Home దునియా డిజిటల్ విప్లవ పితామహుడు స్టీవ్‌జాబ్స్

డిజిటల్ విప్లవ పితామహుడు స్టీవ్‌జాబ్స్

 

ప్రతి ఒక్కరికి యాపిల్ ఫోన్ వాడాలనేది ఒక కల. ఎన్ని కొత్త వెరైటీ స్మార్ట్‌ఫోన్‌లు వస్తున్నా యాపిల్ ఫోన్‌మీదున్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ పోదు. ప్రపంచానికి ఆపిల్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్‌జాబ్స్‌ని ఈ నెల 16న ప్రత్యేకంగా ‘స్టీవ్‌జాబ్స్ డే’ గా గుర్తుపెట్టుకుంటున్నారు ప్రజలు.  1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన స్టీవ్‌జాబ్స్‌ని పాల్, క్లారా జాబ్స్ అనే దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో ఉన్న హైస్కూల్ చదువు పూర్తి చేసి 1972లో వోరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండులో రీడ్ కాలేజీలో చేరాడు. 1991లో లారెన్ పాల్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం.

ఆపిల్ ఇన్ కార్పొరేషన్‌ను నెలకొల్ప డానికి ముందు స్టీవ్‌జాబ్స్ పిక్చర్ యానిమేషన్ స్టూడియో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. ది వాల్ట్ డిస్నీ కంపెనీ డైరెక్టర్స్ బోర్డులో కూడా ఉన్నాడు. 1976లో స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించాడు. మొదట ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగాడు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మాడు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో ఐపిఓ వల్ల స్టీవ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది. 1984 చివరలో ఏర్పడిన మాంద్యం వల్ల ఆశించిన మేరకు వ్యాపారం జరుగకపోవడంతో 1985లో జాబ్స్‌ను మ్యాకింటోష్ విభాగ అధిపతి పదవి నుండి తొలగించారు.

తాను ప్రారంభించిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తనవద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మేశాడు. దాంతో NeXT అనే కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా, చాలా ఖరీదయినవి కావడంతో ఎక్కువమంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన ఆపిల్ డైరక్టర్లు NeXT ను 429 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. అప్పుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్ళీ ఆపిల్ కంపెనీకి తాత్కాలిక సిఇఓగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేసి కంపెనీని లాభాలబాటలో తీసుకెళ్ళడంలో ముఖ్యపాత్ర వహించినందుకు గాను 2000లో పూర్తిస్థాయి సిఇవో అయ్యాడు.

కంప్యూటర్లు మాత్రమే కాకుండా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ అయిన ఐపాడ్‌ను ఆవిష్కరించి ఆపిల్‌ను ఎవరూ అందుకోలేని స్థానానికి తీసుకెళ్లాడు. ఆపిల్ కంపెనీ సిఇవోగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం ఒక్క డాలరు ($1) మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకొనే సిఇవో గా గిన్నీస్ బుక్‌లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదయింది.  56 సంవత్సరాల వయసులో క్యాన్సర్‌తో అక్టోబర్ 5, 2011 కన్నుమూశాడు. తాను ఉదర సంబంధమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు జాబ్స్ 2004లో ప్రకటించారు. తనకు ఆఖరు ఘడియలు దగ్గరపడుతున్నాయని తెలిసినప్పట్నుంచీ భార్యా పిల్లలతో గడపడానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. ఆపిల్ ఆవిష్కర్త జ్ఞాపకార్థం 2011అక్టోబర్ 16ను స్టీవ్‌జాబ్స్‌డేగా కాలిఫోర్నియా గవర్నర్ ప్రకటించాడు. ఆయన గుర్తుగా స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ స్మారకాన్ని ఏర్పాటుచేశాడు.

 

California Declares Oct. 16 Steve Jobs Day