలకుర్తి సెగ్మెంట్‌లో నెలకొన్న వర్గపోరు కాస్తా పరస్పర దాడులకు దారితీసింది. ఉప ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి, అభ్యర్ధిత్వంపై మండల నాయకుల అభిప్రాయ సేకరణ కోసం హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఒక వైపు పార్టీ జిల్లా, మండల నాయకులతో టిపిసిసి నేతలు సంప్రదింపులు చేస్తుండగానే మరోవైపు మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, డిసిసిబి చైర్మన్ జంగారాఘవరెడ్డి వర్గాలు పరస్పరం దాడికి తెగబడ్డారు. ఈ కుమ్ములాటలో ఇద్దరు కార్యకర్తలు రక్తమోడారు. ఎన్నికలకు ముందే దాడులతో కార్యాలయం రచ్చరచ్చగా మారింది. రానున్న రోజుల్లో ఈ ప్రభావం పాలకుర్తి సెగ్మెంట్‌లో ఇబ్బందిగా మారనున్నట్లు భావిస్తున్నారు.

దుగ్యాల వర్సెస్ జంగా
పాలకుర్తి నియోజకవర్గంపై పట్టు కోసం యత్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు, డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డిల మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి విభేదాలు చేరాయి. ఈ నేపథ్యంలోనే ఉప సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు డిసిసి భవన్‌కు దుగ్యాల రాగానే జంగా వర్గీయులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన గదిలోకి వెళ్ళి సమావేశానికి హాజరైన ఎఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రసిడెంట్ భట్టిలతో మాట్లాడి వెళ్ళిపోయారు. ఈ వివాదం కాస్తా ముదిరిపోయింది. అక్కడే ఉన్న దుగ్యాల, జంగా వర్గీయులు పరస్పరం దూషించుకుంటూ ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడంతో ఇద్దరు మండల నాయకులు గాయపడ్డారు. ముక్కు నుంచి రక్తం కారింది. మిగిలిన నాయకులు సర్ధిచెప్పే యత్నం చేసినప్పటికీ ఆవేశంతో ఊగిపోయారు. డిసిసి అధ్యక్షుడు నాయిని, గ్రేటర్ అధ్యక్షుడు తాడిశెట్టి మిగిలిన నాయకులు ఘర్షనున నివారించే యత్నం చేశారు. కాగా, ప్రధాన నేతలుండగానే జరిగిన ఘర్షణతో రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోని రెండు గ్రూపుల మధ్య పరిస్థితి ఇబ్బందికరంగానే మారనున్నట్లు చెబుతున్నారు.

కార్యకర్తల వద్దకు టిపిసిసి
ఉప ఎన్నిక జరిగే వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గ బాధ్యులు, ఓటమిపాలైన అభ్యర్ధులు, కాంగ్రెస్ పార్టీ మండల, బ్లాక్ అధ్యక్షులు, ఎంపిటీసీలు, జడ్పీటీసీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో వేర్వేరుగా ఒక్కొక్కరితో టిపిసిసి నాయకులు మాట్లాడారు. డిసిసి భవన్‌లోని గదిలో ఒక్కరిని పిలిచి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ భట్టి విక్రమార్క, అధిష్టానం దూతగా ఎఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు హాజరయ్యారు. ప్రధానంగా అభ్యర్ధి పేరు అడగకుండా ఎలాంటి వారు ఉండాలనే అభిప్రాయాన్ని సేకరించారు. మండల, క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని తెలుసుకుంటూనే ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు సాగాలనే అంశాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులకు, కొత్తవారికి టికెట్ కేటాయించాలని కోరినట్లు తెలిసింది. కొందరైతే అభ్యర్ధులు ఎవరైతే బాగుంటుందనే పేర్లు సూచించినట్లు తెలిసింది.

ఎత్తులు, పై ఎత్తులు
వరంగల్ ఉప ఎన్నికపై జిల్లా కాంగ్రెస్‌లోని వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఒక వర్గంపై మరో వర్గం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. తమ అనుకూల నేతకే అభ్యర్థిత్వం దక్కాలనే విధంగా పావులు కదుపుతున్నారు. సన్నాహక సమావేశానికి హాజరైన పిసిసి నేతల ముందు జిల్లాలోని కొందరు నేతలు తమ అనుకూలవర్గం పేర్లను సూచించినట్లు తెలిసింది. సామాన్య కార్యకర్తలు కొత్తవారికి, మంచివారికి అవకాశం కల్పించాలని సూచించారు. కొందరు మాజీ ఎంపీ వివేక్ పేరును సూచించినట్లు తెలిసింది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య తనకు సన్నిహితంగా ఉండే సిరిసిల్ల రాజయ్య పేరును చెప్పగా పొన్నాల వర్గీయులు మాజీ మంత్రి సర్వేసత్యనారాయణ పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. వీరితో పాటు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాజారపు ప్రతాప్, విజయరామారావు తదితరుల పేర్లు మరి కొందరు సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో మండల నాయకులు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని సమిష్టిగా పనిచేస్తే కాంగ్రెస్‌కు లాభిస్తుందని పిసిసి నాయకులకు తేల్చిచెప్పినట్లు సమాచారం.

ఈ సమయంలో పిసిసి నేతలు ఫలానా అభ్యర్ధి ఎలా? ఉంటారని చెప్పకుండా నాయకుల మనోభవాలను తెలుసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ అంశాలను ఎఐసిసి దృష్టి రాజు తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 28వ తేదీన అభ్యర్ధి ఎవరనేది ప్రకటించనున్నట్లు ఉత్తమ్‌కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి కార్యదర్శి మధుయాష్కీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నేరెళ్ళ శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,పిసిసి నాయకురాలు హరిరమాదేవి, జంగారాఘవరెడ్డి, కొండేటి శ్రీధర్, వెంకటస్వామి, సమ్మారావు, బలరామ్‌నాయక్, ఈవీ శ్రీనివాసరావు, బట్టి శ్రీనివాసరావు, ఘంటా నరేందర్‌రెడ్డి, రాజనాల, పోశాల పద్మ, వివిధ నియోజకవర్గాల, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.