Saturday, April 20, 2024

‘అభిమానులు’ క్లీన్‌బౌల్డ్

- Advertisement -
- Advertisement -

జింఖానాలో తొక్కిసలాట

3వేల టికెట్ల కోసం 30వేలకు పైగా తరలివచ్చిన ప్రేక్షకులు అదుపు చేయలేక
చేతులెత్తేసిన పోలీసులు 20మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
అందుబాటులో లేని ఆన్‌లైన్ టిక్కెట్లు హెచ్‌సిఏ వైఫల్యంపై ప్రభుత్వం సీరియస్
హెచ్‌సిఏ ప్రతినిధులతో క్రీడా శాఖ మంత్రి సమీక్ష ఘటనకు బాధ్యులైన వారిపై
చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

అజారుద్దీన్ సహా హెచ్‌సిఏ నిర్వాహకులపై కేసులు

మన తెలంగాణ/ హైదరాబాద్/ సిటిబ్యూరో: ఉప్పల్ వేదికగా భారత్ –ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న జరగనున్న టి 20 మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో.. సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హెచ్‌సిఎ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతోందంటూ ఆందోళనలు చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్‌ఆర్సీలో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఆఫ్‌లైన్‌లో టికెట్లు ఇస్తామని హెచ్ సిఎ ప్రకటించడంతో.. క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్యారడైజ్ నుంచి జింఖానా గ్రౌండ్ వరకు క్యూలైన్లను పోలీసులు ఏర్పాటు చేశారు. చాలా మంది తరలివస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ.. సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్ గేట్ ద్వారా ఒక్కసారిగా అభిమానులు తోసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. తొక్కిసలాటలో 20మందికి గాయాలు కాగా, తిరుమలగిరికి చెందిన కోహ్లీ అభిమాని ఆలియా(19) తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు స్థానికంగా ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. 3000 టికెట్ల కోసం 30 వేల మంది అభిమానులు తరలిరావడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. తొక్కిసలాటలో అభిమానులతోపాటు పది మంది పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. మైదానంలో ఉద్రిక్తత ఏర్పడడంతో హెచ్‌సిఎ టికెట్ కౌంటర్లను మూసివేసింది.

తెలంగాణ ఖ్యాతికి భంగం కలిగితే సహించం

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించబోదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఈ నెల 25న జరిగే ఇండియా – – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టి 20 క్రికెట్ మ్యాచ్ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని రవీంద్రభారతిలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయా, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, టిఎస్‌పిడిసిఎల్ ఎండి రఘుమా రెడ్డి, జిహెచ్‌ఎంసి, జలమండలి, క్రీడాశాఖ కార్యదర్శి, అధికారుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ క్రీడాభిమానులు ప్రత్యక్షంగా మైదానంలో వీక్షించాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ టికెట్ల కోసం ప్రయత్నిస్తారు. ఈ నెల 25న మ్యాచ్ ఉన్నప్పుడు పది రోజుల ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా అన్నారు. టికెట్లు ఎక్కడ విక్రయిస్తున్నారో మాకు కూడా సమాచారం ఇవ్వలేదని, ఈ రోజు అడిగితే రకరకాల సమాధానం చెబుతున్నారనారు.

నిన్న మీడియా వేదికగానే హెచ్‌సిఎకు స్పష్టంగా చెప్పాం. ఎవరైనా బ్లాక్లో టికెట్లు అమ్మి దందా చేసినా.. తెలంగాణ ప్రతిష్ఠ దిగజార్చినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోమని చెప్పామన్నారు. హెచ్‌సిఎ ప్రైవేటు వ్యవహారం అని అనుకున్నా.. వేలాది మంది జనం వస్తారు గనక శాంతిభద్రతల సమస్య వస్తుందని, ముందే ప్రభుత్వానికి సమాచారం ఇస్తే పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు, అగ్నిమాపక శాఖలు సమన్వయం చేసుకుంటాయి కదా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఇప్పటికే జారీ అయిన ప్రభుత్వ జీవో ప్రకారం సమాచారం ఇవ్వాలని అడిగినా సొంత వ్యవహారంలా నడుపుకొన్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తెలంగాణలో అలా కుదరదు.. పారదర్శకంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని స్పష్టంగా చెప్పామనన్నారు. ఉప్పల్ స్టేడియంలో సీట్ల సామర్థం 60 వేలు కావడంతో నిర్వాహకులు రెండు వారాల క్రితమే మొత్తం టిక్కెట్లను విక్రయించారు. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలపై భారీగా అవకతవకలు జరిగాయని క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడంతో క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు మరోసారి టిక్కెట్లు నిర్వహిస్తామని ప్రకటించారు.

మహిళకు సిపిఆర్ చేసిన లేడీ పిసి…

బేగంపేట పిఎస్‌లో పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ నవీనను అందరూ అభినందిస్తున్నారు. తొక్కిసలాట అనం తరం ప్రాణాపాయంలో ఉన్న మహిళకు నవీన సిపిఆర్ చేసి ప్రాణాన్ని నిలిపింది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో అందులో 45ఏళ్ల మహి ళ స్పృహ తప్పిపడిపోయింది. ఇది గమనించిన కానిస్టేబుల్ నవీన మహిళను బయటికి లాగింది. అప్పటికే స్పృ హ కోల్పోవడంతో మహిళా ఊపిరి అందని పరిస్థితిలో ఉండడంతో నవీన వెంటనే సిపిఆర్ చేసి కాపాడింది.

టిక్కెట్ల విక్రయంపై కమిటీ…

టి20 క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయంపై విచారణ కమిటీని వేసినట్లు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మ్యాచ్ 32వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ ప్రశ్నించారు. ఒక్క రోజే టిక్కెట్లు ఎలా అమ్ముతారని నిలదీశారు.హెచ్‌సిఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలని అన్నారు.

అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై
మూడు కేసులు నమోదు

అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సిఎ నిర్వాహకులపై బేగంపేట పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. అదితి ఆలియా ఎస్‌ఐ ప్రమోద్ ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ యాక్ట్ తో పాటు 420, 21,22/76 పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్ల నిర్వహణతో పాటు వాటిని బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదులందాయి. తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సిఎ నిర్లక్ష్యం వహించడమే కారణమని చికిత్స పొందుతున్నా వారు ఫిర్యాదు చేయ్యాడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News