Saturday, April 20, 2024

అదుపుతప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు

- Advertisement -
- Advertisement -

Car Falls into SRSP Canal in Warangal Rural

పర్వతగిరి: విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాకలో బుధవారం చోటు చేసుకుంది. పర్వతగిరి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ పుల్యాల కిషన్ సేకరించిన వివరాల మేరకు.. కొంకపాక గ్రామ శివారులో ఎస్సారెస్పి కెనాల్‌లో కారు అదుపుపత్పి బోల్తా పడడంతో సంఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు తెలిపారు. మృతిచెందిన వారిలో పర్వతగిరి మండలంలోని గుంటూరుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న(ఎస్‌ఎ గణితం)కు చెందిన పసుల సరస్వతి, వరంగల్ వినాయక ట్రేడర్‌కు చెందిన ఓనర్ శ్రీధర్‌గా గుర్తించినట్లు సిఐ కిషన్ తెలిపారు. ఇంకొకరు ఇదే మండలానికి చెందిన రాకేష్ మృతదేహం లభ్యం కాలేదు. డ్రైవర్ విజయభాస్కర్ మృత్యువుతో పోరాడి బతికే బయటపడ్డారు. సిఐ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రమాదం జరిగిన సంఘటనలో వినాయక ట్రేడర్‌కు చెందిన శ్రీధర్ యునైటెడ్ పాస్పరైజ్ లిమిటెడ్(యుపిఎల్) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.

బుధవారం ఈయనతో పాటు విజయభాస్కర్ అనే వ్యక్తితో కలిసి ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వరంగల్ నుండి పర్వతగిరికి బయలుదేరారు. మార్గమధ్యలో నున్న సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద కొద్దిసేపు ఆగి అదే కంపెనీలో పనిచేస్తున్న పర్వతగిరి మండలంలోని ఎనుగల్లు గ్రామానికి చెందిన మరొక ఉద్యోగి రాకేష్ అదే కారులో ఎక్కించుకున్నారు. ఇదే క్రమంలో తీగరాజుపల్లి వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు పసుల సరస్వతి కారును లిప్టు అడగడంతో వారు ఆమెను సైతం కారులో ఎక్కించుకొని పర్వతగిరికి వస్తున్న నేపథ్యంలో ఎస్సారెస్పి కెనాల్ మూలమలుపు వద్ద ద్విచక్రవాహనాన్ని వస్తున్న వ్యక్తిని తప్పించపోగా అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు కెనాల్‌లో పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. మృతులు పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎంకు తరలించి గల్లంతైన మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడిన విజయభాస్కర్ అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కిషన్, స్థానిక ఎస్సై టి.ప్రశాంత్‌బాబులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News