*ఓరియంటల్ బ్యాంకుకు రూ. 200 కోట్ల టోకరా
న్యూఢిల్లీ: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఒబిసి)ను రూ. 200 కోట్ల మేరకు మోసగించినందుకు సింభావలీ షుగర్స్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్(సిఎండి) గుర్మీత్ సింగ్ మాన్‌పై, డిప్యూటీ ఎండి గుర్పాల్ సింగ్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సిఎఫ్‌ఒ సహా మరి ఎనిమిది మందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. హపుర్‌లోని సింభావలీ షుగర్స్ లి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఒబిసి)మీరట్ శాఖలో 2011లో, మళ్లీ 2015లో కూడా రూ.200 కోట్ల మేరకు మోసానికి పాల్పడింది.2011లో దాదాపు 5200 మంది చెరుకు రైతులకు ఫైనాన్స్ చేయడం కోసం రూ. 150 కోట్లు రుణంగా కోరింది. అందుకు రైతుల కెవైసిలు సమర్పించింది. అయితే డబ్బును రైతుల ఖాతాలకు బదిలీ చేయగా దాన్ని ఇతర అవసరాలకు మళ్లించింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఒబిసి) రుణ బకాయిని రాబట్టడానికి డెట్ రికవరీ ట్రిబ్యునల్(డిఆర్‌టి)ని ఆశ్రయించగా సింభావలీ షుగర్స్ 2015లో మళ్లీ రూ. 110 కోట్లను రుణాన్ని తన నష్టాన్ని ఒకేసారి తీర్చేసుకునేందుకు తీసుకుంది. సింభావలీ షుగర్స్ లిమిటెడ్ భారత్‌లో అతి పెద్ద షుగర్ రిఫైనరీ కంపెనీల్లో ఒకటి. పైగా బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజిలో లిస్ట్ అయింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు సింభావలీ షుగర్స్ లిమిటెడ్ రూ.109 కోట్ల నష్టాన్ని కలిగించిందని సిబిఐ తెలిపింది. రుణ ఖాతా రూ. 148.59 కోట్లను నిరర్ధక ఆస్తిగా(ఎన్‌పిఎ) 2015 మార్చిలో ప్రకటించారు. 2015 మేలో మోసంను గుర్తించారు.