Thursday, April 25, 2024

నిర్దోషులు

- Advertisement -
- Advertisement -

CBI special court has given a clean chit to accused in Babri Masjid case

 

దశాబ్దాల దర్యాప్తుకు తెరపడింది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థాం బుధవారంనాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రకటించింది. దీంతో ఈ కేసులో నిన్నటి వరకు ముద్దాయిలుగా ఉన్న బిజెపి అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, కల్యాణ్ సింగ్ తదితర 32మంది ఊపిరిపీల్చుకున్నారు. 2000 పేజీల తీర్పును సంక్షిప్తంగా న్యాయమూర్తి ఎస్‌కె యాదవ్ చదివి వినిపించారు. తీర్పు సందర్భంగా అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో 26మంది కోర్టుకు హాజరుకాగా, ఆరుగురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, దేశరాజధాని ఢిల్లీలో డేగకళ్ల భద్రత కనిపించింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ప్రకటించిన వెంటనే నిర్దోషులు ఆనందం వ్యక్తం చేశారు. బిజెపి శ్రేణులు బాణసంచా కాలుస్తు, మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు. మరోవైపు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీర్పుపై పెదవి విరిచింది. హైకోర్టును ఆశ్రయిస్తామని ఆ సంస్థ తరపు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ ప్రకటించారు.

 

బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీ, జోషి, ఉమా భారతి, కల్యాణ్ సింగ్, కతియార్ సహా 32మందికి సిబిఐ ప్రత్యేక కోర్టు క్లీన్‌చిట్
-మసీదు కూల్చివేత కుట్రకాదు.. అందుకు ఆధారాల్లేవు
విధ్వంసం విద్రోహశక్తుల పనే
ముద్దాయిలకు వ్యతిరేకంగా సరైన సాక్షాధారాలు లేవు
సిబిఐ సమర్పించిన ఆడియో, వీడియో స్పష్టంగా లేదు
తీర్పు సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యలు
స్వాగతించిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్
హైకోర్టును ఆశ్రయిస్తాం : ఎఐఎంపిఎల్‌బి
బాబ్రీ ఘటన ముఖ్యాంశాలు:
బాబ్రీ విధ్వంసం : డిసెంబర్ 2, 1992
అద్వానీ సహా 49మంది నిందితులు
విచారణ దశలో 17మంది నిందితులు మృతి
తీర్పు వెలువడే నాటికి బతికున్న వారు 32మంది
విచారించిన సాక్షులు 351మంది
28ఏళ్ల సుదీర్ఘ విచారణ
సెప్టెంబర్ 30నాటికి విచారణ ముగించాలని
సిబిఐ కోర్టుకు సుప్రీం ఆదేశం
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు
బుధవారంనాడు తీర్పు ప్రకటించిన న్యాయస్థానం

జై శ్రీరాం

‘చాన్నాళ్ల తర్వాత అద్భుతమైన వార్త అందింది. ఈ సందర్భంగా ఒక్కటి మాత్రం చెప్పగలను. జైశ్రీరాం. వచ్చిన తీర్పు చాలా ముఖ్యమైంది. మా అందరికీ సంతోషకరమైన క్షణం. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. రామ జన్మభూమి ఉద్యమం పట్ల నా వ్యక్తిగత నిబద్ధత, పార్టీ నిబద్ధతను ఈ తీర్పు నిరూపిస్తుంది.
                                                                                              ఎల్‌కె అద్వానీ, బిజెపి అగ్రనేత

సుప్రీం తీర్పుకు విరుద్ధం

సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలి. బాబ్రీ కూల్చివేత చట్ట విరుద్ధమని నవంబర్ 9న సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అందుకు విరుద్ధంగా ఉంది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు లోతైన రాజకీయ కుట్రలు చేస్తున్నారు. దేశ సౌభ్రాతృత్వాన్ని చెడగొడుతున్నారు
                                                                                                    కాంగ్రెస్

