Thursday, April 18, 2024

కొవాగ్జిన్, కొవిషీల్డ్ బూస్టర్ డోసుగా కార్బివాక్స్

- Advertisement -
- Advertisement -

ప్రయోగాలకు అనుమతి కోరిన బయోలాజికల్

Carbivax is booster dose of corona

న్యూఢిల్లీ : కరోనా వేరియంట్లు కొత్తగా పుట్టుకొస్తున్నందున టీకా మూడోడోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచిస్తుండడంతో హైదరాబాద్‌కు చెందిన ఫార్మాసంస్థ బయోలాజికల్ ఇ తమ కార్బివాక్స్ టీకాను బూస్టర్ డోసు కింద పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారికి కార్బివాక్స్‌ను బూస్టర్ డోసుగా ఇచ్చేలా మూడోదశ క్లినికల్ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డిసిజిఐకి దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం కార్బివాక్స్ టీకా రెండు , మూడు దశల క్లినికల్ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 18 నుంచి 80 ఏళ్ల లోపు వారిపై ఈ పరీక్షలు జరుపుతున్నారు. ఈ నెలాఖరు లోపు ఆ ప్రయోగాల ఫలితాలను కంపెనీ వెల్లడించనున్నది. ఈ టీకాకు ఇంకా డిసిజిఐ అనుమతులు రాకముందే కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ. 1500 కోట్లు చెల్లించింది కూడా. ఇలాంటి సమయంలో బూస్టర్ డోసు ప్రయోగాల కోసం బయోలాజికల్ ఇ డిసిజిఐ అనుమతి కోరింది. ఇప్పటికే కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారికి కార్బివాక్స్‌ను బూస్టర్ డోసుగా ఇచ్చి మూడో దశ ప్రయోగాలు చేపట్టాలని భావిస్తోంది. టీకా తీసుకున్న కొన్ని నెలల తరువాత యాంటీబాడీలు తగ్గుతున్నాయని ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో చాలా దేశాలు బూస్టర్ డోసుపై దృష్టి పెట్టాయి. కొన్ని దేశాలు ఇప్పటికే పంపిణీ కూడా ప్రారంభించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేం కూడా ఈ దిశగా ప్రయోగాలు చేపట్టాలనుకుంటున్నామని బయోలాజికల్ ఇ వెల్లడించింది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు డోసులు పూర్తయి, కొవిడ్ నెగిటివ్ ఉన్న వాలంటీర్లపై ఈ ప్రయోగాలు జరపాలనుకుంటున్నామని వివరించింది. దీనిపై నిపుణుల కమిటీ తమ తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News