Wednesday, April 24, 2024

కార్పొరేట్ వ్యవసాయం!

- Advertisement -
- Advertisement -

Cabinet approves ordinance for One India One Agriculture  కరవుల కష్ట కాలంలో 65 ఏళ్ల క్రితం అవతరించిన అత్యవసర సరకుల చట్టాన్ని సవరించి ఆరు రకాల వ్యవసాయ ఉత్పత్తులను దాని నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు తీసుకున్న నిర్ణయం కీలకమైనది. దీని ప్రకారం ధాన్యం, పప్పులు, నూనె గింజలు, వంట నూనెలు, ఉల్లి, బంగాళా దుంపలను ఈ చట్టం పరిధి నుంచి తొలగిస్తారు. అలాగే రైతులు తమ పంటలను ఎక్కడైనా సరే పాన్ కార్డు ఉన్నవారెవరికైనా అమ్ముకోడానికి అవకాశమిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడానికి నిర్ణయించారు. పంట నిల్వల మీద, అమ్మకం మీద ఎటువంటి ఆంక్షలు విధించరాదని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిర్ణయాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.

వీటి ద్వారా రైతుకు రాబడి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నిర్ణయాలు గ్రామీణ భారతానికి మేలు చేస్తాయని, ముఖ్యంగా శ్రమ జీవి అయిన రైతుకు మంచి జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సంస్కరణలు వ్యవసాయ రంగం రూపు రేఖలను మార్చివేస్తాయన్నారు. సన్న, చిన్న, మధ్య తరగతి రైతులు సెంటు, కుంటు లేని కౌలుదార్లు విశేషంగా ఉన్న మన దేశంలో, పంటను ఇంటికి చేర్చకుండానే అక్కడికక్కడే వ్యాపారికి తెగనమ్ముకునే స్థితిలో కొనసాగుతున్న వ్యవసాయదారుల నేలలో ఈ సంస్కరణలు ఆ రంగంలోకి కార్పొరేట్ శక్తుల నిరవరోధ ప్రవేశానికి దోహదం చేసి చేతులు దులుపుకొంటాయా, పంటదారుకు నిజంగా మేలు చేస్తాయా అనే ప్రశ్న తలెత్తుతున్నది.

పబ్లిక్ పారిశ్రామిక రంగం నుంచి తప్పుకున్న విధంగానే సాగు రంగంలోని పేద, మధ్యతరగతి రైతులకు పలు విధాలుగా అండ నిలిచే కర్తవ్య నిర్వహణ నుంచి ప్రభుత్వం వైదొలగడానికే ఈ సంస్కరణలు తెస్తున్నారని అనుకోడానికి ఆస్కారం కలిగితే తప్పు పట్టలేము. ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ యార్డులలోనే సరకు అమ్మి తీరవలసిన పరిస్థితి నుంచి రైతుకు విముక్తి కలిగించబోవడం, పంట సీజన్ ఆరంభంలోనే ఇరు వర్గాలు అంగీకరించిన ధరకు కొనుగోలుదారుతో రైతు కుదుర్చుకునే ఒప్పందానికి చట్టబద్ధత కల్పించడం వంటి ప్రతిపాదనలు బయటకు మంచివిగానే కనిపిస్తాయి. కాని మన చిన్న రైతులకు ఆ స్థాయి బేరాలాడుకునే సామర్థం ఉంటుందా? దేశంలోని రైతుల్లో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి గలవారు 86.2 శాతం మంది ఉన్నారు. వీరి యాజమాన్యంలో దేశంలోని కేవలం 47.3 శాతం వ్యవసాయ భూమి మాత్రమే ఉన్నది. అతి పరిమిత భూ కమతాల వల్ల కుటుంబాలు గడవడం లేదు.

అందుకే వీరు తోడు కృషిగా పాడి పశువుల పెంపకాన్ని ఆశ్రయిస్తున్నారు. పండించే చాలా పంటలను వీరు నేరుగా మార్కెట్ యార్డులకు తీసుకుపోడమే అరుదు. తాజా సంస్కరణలతో కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవసాయాన్ని భారీ ఎత్తున ప్రవేశపెట్టదలచిందని అర్థమవుతున్నది. ఎక్కడికక్కడ నిల్వ గోదాములు, శీతల గిడ్డంగులు నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసే కేంద్రాలు ఉంటే, స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు భూమి అద్దె, రైతులు ఇంటిల్లిపాది పడే కష్టాన్ని లెక్కగట్టి వాస్తవ సాగు వ్యయానికి జోడించి మద్దతు ధరను నిర్ణయించి, అది తప్పని సరిగా వారికి అందేలా చూస్తే రైతు కుటుంబాలు ప్రస్తుత దీన స్థితి నుంచి గట్టెక్కుతాయి. నిత్యావసర సరకుల చట్టం అవతరించినప్పటి పరిస్థితితో పోల్చుకుంటే దేశంలో వరి, గోధుమ, ఇతర అన్ని రకాల పంటలు ఇప్పుడు మంచి దిగుబడులనిస్తున్నాయి. గోదాములు చాలడం లేదు. కాని శ్రమకు తగిన ధర లభించక రైతులు అప్పులు, ఆత్మహత్యల పాలవుతున్నారు.

ప్రభుత్వం తన బాధ్యతను సవ్యంగా నిర్వహించడమే దీనికి సరైన విరుగుడు కాగలుగుతుంది. అందుకు విరుద్ధంగా ఆ బాధ్యతను ప్రైవేటు పెట్టుబడిదార్ల మీదకు నెట్టివేసే వ్యూహం అమలవుతున్నది. కోల్డ్ స్టోరేజీల వంటి సౌకర్యాల కల్పనకు దేశ విదేశీ కార్పొరేట్ పెట్టుబడులను భారీగా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రైవేటు రంగంలో వెలిసే అటువంటి సౌకర్యాలను మన చిన్న రైతులు ఎంత వరకు ఎలా ఉపయోగించుకోగలుగుతారనేది ప్రశ్న. వారికి అది అలవికాని వ్యవహారంగా రుజువైతే ఎప్పటి మాదిరిగానే ఆ సౌకర్యాలు వ్యాపార వర్గం ప్రయోజనాలకే ఉపయోగపడతాయి. అంతిమంగా రైతుల మెడలు వంచి పంట నిర్ణయం నుంచి విక్రయం వరకు కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన వాతావరణాన్ని నెలకొల్పడమే ఈ విప్లవాత్మక సంస్కరణల ఉద్దేశంగా నిరూపితమైపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ నేపథ్యంలో సన్న, చిన్న రైతాంగం తమ ప్రయోజనాల రక్షణ కోసం సంఘటితం కావడం ఒక్కటే వారికి కొంతైనా రక్షణ కలిగించగలుగుతుంది.

Cabinet approves ordinance for One India One Agriculture

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News