Home సంగారెడ్డి ఎంఐఎం ఎంపి, ఎంఎల్‌ఎల కేసు కొట్టివేత

ఎంఐఎం ఎంపి, ఎంఎల్‌ఎల కేసు కొట్టివేత

ASADUDDEN

సంగారెడ్డి ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం ముత్తంగి ప్రార్థన మందిరం విషయంలో గతంలో ఎంఐఎం ఎంపి, ఎమ్మెల్యేలపై నమోదైన కేసును కొట్టివేశారు. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి వెంకట్‌రామ్ ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దిన్ ఓవైసీ, మహమ్మద్ పాషా కాద్రి, ముంతాజ్‌ఖాన్, మొజహీంఖాన్‌లతో పాటు ముత్తంగి గ్రామానికి చెందిన మరో 24 మందిపై ఉన్న కేసులను కూడా కొట్టివేసినట్లు గురువారం తీర్పు వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాలోని 65వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రెవెన్యూ అధికారులు పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో 2005 ఎప్రిల్ 16వ తేది నాడు ప్రార్థన మందిరం గోడను కూల్చివేసి పనులు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ, అక్బరుద్దిన్ లతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఘటన స్థలికి చేరుకొని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ సింఘాల్‌తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడటమే కాకుండా, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై పటాన్‌చెరు పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. దాదాపు 11 సంవత్సరాల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. 2005 నుంచి కేసు విచారణ కొనసాగుతుండగా ఎంఐఎం ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు కోర్టుకు హాజరు కాకపోవడంతో వారందరికి కోర్టు ఎస్‌బి డబ్లూ జారీ చేసిచేసింది. దీంతో అసదుద్దిన్, అక్బరుద్దిన్ ఒవైసీలు మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు కోర్టుకు హజరై ఎన్‌బిడబ్లూను రికాల్ చేయించుకున్నారు.

వీరి తర్వాత 2012లో కోర్టుకు హాజరై ఎస్‌బిడబ్లూను రీకాల్ చేయాల్సిందిగా అసదుద్దిన్ ఓవైసీ ఇక్కడి ఎక్సైజ్ కోర్టులో పీటీషన్ దాఖలు చేయడంతో అప్పట్లో ఆ పిటీషన్‌ను తిరస్కరించింది. దీంతో అసదుద్దిన్ నాలుగుర్జోల పాటు సంగారెడ్డి జైలులో ఉండాల్సి వచ్చింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎంగా ఉన్నప్పుడు అసదుద్దిన్ ఓవైసి జైలుకు వెళ్లాడు. నాలుగురోజుల పాటు సంగారెడ్డి జైలులో ఉన్న బేల్‌పై విడుదలైన తర్వాత పత్రికల వారితో మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసదొద్దిన్ సంగారెడ్డి జైలులో ఉండగా దాదాపు అదే సందర్భంలో ఎమ్మెల్యే అక్బరొద్దిన్ ఆదిలాబాద్ నిర్మల్‌లో ప్రజల్ని రెచ్చగొట్టి ప్రసంగం చేశారనే ఆరోపణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. కోర్టులో కేసు కొట్టివేయడంతో ఓవైసీ సోదరుల తరపు న్యాయవాది నిజామొద్దిన్, రఘునందన్ రావులు హర్షం వ్యక్తం చేశారు.