Home కెరీర్ నమూనా పరీక్షలే క్యాట్‌కు కీలకం

నమూనా పరీక్షలే క్యాట్‌కు కీలకం

CAT-Exam preparation tips

ఎంత సాధన చేస్తే అంత మంచిది
దరఖాస్తుకు సెప్టెంబర్ 19 వరకు గడువు
నవంబర్ 25వ తేదీన పరీక్ష 

ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) సంస్థలలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) ప్రకటన వెలువడింది. ఐఐఎం సంస్థలతోపాటు, దాదాపు అంతటి అత్యున్నత కళాశాలల్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఎంబిఎ)లో చేరటానికి క్యాట్‌లో మంచి స్కోరు సాధించాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం చదివితే ఈ పరీక్షలో విజయానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్ష అయిన క్యాట్‌లో మెరుగైన ప్రతిభ చూపేందుకు నెలల తరబడి పట్టుదలతో కృషి చేస్తున్నారు అభ్యర్థులు. తీవ్రమైన పోటీ ఉంటుంది కాబట్టి ప్రతి మార్కూ ముఖ్యమైనదే. అందుకే ప్రతి అభ్యర్థీ తన ప్రస్తుత స్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించటం అవసరం. నైపుణ్యాలతో పాటు వేగంగా సమాధానాలు గుర్తించడం పట్ల శ్రద్ద వహించాలి. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు నమూనా పరీక్షలతో అభ్యర్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. నమూనా క్యాట్ రాసిన ప్రతిసారీ దాన్ని సంపూర్ణంగా విశ్లేషించుకోవాలి. ప్రాక్టీసు టెస్టుల్లో స్కోర్లు ఎలా ఉన్నాయో చూసుకుంటూనే ప్రతి అంశంలోనూ అభ్యర్థి తన బలాలూ, బలహీనతలూ గమనించుకోవాలి.

అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లేదా తత్సమాన సిజిపిఎతో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు (ఎస్‌సి,ఎస్‌టి, వికలాంగులకు 45 శాతం మార్కులు) కలిగిన అభ్యర్థులు క్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితో పాటు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్ స్కోర్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. అంటే 2019 డిసెంబర్ 31 వరకు ఈ స్కోర్‌కు వ్యాలిడిటీ ఉంటుంది.

క్యాట్‌తో ప్రవేశాలు కల్పించే సంస్థలు
దేశవ్యాప్తంగా ఉన్న 20 ఐఐఎంలతో పాటు పలు డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రముఖ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐఎంలలో ప్రవేశాలకు అభ్యర్థులు వివిధ రకాల పరీక్షల్లో ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. క్యాట్ స్కోర్‌తో పాటు గ్రూప్ డిస్కషన్/రాత నైపుణ్య పరీక్ష,ఇంటర్వూ ద్వారా ఐఐఎంలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ స్కోర్‌తోనే పిహెచ్‌డికి సమానమైన ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఎఫ్‌పిఎం)లో ప్రవేశాలు కల్పిస్తారు.

సిలబస్
క్యాట్ పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లుంటాయి.
1. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్
2. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్
3. క్వాంటిటేటివ్ ఎబిలిటీ

క్వాంటిటేటివ్ ఎబిలిటీ
గణితంపై అంతగా పట్టులేని అభ్యర్థులు, ముందుగా ఆ అంశం నుంచే తమ సన్నద్ధతను ప్రారంభించాలి. ఎందుకంటే గణిత సమీకరణాల సూక్ష్మీకరణ ఇందులో ప్రధానాంశం. మిగతా ఏ అంశాల్లో అయినా సరే, దీని ఉపయోగం ఉంటుంది. ఇందులో షార్ట్‌కట్స్ కూడా ఉంటాయి. అయితే వేగంగా సూక్ష్మీకరించాలంటే సాధనే మార్గం. అవసరం అయితే, పాఠశాల స్థాయి పుస్తకాలను తిరగేయడం ద్వారా పట్టు లభిస్తుంది. ఇప్పుడు చేయాల్సిందల్లా వాటికి అనువర్తనాన్ని చేయడమే. ఒక అంశాన్ని ఎంచుకుని దానిని వివిధ రకాలుగా ప్రశ్నలు వేస్తూ, పరిష్కరించాలి. ఫలితంగా ప్రశ్న కోణం అలవడుతుంది.