బ్లాక్ డే

అంతా నిర్దోషులైతే మసీదును ఎవరు కూల్చినట్లు? బాబ్రీ దానంతట అదే కూలిపోయిందా? మసీదును ఎవరు కూల్చారో ప్రపంచం మొత్తం చూసింది. ఉమా భారతి మసీదును కూల్చండి అని నినాదాలు చేశారు. ఈ తీర్పుపై సిబిఐ హైకోర్టుకు వెళ్లాలి. మమ్మల్ని ఖతం చేసి వాళ్లు పదవులు అనుభవించారు. ఇప్పుడే మో అందరికీ క్లీన్‌చిట్ ఇచ్చారు. న్యాయచరిత్రలో ఈ రోజు బ్లాక్ డే.
                                                                                     అసదుద్దీన్ ఒవైసి, ఎంఐఎం

లక్నో : ఏళ్ల తరబడి సాగుతూ వస్తోన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మంది నిందితులకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం క్లీన్‌చిట్ ఇచ్చింది. కూల్చివేత ఘటనకు సంబంధించి వీరంతా ఎటువంటి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు సరైన సాక్షాధారాలు లేవని, అందుకే వీరందరిపై వచ్చిన అభియోగాలను కొట్టివేస్తూ, వీరిని నిర్దోషులుగా పేర్కొంటున్నట్లు సిబిఐ కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ తమ తీర్పులో వెల్లడించారు. ఈ కేసు విచారణ సుదీర్ఘకాలం అంటే దాదాపుగా 28 సంవత్సరాలు సాగింది. కేసులో మొత్తం 49 మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే కాలక్రమంలో 17 మంది మరణించారు. నిందితులలో మాజీ ఉప ప్రధాని, బిజెపి కురువృద్ధ నేత ఎల్ కె అద్వానీ ( 92), మురళీమనోహర్ జోషీ (86), ఉమాభారతి , యుపి మాజీ సిఎం ,రాజస్థాన్ మాజీ గవర్నర్ కల్యాణ్ సింగ్ ఇతర ప్రముఖులు ఉన్నారు. వీరంతా నేరపూరిత కుట్రకు దిగి విధ్వంసానికి కరసేవకులను పురిగొల్పారని చెప్పడానికి సరైన సాక్షాధారాలను సిబిఐ పొందుపర్చలేకపోయిందని న్యాయమూర్తి తమ తీర్పులో తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ తీర్పు పట్ల ఉత్కంఠ నెలకొంది. న్యాయస్థానం వెలుపలి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అద్వానీ, జోషీ,ఉమాభారతితో పాటు సంఘ్ పరివార్ నేతలు, రామాలయ నిర్మాణ బాధ్యతలలో ఉన్న ట్రస్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్ట్ ప్రస్తుత సారథి నృత్యగోపాల్‌దాస్, సాధ్వీ రితంబర వంటి కరడుగట్టిన హిందూత్వవాదులు నిందితులుగా ఉండటంతో ఈ కేసులో తీర్పు ఏ విధంగా ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 16వ శతాబ్దపు మసీదును కూల్చేలా కరసేవకులను ఓ పద్ధతి ప్రకారం, వ్యూహాత్మక రీతిలో నిందితులు రెచ్చగొట్టారని, తమ చర్యలు ప్రసంగాలతో వీరిని ఉసికొల్పారని ఈ విధంగా వారు కుట్రకు పాల్పడ్డట్లు సిబిఐ అభియోగపత్రాలను సిద్ధం చేసింది. అయితే ఈ అభియోగపత్రాలను నిరూపించేందుకు సరైన సాక్షాధారాలను సమర్పించలేకపొయ్యారని న్యాయమూర్తి తెలిపారు.

