Home తాజా వార్తలు ఎయిర్ ఇండియా కొత్త సిఇఒగా క్యాంప్‌బెల్

ఎయిర్ ఇండియా కొత్త సిఇఒగా క్యాంప్‌బెల్

Campbell wilson appointed new ceo of air india

 

ముంబై : టాటా సన్స్ సొంతం చేసుకున్న ఎయిర్ ఇండియాకు కొత్త ఎండి, సిఇఒగా క్యాంప్‌బెల్ విల్సన్ నియమితులయ్యారు. ఈ నియామకంపై ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ఎయిర్‌ఇండియాలోకి క్యాంప్‌బెల్‌ను సంతోషంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. విమానయాన పరిశ్రమలో ఆయనకు ఎంతో అనుభవం ఉందని, ఇది ఎయిర్ ఇండియాకు ప్రయోజనం కల్గిస్తుందని అన్నారు. ప్రపంచ స్థాయి విమానయాన సంస్థను నిర్మించడంలో ఆయనతో కలిసి పనిచేయాలని తాను ఎదురుచూస్తున్నానని చైర్మన్ అన్నారు. 50 ఏళ్ల విల్సన్‌కు విమానయాన పరిశ్రమలో 26 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన జపాన్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాలలో 15 సంవత్సరాలకు పైగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఎ) గ్రూప్‌లో పనిచేశారు. టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ విస్తారాలో ఎస్‌ఐఎ భాగస్వామిగా ఉంది. నియామకంపై క్యాంప్‌బెల్ విల్సన్ స్పందిస్తూ, టాటా గ్రూప్‌లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా అవతరించేందుకు ఎయిర్ ఇండియా అద్భుతమైన ప్రయాణంలో ఉంది. ఆ ఆశయాన్ని నిజం చేసే మిషన్‌లో ఎయిర్ ఇండియా, టాటా భాగస్వాములతో చేరాలని నేను ఎదురుచూస్తున్నానని అన్నారు. విల్సన్ 1996 లో న్యూజిలాండ్‌లోని కాంటర్‌బరీ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ ఆఫ్ కామర్స్ (ఫస్ట్ క్లాస్ ఆనర్స్)తో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ప్రారంభించారు . ఆయన 1996లో న్యూజిలాండ్‌లోని సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఐస్‌ను సిఇఒగా టాటా గతంలో నియమించాలనుకుంది. కానీ ఈ పదవిని ఇల్కర్ ఐసి తిరస్కరించారు. ప్రస్తుతం టాటా సన్స్‌కు మూడు విమానయాన సంస్థలు ఎయిర్ ఏషియా, విస్తారా, ఎయిర్ ఇండియా ఉన్నాయి. ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను రూ.18,300 కోట్లకు టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. జనవరి 27న ఒప్పందం పూర్తయింది.

Campbell wilson appointed new ceo of air india