డేటా ఇంటర్‌ప్రిటేషన్
క్వాంటిటేటివ్ ఎబిలిటీ తర్వాత సిద్ధం కావాల్సిన అంశమిది. అర్థమెటిక్‌లో నేర్చుకున్న నిష్పత్తులు, శాతాలు, సరాసరి ఇక్కడ కూడా ఉపయోగపడతాయి. అలాగే సూక్ష్మీకరణాలు ఎలాగూ నిత్యం సాధన చేస్తుంటాం కాబట్టి ఈ సెక్షన్ సన్నద్ధతకు పెద్దగా సమయం కేటాయించాల్సిన పనిలేదు. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో పట్టికలు, గ్రాఫ్‌లు, చార్ట్‌లు ఉంటాయి. ఇచ్చిన డాటాను అభ్యర్థి అర్థం చేసుకుని ఎలా విశ్లేషించగలడో ఇందులో పరిశీలిస్తారు.

లాజికల్ రీజనింగ్
క్యాట్‌లో ఉన్న ఇతర అంశాలన్నీ అకడమిక్ చదువులో ఎప్పుడో ఒకప్పుడు సిలబస్‌లో భాగంగా ఉంటాయి. పూర్తిగా కొత్త అంశం ఇదే. అయితే వ్యక్తుల తార్కిక పరిజ్ఞానం, సమయస్ఫూర్తికి సంబంధించింది ఇది. ఇందులో నంబర్, లెటర్ సిరీస్, వెన్ డయాగ్రమ్స్, బైనరీ లాజిక్, సీటింగ్ అరేంజ్‌మెంట్, సిలాజిజం, లాజికల్ మ్యాచింగ్, లాజికల్ సీక్వెన్స్, లాజికల్ కనెక్టివ్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్ తదితర అంశాలు ఉంటాయి. ఇందులో బ్లడ్ రిలేషన్స్ నుంచి ప్రారంభించి తర్వాత సీటింగ్ అరేంజ్‌మెంట్, పఘఠజిల్స్‌కు వెళ్లాలి. ఇందులో ప్రాథమికాంశాలు అంటూ ఉండవు. నేరుగా సాధన పేపర్లను చేస్తూ వెళ్లాలి. క్రమం తప్పకుండా ఈ విభాగానికి సమయం కేటాయించాలి. పరీక్ష జరిగే వరకూ కూడా నిత్యం ఒక పేపర్ పూర్తిచేయాలి. ఈ విభాగంలోనే క్లాక్స్, క్యాలెండర్ ఆధారిత అంశాలు కూడా ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో భాగంగా నేర్చుకుంటారు. కాబట్టి, సాధనకు పరిమితం అయితే చాలు.

వెర్బల్ ఎబిలిటీ
ఇంగ్లిష్ భాషపై పట్టును అడిగే అంశంగా దీనిని చెప్పుకోవచ్చు. వ్యాకరణంతోపాటు పదాల వాడకం ఎలా ఉంటుందన్న అంశంపై లోతుగా ప్రశ్నలు అడుగుతారు. సమాన, వ్యతిరేకార్థాలు (సిననిమ్స్, యాంటనిమ్స్), సెంటెన్స్ కరెక్షన్, జంబుల్ పారాగ్రాఫ్, క్లోజ్‌టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ తదితర అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఇన్ఫరెన్సెస్, జడ్జిమెంట్ అంశాలు కూడా ఇందులో భాగమే. ఇంగ్లిష్ భాషపై పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా అభ్యర్థులు ప్యాసేజ్‌ను అర్థం చేసుకుని విశ్లేషించడం, అన్వయ రీతిని కూడా పరీక్షిస్తున్నారు. అందుకే, కొత్త ప్యాసేజీలు లేదా ఇంగ్లిష్ భాషలో కొత్త సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు చదువుతూ ప్రతి అంశాన్నీ విశ్లేషించుకోవాలి. పరీక్ష జరిగే వరకూ కూడా ప్రతిరోజూ 50 నుంచి 100 వరకు కొత్త పదాలను నేర్చుకుంటూ ఉండాలి.