రాజకీయ ప్రతీకార చర్యలలో భాగంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో తమను ఇరికించిందని, కుట్రకు దిగామని అభియోగాలు నమోదు అయ్యేలా చేశారని నిందితులు తమ న్యాయవాదుల ద్వారా తెలియచేసుకున్నారు. తాము నేరం చేశామనడానికి ఎటువంటి ఆధారాలు లేవని వారు తెలిపారు. విచారణ ప్రక్రియ పలు దశలుగా పూర్తి అయిన దశలో తీర్పు సమయంలో ఇప్పుడు ఉన్న 32 మంది నిందితులంతా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని సెప్టెంబర్ 16వ తేదీన న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారు. అయితే వయోభారంతో తాము కోర్టుకు రాలేమని అద్వానీ, జోషీలు తెలియచేసుకున్నారు. ఇక మహంత్ నృత్యగోపాల్ దాస్ తమకు కరోనా వచ్చిందని తెలియచేసుకున్నారు. మాజీ కేంద్ర మంత్రిణి ఉమాభారతి , కల్యాణ్ సింగ్‌లు కరోనాతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. దీనితో వీరంతా తాము కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నట్లు అశక్తత వ్యక్తం చేశారు. అయితే తీర్పు దశలో వీరంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉన్నారు.

కోర్టుకు తీర్పు దశలో హాజరయిన వారిలో సాక్షి మహారాజ్, వినయ్ కటియార్, ధరమ్‌దాస్, పవన్‌పాండే, వేదాంతి, లల్లూసింగ్, చంపత్‌రాయ్‌లతో పాటు ఇతరులు కోర్టు హాల్‌లో ఉన్నారు. ఈ కేసు విచారణ పూర్తి చేసి, తీర్పును సెప్టెంబర్ 30వ తేదీనాటికి వెలువరించాలని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఇంతకు ముందే ఆదేశించింది. ఈ మేరకు ఇప్పుడు తీర్పు వెలువరించారు. నిందితులపై సిబిఐ అభియోగపత్రంలో నేరపూరిత కుట్రకు దిగడం, ఘర్షణలు, దొమ్మికి పాల్పడేలా చేయడం, వివిధ వర్గాల మధ్యవైషమ్యాలు తలెత్తేలా చేయడం, చట్టవ్యతిరేకంగా గుమికూడటం వంటి అభియోగాలు దాఖలు అయ్యాయి.

1992 డిసెంబర్ 6 ఘటన అసంకల్పిత చర్య
ముందస్తు వ్యూహాత్మక చర్య కాదు

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన వెనుక నేరపూరిత కుట్ర ఉందనే వాదన సరికాదని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు. అంతా సంకల్పితంగా, ముందు వేసుకున్న పద్ధతి ప్రకారం వ్యవహరించారని ఎటువంటి ఆధారాలు ఆధారాలు లేకుండా ఎలా చెపుతారని ప్రశ్నించారు. దేశ న్యాయస్థాన చరిత్రలో సుదీర్ఘ విచారణ ఘట్టంగా 28 ఏండ్ల పాటు సాగిన అత్యంత కీలక వ్యాజ్యం, అందులోనూ ఆద్యంతం సున్నితమైన మతపరమైన విశ్వాసాలు ఇమిడి ఉన్న ఈ 28 ఏండ్ల కేసును న్యాయమూర్తి ఎస్‌కె యాదవ్ 28 నిమిషాల కనాన తక్కువ వ్యవధిలో ముగించివేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12.15 గంటలకు తీర్పు వెలువరించారు.

