Home తాజా వార్తలు కెరీర్ ప్లానింగ్ చాలా ముఖ్యం!

కెరీర్ ప్లానింగ్ చాలా ముఖ్యం!

Careers planning

 

కోర్టులో కేస్ నడుస్తోంది. కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు విడాకుల కు అప్లయ్ చేశారు. వాళ్ల మధ్య వస్తున్న వివాదాలకు సాక్షిగా వారి ముద్దుల బిడ్డ ఏడేళ్ల వాడు బోన్‌లో నిలబడి “తగువులా, అంటే ఏమిటీ? కబ ర్లు చెప్పుకోవటమా? షికారెళ్లటమా? కలసి కూర్చుని భోజనం చేయటమా… అసలు ఇవన్నీ నేను ఎరగను. స్కూల్ కి వెళ్లిపోతాను. అక్కడే భోజనం, చదువు, ఇంటికి వస్తాను. ఆయా నాకు తోడుగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్లను. వీడియో గేమ్స్ లైబ్రరీలో ఏదో ఒకటి చూస్తాను…. అమ్మానాన్న ఎప్పుడూ చెరో కంప్యూటర్‌లో బిజీగా ఉంటారు. ఏదడిగినా కొని ఇస్తారు. నాతో పెద్దగా ఎప్పుడూ మాట్లాడరు” అనేశాడు. అంటే ఏమిటి? దశాబ్దాల క్రితం ఉన్న సమస్యలు పోయాయి. ఆడపిల్లలు, మగ పిల్లలు సమానంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. డబ్బు గడిస్తున్నారు. విలాస జీవితం గడిపేపాటి స్తోమత ఉంది. కానీ జీవితమే లేదిక్కడ. ఉమ్మడి సంసారాలు, ఆధిపత్య కొట్లాటలు లేని చిన్న సంసారం కోరుకునే స్వేచ్ఛ వచ్చాయి.

మరి ఇప్పటి తరం పోగొట్టుకున్నదేమిటీ? వాళ్లు పొందుతున్న ఆనందం ఏమిటీ? ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తలు సంపాదనాపరులుగా ఉన్నప్పుడు ఇటు ఆఫీస్ పని, ఇంటిపని, పిల్లలతో గడిపేపని బాలెన్స్ చేసుకోవటం తెలియక పోబట్టే అసలు సమస్య మొదలవుతుంది. ఆఫీస్ పని గంటల రిపోర్టులు, నివేదికలతో రోజుకు 12,13 గంటలు ఆఫీస్‌ల్లో ఉండాలి. ఇక కేవలం నిద్రకే ఇంటికి రావటం అన్న చందంగా ఉంది జీవితం. పనిలోనే, ప్రమోషన్స్‌లోనే, సంపాదనలోనే జీవితం వెతుక్కున్న జంటలు కొత్తగా తమ మధ్యకి వచ్చిన పిల్లల గురించి కేటాయిస్తున్న సమయం ఏది? అసలు పిల్లలు ఏం చదువుతున్నారో, వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందో, వాళ్లను ఎవరి వద్ద వదిలేసి వెళుతున్నారో, ఆ హెల్పర్స్ మనస్తత్వం ఏమిటో, పిల్లలు ఏం వంటబట్టించుకుంటున్నారో పేరెంట్స్ ఎరగరు. కుటుంబ అవసరాల దృష్టా సంపాదన తప్పదు.

భార్యాభర్తల్లో ఇరువురికీ ఎవరి లక్షాలు వాళ్లకు ఉంటాయి. కానీ పెళ్లితో ఒకటవ్వాలని నిర్ణయించుకొన్నాక ఉమ్మడి లక్షాలు తేల్చుకోవాలి. ఇల్లు నడిపేది, పిల్లల్ని పెంచేది, ఆదాయ మార్గాలు కేటాయించే సమయాలు, భవిష్యత్తు ముందే ప్లాన్ చేసుకుంటే ఏ గొడవ ఉండదు. పిల్లల్ని పెంచే పెద్దవాళ్లు ఇంట్లో ఉండి ఇల్లు నడిపే బాధ్యత వాళ్లు తీసుకుంటే యువ జంట వాళ్ల ప్రణాళికల్లో వాళ్లు ఉండవచ్చు.

ఉద్యోగం చేస్తున్న భార్యలకు సహకారం ఇవ్వటం భర్తల బాధ్యత. ఇంటి బాధ్యతలను బాలెన్స్ చేయటంలో అతని నుంచి అందే సహకారం పైనే భార్య భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. ఇంటి శుభ్రత, వంటపని పిల్లల అవసరాలు ఎక్కువగా ఆడవాళ్ల పనే. ఈ పనుల్లో భర్త కూడా సమాన బాధ్యత తీసుకుని, రాని పనులు నేర్చుకుని భార్యకు సహకరిస్తే ఇంక ఆ ఇంట సమస్యలు రానట్లే. ఇంట్లో వాడుకునే వస్తువులు తేవటం నుంచి ఆరవేసిన బట్టలు మడత పెట్టడం వరకు భర్త్త కూడా అన్ని పనులు సమర్థవంతంగా చేయచ్చు. ప్రతిరోజూ సాయంత్రం ఇంటికి రాగానే ఇద్దరూ కలసి ఒక గంటలోపని ముగించుకుని విశ్రాంతిగా కూర్చోవచ్చు. వినోద కార్యక్రమాలకు వెళ్లవచ్చు. ఇలా అలవాటైన ఇంట్లో పిల్లలుంటే వాళ్లకు మాత్రం సమస్యలు ఏముంటాయి. ఏమొస్తాయి. భార్యాభర్తలు ఇద్దరూ పిల్లల్ని పద్ధతిగా ప్లాన్ ప్రకారం పెంచుకోవచ్చు. ఇంటి పనులు చేసుకుని, పిల్లలతో గడపచ్చు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా, చక్కని ప్లాన్ తో ఉన్నత స్థితిలో ఉండచ్చు. పిల్లల చదువులు, పెద్దవాళ్ల సేవ, భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ పద్ధతిగా సర్దుబాటు చేసుకోవచ్చు. వాళ్ల సంసారం సుఖంగా సాగుతుంది. దాంతోపాటు పిల్లలు కూడా మంచి వాతావరణంలో ఎదుగుతారు. ఇదంతా కూడా కెరీర్ ప్లానింగ్‌తోనే సాధ్యం అంటున్నారు నిపుణులు.

Careers planning very important in Marriage life