Home జాతీయ వార్తలు వందేళ్ల తర్వాత కాశీకి అన్నపూర్ణాదేవి విగ్రహం

వందేళ్ల తర్వాత కాశీకి అన్నపూర్ణాదేవి విగ్రహం

Canada to return annapurna statue to india

 

కెనడా ఆర్ట్ గ్యాలరీ నుంచి భారత్‌కు పయనం

టోరంటో: వందేళ్ల క్రితం వారణాసిలోని ఒక ఆలయం నుంచి చోరీకి గురైన హిందూ దేవతామూర్తి అన్నపూర్ణాదేవి ప్రతిమను భారతదేశానికి వాపసు చేయాలని కెనడాకు చెందిన ఒక విశ్వవిద్యాలయం నిర్ణయించింది. యూనివర్సిటీ ఆఫ్ రెజీనాకు చెందిన మెకంజీ ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచిన మాతా అన్నపూర్ణ విగ్రహం చారిత్రక తప్పులను సరిదిద్దే ప్రయత్నాలలో భాగంగా భారత్‌కు త్వరలోనే చేరుకోనున్నది. ఈ నెల 19న ఇందుకు సంబంధించిన అప్పగింతల కార్యక్రమం కూడా పూర్తయింది. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ థామస్ చేస్ ఇటీవలే కెనడాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను కలుసుకుని విగ్రహాన్ని అప్పగించే లాంఛనాలు పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో మెకంజీ ఆర్ట్ గ్యాలరీ, గ్లోబల్ అఫేర్స్ కెనడా, కెనడా బార్డర్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

అత్యంత విలక్షణమైన అన్నపూర్ణాదేవి విగ్రహం తన స్వస్థలానికి తిరిగి వెళ్లడం చాలా సంతోషంగా ఉందని, అత్యంత విశిష్టమైన ఈ సాంస్కృతిక ప్రతిమను భారతదేశానికి అప్పగించాలన్న యూనివర్సిటీ ఆఫ్ రెజీనా నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నానని బిసారియా ఈ సందర్భంగా చెప్పారు. భారత్-కెనడా మధ్య ఉన్న పరిణతితోకూడిని సాంస్కృతిక సంబంధాలకు ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. కాగా.. కాశీకి చెందిన ఈ అపురూపమైన అన్నపూర్ణాదేవి విగ్రహం మెకంజీ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న విషయాన్ని చిత్రకారిణి దివ్యా మెహ్రా వెలుగులోకి తెచ్చారు. 1913లో కెనడా ప్రధాని సర్ మెకంజీ భారతదేశ పర్యటనకు వచ్చిన సందర్భంగా వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న ఒక ఆలయంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని చూసి అబ్బురపడ్డారు.

ఈ విగ్రహం తన వద్ద ఉండాలని మెకంజీ కాంక్షిస్తున్నారని తెలుసుకున్న ఒక దొంగ ఆలయం నుంచి విగ్రహాన్ని దొంగలించి ఆయన వద్దకు చేర్చారు. అలా ఈ విగ్రహం వందేళ్ల క్రితం కెనడాకు వచ్చి మెకంజీ ఆర్ట్ గ్యాలరీలోకి చేరిపోయిందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో యూనివర్సిటీ ఆఫ్ రెజీనా తెలిపింది. ఈ విగ్రహం హిందూ దేవతామూర్తి అన్నపూర్ణాదేవిగా పీమడీ ఎసెక్స్ మ్యూజియంలోని భారతీయ, దక్షిణాసియా కళల క్యూరేటర్ డాక్టర్ సిద్ధార్థ విషా గుర్తించారు. ఒక చేతిలో క్షీరాన్నంతో కూడిన పాత్రను, మరో చేతిలో చిన్నగరిటను ధరించి ఉన్న ఈ ప్రతిమ వారణాసి నగర మహారాణి మాతా అన్నపూర్ణాదేవిగా గుర్తించారు. చౌర్యానికి గురై ఈ విగ్రహం తమ వద్దకు చేరిందని గుర్తించిన ప్రస్తుత యూనివర్సిటీ పాలకవర్గం వెంటనే తప్పును సరిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆర్ట్ గ్యాలరీ క్యూరేటర్ అలెక్స్ కింగ్ తెలిపారు. చారిత్రక తప్పులను సరిచేయాల్సిన బాధ్యత యూనివర్సిటీపైన ఉందని ఆయన చెప్పారు.

Canada to return stolen 18th century annapurna statue to india