దీనితో ఈ కేసుకు తెరపడినట్లు అయింది. 32 మంది నిందితుల పాత్రను సిబిఐ పేర్కొంటున్నట్లుగా నిరూపితం చేయలేకపోయినట్లు , దోషులు నిర్దోషులను నిర్థారించడానికి అవసరమైన అంశాల ప్రాతిపదికలను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు న్యాయస్థానం తెలిపింది. బాబ్రీ మసీదు కేసు పుష్కరాలు దాటినా కొలిక్కిరాకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చింది. అయోధ్యలో ఇంతకు ముందు మసీదు ఉన్నట్లు చెపుతున్న చోటనే రామమందిరం నిర్మించాల్సి ఉందని పేర్కొంటూ దాదాపు 11 నెలల క్రితం గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఇప్పుడు మసీదు కూల్చివేత ఉదంతపు నిందితులకు ప్రత్యేక న్యాయస్థానం తమ తీర్పులో క్లీన్‌చిట్ ఇచ్చింది.

అయోధ్యవాసుల వాదన పరిగణనలోకి

సుదీర్ఘ విచారణ క్రమంలో ప్రత్యేక న్యాయస్థానం పలుస్థాయిల్లో ఘటనాస్థలి అయిన అయోధ్య నివాసులను విచారించింది. వారి సాక్షాలను పరిగణనలోకి తీసుకుంది. నిందితులు అంటే అద్వానీ కానీ జోషీ కాని ఉమాభారతి కానీ ఇతరులు కానీ కరసేవ సందర్భంగా ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని, అక్కడి కరసేవకులను ఏ విధంగా కూడా ఉసికొల్పలేదని అయోధ్య వాసులు సాక్షాలు చెప్పిన విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి ఈ సందర్భంగా తీర్పులో తెలిపారు. 32 మంది నిందితులను ఈ కేసు నుంచి విముక్తం చేస్తూ నిర్దోషులుగా పేర్కొన్నారని, దీనితో 1992 డిసెంబర్ 6వ తేదీ నాటి సుదీర్ఘ వాయిదాల వ్యాజ్యం కథ ముగిసినట్లే అని లాయర్ మిశ్రా తీర్పు తరువాత తెలిపారు. అద్వానీ, జోషీ, కల్యాణ్‌సింగ్ వంటివారితో పాటు మొత్తం 25 మంది నిందితుల తరఫున ఈ లాయర్ వకాల్తా తీసుకున్నారు. అప్పటి కూల్చివేత ఘటన కేవలం అప్పటికప్పుడు జరిగిన చర్య అని కోర్టు నిర్థిష్టంగా అభిప్రాయపడిందని , కూల్చివేయాలని ముందుగా వ్యూహరచనకు దిగిన చర్య కాదని కోర్టు అభిప్రాయపడ్డట్లు ఈ లాయర్ తెలిపారు.

సిబిఐ వీడియోలు చెల్లలేదు

కూల్చివేతకు సంబంధించి సిబిఐ విచారణల దశలో కొన్ని వీడియోలను న్యాయస్థానానికి అందించింది. అయితే వీటి విశ్వసనీయత ఫోరెన్సిక్ లాబ్‌లో సరైన విధంగా నిర్థారితం కాలేదనే విషయాన్ని జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. దీనితో ఈ వీడియోల సాక్షాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదని తెలిపారు. కేసుకు సంబంధించి దాఖలు చేసిన కొన్ని ఫోటోలను వాటి నెగెటివ్‌లు పొందుపర్చలేకపోవడంతో కోర్టు తిరస్కరించిందని డిఫెన్స్ లాయర్ మనీష్ త్రిపాఠీ తెలిపారు. డిసెంబర్ 6వ తేదీన కరసేవకుల కార్యక్రమం దశలో సమూహంలోకి కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించి ఉంటాయని, వారి వల్లనే అవాంఛనీయ సంఘటనలు జరిగి ఉంటాయని ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్న విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 9వ నెంబర్ సాక్షి అయిన అంజూ గుప్తా తమ సాక్షంలో కరసేవకుల గుంపులోకి అప్పట్లో కొందరు బందిపోట్లు, నేరస్తులు చేరినట్లు తాను గుర్తించానని కోర్టుకు తెలిపారు. అంజూ గుప్తా అప్పట్లో అయోధ్యలో ఘటనాస్థలిలో అదనపు ఎస్‌పిగా విధులలో ఉన్నారు.

