Home తాజా వార్తలు ‘సామర్థాల’ మాసోత్సవంగా సెప్టెంబర్

‘సామర్థాల’ మాసోత్సవంగా సెప్టెంబర్

Students

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల చదువుకుంటున్న విద్యార్థుల్లో సామర్థాల పెంపునకు సెప్టెంబర్ నెలను సామర్థాల సాధన మాసోత్సవంగా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండడం ఎంత ముఖ్యమో వారికి నాణ్యమైన విద్యను అందేలా చేయడం కూడా అంతే ముఖ్యమని భావించిన విద్యాశాఖ సామర్థాల పెంపుపై దృష్టి సారించింది. ఈ మేరకు విద్యాశాఖ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేలా శాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. విద్యార్థుల హాజరు పెంపొందించే ఆగస్టు నెలను హాజరు మాసోత్సవంగా నిర్వహించిన విద్యాశాఖ అంతకుముందు జూలైలో నెలలో 3 నుంచి 8 తరగతులు విద్యార్థులకు కనీస సామర్థాల సాధన పేరుతో ‘మూలాల్లోకి వెళదాం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు పెంచడంతో పాటు సామర్థాలు పెంపొందించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ నెలను సామర్థాల సాధన మాసోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు.
విద్యార్థులు చేయవలసినవి..
విద్యార్థులు ప్రతి రోజు తప్పకుండా పాఠశాలకు హాజరై, బడిలో ఏ రోజు బోధించిన అంశాలు అదే రోజు ఇంటి వద్ద పునశ్చరణ చేసుకోవాలి. హోం వర్క్ పూర్తి చేసి, ఉపాధ్యాయులు ఇచ్చిన ఆసైన్‌మెంట్, ప్రాజెక్ట్ పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి. విద్యార్థి స్వీయ మూల్యాంకనం చేసుకుని ఏ సబ్జెక్టులో తాను వెనుకబడి ఉన్నాడో గుర్తించి ఆ సబ్జెక్ట్ టీచర్‌ను సందేహాలు అడిగి తెలుసుకోవాలి. అధిక సమయం ఆ సబ్జెక్టుకే కేటాయించాలి. తోటి విద్యార్థులతో కూడా చర్చించి ఆ సబ్జెక్ట్ పట్ల ఉన్న భయాన్ని తొలగించుకోవాలి. ఉదయమే నిద్ర లేవడం వంటి మంచి అలవాట్లు కలిగి ఉండాలి. పాఠశాలలో ఆటల పీరియడ్‌లో తప్పనిసరిగా ఆటలు ఆడాలి, వ్యాయామం చేయాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. చికిత్స కంటే నివారణ ముఖ్యం కాబట్టి వ్యాధుల బారిన పడి, బడికి దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్య ఒక్కటే భవిష్యత్తు జీవితంలో మార్పు తెస్తుంది. ఇలాంటి శాశ్వతమైన మార్పును తీసుకువచ్చే విద్యను నిర్లక్షం చేసి తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి రోజువారీ పనులకు వెళ్లి డబ్బు సంపాదించడం వల్ల శాశ్వత మార్పు తీసుకువచ్చే విద్య దూరమవుతుంది.
ఉపాధ్యాయులు చేయవలసినవి..
ఉపాధ్యాయులు ముందుగా విద్యార్థి స్థాయి మదింపు చేసి అఅవసరమైన విద్యార్థులకు ప్రత్యేక బోధన చేపట్టాలి. పాఠశాల ప్రారంభానికి ముందు, పాఠశాల పనివేళలు ముగిసిన తర్వాత అవసరమైతే విద్యార్థికి సాధనలో సహకరించాలి. ప్రతి తరగతి గదిలో ఆ తరగతికి సంబంధించిన సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ప్రదర్శించాలి. పాఠ్యపుస్తకంలోని అంశాలను, సహపాఠ్య కార్యక్రమాలతో అన్వయం చేసి విద్యార్థులలో ఆసక్తిని పెంచాలి. తరచుగా బాల సభలు, క్విజ్ పోటీలు నిర్వహించాలి. తరగతి గదిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. ఉపాధ్యాయులు స్వయంగా తక్కువ ఖర్చుతో కూడిన బోధనాభ్యసన సామాగ్రిని తయారు చేసుకోవాలి. ఈ తయారీలో విద్యార్థులందరిని భాగస్వాములుగా చేయాలి. కనీస సామర్థాల సాధనలో భాగంగా సి గ్రేడ్‌లోని విద్యార్థులను బి గ్రేడ్‌లోకి, బి గ్రేడ్‌లోని విద్యార్థులను ఎ గ్రేడ్‌లోకి వచ్చే విధంగా కృషి చేయాలి. విద్యార్థులలో కనిపించిన ప్రగతిని ఎప్పటికప్పుడూ ప్రోత్సహిస్తూ, అవసరమైతే బహుమతి, ప్రశంస అందించాలి.
ప్రధానోపాధ్యాయులు చేయవలసినవి..
విద్యార్థులు వంద శాతం హాజరయ్యేలా హాజరు మాసోత్సవంలో సూచించిన కార్యక్రమాలు చేపట్టాలి. చదువు ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. వారికి నాణ్యమైన విద్య పట్ల సానుకూల దృక్పదాన్ని కల్పిస్తే వారి పిల్లల చదువు పట్ల మరింత శ్రద్ద వహిస్తారు. సామర్థాల సాధనలో ముందున్న విద్యార్థులకు పాఠశాల ప్రార్థన సమావేశంలో అభినందించి చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలి. సామర్థాల సాధనలో ప్రతిభ కనబరిచే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పాఠశాల నిర్వహణ కమిటి, తల్లిదండ్రుల కమిటి సమావేశంలో అభినందించాలి. పాఠశాలలో నమోదైన ప్రతి విద్యార్థి కనీస సామర్థాలు సాధించేటట్లు కృషి చేసి, పాఠశాలను వంద శాతం సామర్థాల సాధించిన పాఠశాలగా ప్రకటించాలి.

Capacity building in students studying in public schools