రీడింగ్ కాంప్రహెన్షన్
ఇచ్చిన అంశాలపై అభ్యర్థి అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని ఈ అంశంలో పరీక్షిస్తారు. ఇంగ్లిష్ భాషపై ఎంత పట్టు ఉందో కూడా ఈ విభాగంలో తెలుస్తుంది. సందర్భానుసారంగా పదాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇందుకు రోజూ ఆంగ్లపత్రికలో వచ్చే సంపాదకీయాలు, రాజకీయాలు, బిజినెస్, పాలన, శాస్త్ర సాంకేతిక అంశాలు, సాహిత్యానికి సంబంధించినవి చదవాలి. అంతర్జాతీయ స్థాయి దినపత్రికలు కూడా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లభ్యం అవుతున్నాయి. వాటిని చదువుతూ అదే ప్యాసేజ్ పరీక్షలో వస్తే ఏ తరహా ప్రశ్నలు అడగవచ్చో వూహిస్తూ జవాబులను రాబట్టాలి. ఇలా చేయడం ద్వారా ఈ అంశంపై పట్టు లభిస్తుంది.

సమయపాలన కీలకం
ఈ ఏడాది నవంబర్ 25(ఆదివారం) క్యాట్ పరీక్ష నిర్వహించనున్నారు. అంటే సుమారు 55 రోజుల సమయం పరీక్షకు అందుబాటులో ఉంది. ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు లేదా పూర్తిస్థాయి వెచ్చించలేనివాళ్లు ముందుగా ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. ఆ తర్వాత ప్రతిరోజూ ఒక పరీక్ష రాస్తూ వెళ్లాలి. ఎక్కువ తప్పులు చేస్తున్న అంశాలను గుర్తించి, వాటిలోనే ఎక్కువ సంఖ్యలో సాధన చేయడం మంచిది. నిత్యం ఒక నమూనా పరీక్షను రాయడంతోపాటు ఒక్కో అంశంలో విడిగా పరీక్ష రాస్తూ వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధన మరవకూడదు. క్యాట్‌కు ఈ మాక్ పరీక్షలే కీలకం. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచిది. మంచి పర్సంటైల్ సాధించడం ద్వారా అత్యుత్తమ కళాశాలల్లో సీటును దక్కించుకోవచ్చు. పరీక్షహాలులోనూ సమయపాలన చాలా కీలకం. మొత్తం ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు ఉంటాయి. కేటాయించిన సమయం 180 నిమిషాలు. అయితే, ప్రతి అంశానికి సంబంధించి నిర్ణీత సమయం ఉంటుంది. ఆ విభాగంలోనే మరో ప్రశ్నకు వెళ్లవచ్చు కానీ, మరో విభాగానికి వెళ్లే ఆస్కారం ఉండదు.

ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల ముగింపు : సెప్టెంబర్ 19
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: అక్టోబరు 24 నుంచి
పరీక్ష తేదీ :నవంబర్ 25
ఫలితాలు విడుదల : 2019 జనవరి రెండవ వారం
రిజిస్ట్రేషన్ ఫీజు : రూ. 1900 (ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు రూ. 950)
వెబ్‌సైట్ : www.iimcat.ac.in
హెల్ప్ డెస్క్ నెంబర్ : 18002090830.