కట్టడం వెనుక నుంచి రాళ్లు విసిరారు

కరసేవ పూర్తిగా మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగానే సాగింది. అయితే తరువాత ఉన్నట్లుండి రాళ్లు ఇటుకలు వచ్చిపడ్డాయి. బాబ్రీ మసీదు కట్టడం వెనుక నుంచి పొంచి ఉన్న కొందరు వ్యక్తులు కావాలనే ఈ విధంగా రాళ్లు రప్పలు విసిరినట్లు తేలిందని కోర్టు తెలిపింది. తీర్పు వెలువరించిన న్యాయమూర్తి ఏడాది పదవీకాలపు పొడిగింపు దశలో ఉన్నారు. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ పొడిగింపు దశ ముగిసింది. తీర్పు వెలువరించి రిటైర్ అవుతున్న ఈ న్యాయమూర్తికి పూర్తి స్థాయి అనంతర భద్రతను కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

తీర్పు సవాలుకు సిబిఐ సంప్రదింపులు

ప్రత్యేక న్యాయస్థాన తీర్పును సవాలు చేసే విషయంపై సిబిఐ నిర్ణయం తీసుకుంటుంది. నిందితులంతా నిర్దోషులుగా పేర్కొంటూ వెలువరించిన తీర్పులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. తమ లీగల్ డిపార్ట్‌మెంట్‌తో సంప్రదింపుల తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని బుధవారం సిబిఐ తరఫు న్యాయవాదుల బృందం తెలిపింది. తాము సిబిఐ తీర్పు పాఠాన్ని తెప్పించుకుని దీనిని సిబిఐ ప్రధాన కార్యాలయానికి పంపించడం జరుగుతుందని, తరువాతనే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని సీనియర్ న్యాయవాది లలిత్ సింగ్ తెలిపారు.

రామజన్మభూమి సంకల్పానికి బలమిచ్చే తీర్పు
న్యాయస్థాన తీర్పుపై అద్వానీ జైశ్రీరాం నినాదం

బాబ్రీ మసీదు కూల్చివేత ఘట్టంపై న్యాయస్ధాన తీర్పును సీనియర్ నాయకులు ఎల్‌కె అద్వానీ స్వాగతించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పు దశలో ఆయన హాజరయ్యారు. న్యాయమూర్తి తీర్పు దశలో భావోద్వేగానికి గురయ్యారు. తాను మనస్ఫూర్తిగా తీర్పును స్వాగతిస్తున్నట్లు అద్వానీ స్పందించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తాను, బిజెపి ప్రదర్శించిన అంకితభావం సరైనదే అనే విషయాన్ని తీర్పు ధృవీకరించిందని తెలిపారు. రామాలయ నిర్మాణం ఓ ఉద్యమంగా సాగిందని, దీనికి తాను బిజెపి ఇతర భావసారూప్య శక్తులు కట్టుబడి వ్యవహరించామని, దీనికి సానుకూలంగానే ఇప్పుడు ఈ తీర్పు వెలువడిందన్నారు. తీర్పు వెలువడగానే అద్వానీ జైశ్రీరాం అంటూ నినదించారు . అయోధ్యలో రామమందిర నిర్మాణపు కలకు మరో ముందడుగు అన్నారు.

కుట్రలేదని తేల్చిచెప్పారు ః జోషీ

అయోధ్యలో డిసెంబర్ 6 నాటి ఘటనలో ఎటువంటి ఉద్ధేశపూరిత కుట్ర జరగలేదని ఇప్పటి తీర్పు స్పష్టం చేసిందని బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు చారిత్రాత్మకం అని స్పందించారు. రామాలయ నిర్మాణ లక్షంతో సాగించిన రథయాత్రలు, కరసేవలు అన్ని కూడా కుట్రలో భాగం కావని తెలియచేస్తూ తీర్పు వచ్చిందని తెలిపారు. దీనిని తాను స్వాగతిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు రామమందిర నిర్మాణ ప్రక్రియలో నూతనోత్తేజం నెలకొంటుందని తెలిపారు.

