Thursday, July 17, 2025

నేడు సచివాలయంలో మంత్రివర్గం భేటీ

- Advertisement -
- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించే అవకాశం
ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో నిధులు జమ
రైతులకు పెట్టుబడి సాయం కింద సుమారు రూ.7,800 కోట్లు అవసరం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైతులకు రైతు భరోసా నిధుల విడుదలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు ఎన్నికల ముందు హమీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో గ్యారెంటీ అమలుకు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం. కాగా ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఆదివారం ప్రకటించారు.

సోమవారం నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని, తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పొంగులేటి సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాలని చెప్పారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు. వారం రోజుల్లో ‘రైతు భరోసా’, సన్నాలకు బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు.

రైతు భరోసా చెల్లింపులకు సిద్ధం : రైతు భరోసా చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. త్వరలోనే రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష, మంత్రిమండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించగా, నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోంది. మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

రైతులతో సీఎం ముఖాముఖి : సీఎం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రైతు నేస్తం కార్యక్రమం కింద వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రతి మంగళవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రైతు నేస్తం కింద రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఈ రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు అందించి సందేహాలను నివృత్తి చేయనున్నారు. సీఎం పాల్గొనే ముఖాముఖి కార్యక్రమం 16న మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 1500 రైతు వేదికల్లో ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది.

దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం ఖరీఫ్, రబీ సీజన్లకు గాను ఒక్కో విడతలో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. అయితే తాజాగా వర్షాకాల పంటలు ప్రారంభం కావడంతో మరోసారి రైతు భరోసా నిధులు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దీనిపైనే ఫోకస్ పెట్టింది. త్వరలోనే ప్రజల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఆర్బీఐ నుంచి రూ.7 వేల కోట్ల రుణం : తెలంగాణంలో రైతు భరోసా నిధులు చెల్లింపులకు సమయం ఆసన్నం కావడంతో నిధులు సమకూర్చడంపై తెలంగాణ ఆర్థిక శాఖ సమీకరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. శుక్రవారం మరో రూ.4 వేల కోట్ల రుణం కోసం అభ్యర్థన పెట్టింది. మొత్తం రూ.7 వేల కోట్ల నిధులు వానాకాలం రైతు భరోసా కోసం వినియోగించే యోచనలో ఉంది. ఈ మొత్తం జూన్ 17 నాటికి రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది.

2023 -24 యాసంగి సీజన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు పంపిణీ చేసింది. అయితే గత వానాకాలం సీజన్‌లో సాయం ఇవ్వలేదు. మొన్నటి యాసంగిలో 84 లక్షల ఎకరాలకు రూ.5,058 కోట్లు మాత్రమే విడుదల చేసి, 4 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకే ఈ సహాయం పరిమితం చేసింది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 1.30 కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సారి మొత్తం రైతులకు పెట్టుబడి సాయం అందించాలంటే సుమారు రూ.7,800 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్కలు వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News