Home తాజా వార్తలు వరుస వరాలు

వరుస వరాలు

Cabinet raises DA for central govt employees

సిబ్బందికి ఒక విడత డిఎ 

ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపు 

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డిఎ (కరువు భత్యం) చెల్లించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి వర్తించేలా 1.572 శాతం మేర డిఎ పెంపుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి సంత కం చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎ 27.248%కి చేరుకుంది. ఉద్యోగుల మూలవేతనంలో జనవరి 1వ తేదీ నుంచి 27.248% శాతం మేరకు కరువుభత్యం అందుకోనున్నారు. మొత్తం పెండింగ్‌లో ఉన్న రెండు విడతల కరువుభత్యంలో ఒక విడతను ముఖ్యమంత్రి మే 17వ తేదీన ప్రకటించగా మిగిలిన రెండవ విడత డిఎను తాజాగా సోమవారం ప్రకటించారు. మేలో కూడా ఉద్యోగులకు 1.572% మేర పెంపుదల ఉంది. గతేడాది సెప్టెంబరులో మూలవేతనంలో 22.008గా ఉన్న డిఎను దాదాపు 2% పెంచడంతో 24.104%కి చేరుకోగా, మే నెలలో 1.572% పెంపుతో అది 25.676%కి చేరుకుంది. ఇప్పుడు మరోమారు 1.572% పెరగడంతో చివరకు 25.676%కి చేరుకుంది. తాజాగా చేసిన పెంపు నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ. 400 కోట్ల మేర భారం పడనుంది. ఏడాది కాలంలో మూడు డిఎ ప్రకటనలు వెలువడడంతో ఉద్యోగులకు వారి మూలవేతనంలో 5.144 శాతం మేర పెంపు నమోదైంది.

రెండు రోజుల్లో మధ్యంతర భృతి?
ఉద్యోగులందరికీ మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటన రెండు రోజు ల్లో రావచ్చన్న ఊహాగానాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సం ఘాల ప్రతినిధులతో ఒక దఫా సమావేశాన్ని నిర్వహించిన కెసిఆర్ ఒకటి, రెండు రోజుల్లో మరోమా రు సమావేశమై ఐఆర్ విషయంపై చర్చించనున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. మంత్రివర్గ సమావేశాన్ని ఒకటి రెండు రోజుల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం ఇప్పటికే అన్ని శాఖల కార్యదర్శులకు సమాచారం ఇచ్చినందువల్ల ఉద్యోగుల ఐఆర్ విషయంపై చర్చించడానికి ముందే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ముఖ్యమంత్రికి సమర్పించిన విజ్ఞాపన పత్రంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు 43% మేర ఐఆర్ ఇవ్వాల్సిందిగా కోరినప్పటికీ కనీసంగా 27%కంటే ఎక్కువే ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి 43% మేర ఫిట్‌మెంట్ ప్రకటించినందున ఈసారి ఆ మేరకే ఐఆర్‌ను ఇస్తే సంతోషమని వ్యాఖ్యానించిన ఒక ఉద్యోగ సంఘం ప్రతినిధి కనీసంగా క్రితంసారి ప్రకటించిన 27% ఐఆర్‌కంటే ఈసారి కాస్త ఎక్కువే ఉండాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. గతంసారికంటే తప్పకుండా కాస్త పెరుగుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు గతంసారి 30% ఐఆర్‌ను ప్రకటించగా రెండు రోజుల క్రితం ఐదు శాతం పెంచి 35% ఇస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తమకు కూడా అదే తీరులో మెరుగుదల ఉంటుందని ఆ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎంపిడిఒలకు పదోన్నతి 

21 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 సంవత్సరాల ఎంపిడిఒల నిరీక్షణకు తెరపడింది. వీరి పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సోమవా రం ఎంపిడిఒల పదోన్నతుల ఫైల్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. దీంతో 130 మంది ఎంపిడిలకు జిల్లా స్థాయి అధికారులుగా పదోన్నతులు పొందనున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడడంతో పంచాయతీరాజ్ శాఖలో ఆ మేరకు జిల్లా స్థాయి పోస్టుల అవసరం ఏర్పడింది. దీంతో పదోన్నతులు పొందే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. సిఇఒ, డిప్యూటీ సిఇఒ, జిల్లా పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ అధికారు లు పదవీ విరమణ పొంది, ఆ బాధ్యతల నిర్వహణ తప్పనిసరైన సమయాల్లో ఆ పోస్టులకు అర్హత ఉన్న ఎంపిడిఒలకు ఆ బాధ్యతల్లో పూర్తి స్థాయి అదనపు చార్జి ఇచ్చారు. అంతే తప్ప రెగ్యులర్ పదోన్నతులు ఇప్పటి వరకు కల్పించలేదు. పదోన్నతుల కోసం ఎంపిడిఒలు అసోసియేషన్‌గా ఏర్పడి రెండు దశాబ్దాలుగా అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. మండల వ్యవస్థ ఏర్పాటైనప్పుడు ఎంపిడిఒల నియామకాలు జరిగాయి. ఎంపిడిఒలుగా నియమితులయ్యారే తప్ప ఇప్ప టి వరకు వారికి పదోన్నతులు కల్పించలేదు.

మండల వ్యవస్థ అనంతరం ఎంపిడిఒలకు పదోన్నతులు కల్పించడం ప్రథమం. రెండు దశాబ్దాలుగా కళ్లల్లో కోటి ఆశలు పెట్టుకుని కంటున్న వారి కలలను ప్రభుత్వం సాకారం చేసినట్లయింది. ముఖ్యమంత్రి ఆమోదం తెలుపడంతో వీరికి జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా గ్రామీణ అభివృద్ధికారులుగా పదోన్నతులు రానున్నాయి. ఈ పోస్టులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్న పంచాయతీరాజ్ కమిషనరేట్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్ తదితర కార్యాలయాల్లో పోస్టులకు అవకాశం దక్కనుంది.   ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు, బదిలీలలకు అనుమతి ఇవ్వగా దాదాపు అన్ని శాఖల్లోనూ ఈ ప్రక్రియ పూర్తయింది. పంచాయతీ ఎన్నికలు ఉన్నందున ఒక పంచాయతీరాజ్ శాఖలోనే ఈ ప్రక్రియ చేపట్టలేదు.

బిసిల రిజర్వేషన్లపై కోర్టులో దాఖలైన పిటిషన్లు, కోర్టు ఉత్తర్వుల మేరకు పంచాయతీ ఎన్నికలకు బ్రేకులు పడ్డాయి. దీంతో పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ఎన్నికల సంఘం ఆంక్షలను తొలగించింది. గ్రామకార్యదర్శులు, ఇఒపిఆర్‌డిల పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశారు. తాజాగా ఎంపిడిఒలకు పదోన్నతులు కల్పించనుండడం, కొత్తగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించబోతుండడం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి రావడంతో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కనుంది. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం పోరాడుతున్నప్పటికి ఫలితం దక్కలేదని, స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన తొలి కానుక అని ఎంపిడిఒల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్రరావ్, అసోసియేట్ అధ్యక్షుడు శేషాద్రి, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పేర్కొన్నారు.  21 ఏళ్ల కలను సాకారం చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.