Thursday, April 25, 2024

హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించిన గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ మహిళా అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

Candidates for Principal of Gurukul Schools who have resorted to HRC

 

మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి చేపట్టిన నియామక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ మహిళా అభ్యర్థులు శనివారం నాడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ పోస్టుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017లో విడుదల చేసిన నోటిఫికేషన్లో బిఇడి,పిజి అర్హత కలిగి ఉండాలని.. ఐదేళ్లు బోధనా అనుభవం, మూడేళ్లు పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులుగా అనుభవం కలిగి ఉండాలని తెలిపిందని అభ్యర్థులు కమిషన్కు వివరించారు. టిఎస్‌పిఎస్‌సి నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్లో అర్హత సాధించారని పేర్కొన్నారు. కానీ పీజీ తర్వాత బోధన అనుభవం లేనందున కొందరు అభ్యర్థులను తిరస్కరించి ఇంటర్వ్యూకి అవకాశం ఇవ్వలేదని వెల్లడించారు.

దీనిపై సంబంధిత అభ్యర్థులు హైకోర్టును సంప్రదించారని, కానీ కోర్టు తీర్పు వెలువడక ముందే మార్చి 2న గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ ఎంపిక జాబితాను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇందులో 304 పోస్టులకు 187 మందిని ఎంపిక చేశారని వివరించారు. మిగిలి ఉన్న పోస్టులకు మెరిట్ ఉన్న మహిళా అభ్యర్థులను భర్తీ చేయాల్సి ఉందని, కానీ హైకోర్టు తీర్పు, రిజర్వేషన్ నిబంధనలు ఉల్లంఘించి టిఎస్‌పిఎస్‌సి నియామక ప్రక్రియ చేపట్టిందని అభ్యర్థులు ఆరోపించారు. 93 పోస్టులను బ్యాక్‌లాగులుగా మిగల్చడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని మహిళా అభ్యర్థులు హెచ్‌ఆర్‌సిని వేడుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News