Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) నోట్ల రద్దు బడా బాబుల కోసమే

నోట్ల రద్దు బడా బాబుల కోసమే

నోట్లరద్దు యాత్రలో మాజీ ఎంపి విహెచ్ 

VH

మనతెలంగాణ/షాద్‌నగర్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దును ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపడానికి అని చెప్పి పేద ప్రజలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారని పిల్లా జెల్లా లేని ప్రధానికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయంటూ ఘాటు వ్యాఖ్యాలతో మాజీ ఎంపి విహెచ్ హన్మంత్ రావు  ప్రసంగాన్ని ఆరంభించారు.

సోమవారం షాద్‌నగర్ పట్టణానికి చెరుకున్న నోట్ల రద్దుపై చేపట్టిన రథయాత్ర కార్యక్రమంలో ముఖ్యకూడలిలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి విహెచ్ హన్మంత్ రావు మాట్లాడుతూ నవంబర్ 8న నోట్ల రద్దు చేసి ప్రజలకు తీరని కష్టాలు తీసుకువచ్చాడని అన్నారు. ఉగ్రవాదం నిర్మూలన పేరుతో నోట్ల రద్దు చేసినట్లు ప్రకటించిన ప్రధాని దీనిపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. నోట్ల రద్దు.. రెండు వేల రూపాయల నోట్లను కేవలం బిజేపి, టిడిపి నేతల కోసమేనంటూ ఆయన ఆరోపించారు. మోడి వస్తే అన్ని లాభాలే వస్తాయని ఎదురు చూసినా నేటి వరకు ప్రజాశ్రేయస్సు కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఉద్యోగాలు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దేశం కోసం ఏమోమో చేస్తామంటూ గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నాడని అన్నారు.

బ్లాక్ మనిని వెలికి తీస్తామని చెప్పి రెండు వేల నోట్లు ముద్రించి వారి పార్టీ నాయకులకే వేల కోట్లు రిజర్వ్ బ్యాంకు నుండి నేరుగా బడా బాబుల ఇండ్లలోకి చేరాయని ఆయన విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ నిరంతరం వెన్నంటే ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బంగారు తెలంగాణ సాధిస్తామని గొప్పలు చెప్పుకొని ప్రజలను నట్టేట ముంచుతున్నాడని అన్నాడని.. వైన్స్ షాపులు పుట్టగొడుగుల్లా ప్రారంభిస్తున్నారు..

త్రాగి రోడ్డుపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వారి నడ్డి విరిస్తున్నారంటూ పేర్కోన్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి సంఘానికి వేల కోట్లు ప్రకటిస్తున్నాడే తప్ప రెండు న్నర సంవత్సరాల కాలంలో ఎవరికెన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. గతంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లకు నేటి వరకు బిల్లులు అందక గ్రామీణ ప్రజలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారే తప్ప వారికి బిల్లులు రావడం లేదన్నారు. తన స్వంత నియోజక వర్గంలో తప్పే మరెక్కడా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కనిపించడం లేదన్నారు.

రిజర్వేషన్ అంటూ హిందు ముస్లీంలకు చిచ్చు పెడుతున్నాడే తప్ప రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్దంగా ఉంటే సహకరిస్తామన్నారు. నోట్ల రద్దుపై ఇటీవల తమిళనాడులో జరిగిన నిరసనల మాదిరిగా ప్రజలు ముందుకు వచ్చి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన అన్నారు. నోట్ల రద్దు ప్రక్రియకు అసలైన సూత్రదారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని.. గతంలో ఇలాంటి పనులు చేపడుతామని చెప్పిన సమయంలోనే బాంబు పేళ్ళులు జరిగాయని ఆయన పేర్కోన్నారు.

అనంతరం షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు ప్రక్రియతో సామాన్య ప్రజలు అతలా కుతలం అయ్యారని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం సరైన విధానాన్ని అవలంబించక పోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్మెన్ విశ్వం, ఎంపిపి బుజ్జి బాబు నాయక్, మండల పార్టీ అద్యక్షులు కట్టా వెంకటేష్ గౌడ్, మాజీ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మెన్ సయ్యద్ సాదిక్ అలీ, కౌన్సిలర్లు రాజేందర్ రెడ్డి, విజయ్ కుమార్, కొంకళ్ళ చెన్నయ్య, మాజీ ఎంపిపి వన్నాడ ప్రకాశ్ గౌడ్, ఎంపిటిసి చేగూరి రాఘవేందర్ గౌడ్, దంగు శ్రీనివాస్ యాదవ్, గంగనమోని సత్తయ్య, నాలుగు మండలాల అద్యక్ష, కార్యదర్శులు ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.