సత్యమేవ జయతే ః యోగి ఆదిత్యానాథ్

ప్రస్తుత తీర్పుతో న్యాయం అంతకు మించి సత్యం గెలిచిందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. సత్యం నినదించిందన్నారు. లక్నోలో ఆయన ఈ తీర్పు తరువాత స్పందించారు. తీర్పు వెలువడగానే సిఎం బిజెపి ప్రముఖులు అద్వానీ, జోషీలతో ఫోన్‌లో మాట్లాడినట్లు, వారిని తీర్పు నేపథ్యంలో అభినందించినట్లు సిఎం సలహాదారు మృత్యుంజయ్ కుమార్ తెలిపారు.

జరిగిందేమిటో తెలిసిందే ః కక్షిదారు ఇక్బాల్ అన్సారీ

అయోధ్యలో ఆ డిసెంబర్‌లో ఏమి జరిగిందనేది అందరికీ తెలిసిందేనని అయోధ్య స్థలవివాదంలో ప్రముఖ కక్షిదారు అయిన ఇక్బాల్ అన్సారీ వ్యాఖ్యానించారు. ప్రపంచానికి 1992 డిసెంబర్ 6వ తేదీన జరిగిందేమిటనేది క్షుణ్ణంగా తెలుసునని , అయితే ఎవరైనా కోర్టు తీర్పును గౌరవించాల్సిందే అన్నారు. హిందూ ముస్లింల ఐక్యత, దేశ ప్రయోజనాల నేపథ్యంలో ఇంతటితో ఈ కేసును ముగించివేసి, నిందితులను నిర్దోషులుగా వదిలివేయాల్సి ఉందని ఈ నెలలోనే సిబిఐ కోర్టుకు అన్సారీ విజ్ఞప్తి చేశారు. గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించామని, ఇప్పుడు ఈ తీర్పునకు కట్టుబడి ఉంటామని , దీనిని వ్యతిరేకించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయోధ్య శాంతిని కోరుకోంటోందని, దీనికే తాము విలువ నిస్తామని తెలిపారు.

అభ్యంతరకర తీర్పు ః ఒవైసీ

నిందితులు అంతా నిర్దోషులుగా పేర్కొంటూ బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు వెలువడటం పట్ల హైదరాబాద్ ఎంపి, ఆలిండియా మజ్టిస్ ఓ ఇత్తేహాదుల్ ముస్లేమాన్ (ఎఐఎంఐఎం) అధినేత అసదుద్దిన్ ఒవైసీ విమర్శించారు. తీర్పు అసమంజసంగా ఉందన్నారు. సిబిఐ ఈ తీర్పును తగు విధంగా ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయాల్సి ఉందన్నారు. ఈ తీర్పుతో కేవలం హిందూత్వవాదుల సమిష్టి భావజాలం, సదరు సిద్ధాంతకర్తల మనోభావాలు సంతోషిస్తాయని, కుట్ర లేదని కోర్టు తీర్పు ఇవ్వడం ఎలా చేస్తారని ఆయన విలేకరుల వద్ద ప్రశ్నించారు. ఏదైనా అద్భుతం లేదా మాయ జరిగి అక్కడ మసీదు కూలిందా? అక్కడికి అంతమంది ఏ విధంగా చేరారు? వారు అక్కడికి చేరేలా ఎవరు చేశారు? వీటిన్నింటికీ సరైన సమాధానాలు లేకుండానే తీర్పు వెలువరించడం అసందర్బంగా ఉందని తేల్చిచెప్పారు.

తీర్పుపై హైకోర్టుకు వెళ్లుతాం ః పర్సనల్ లాబోర్డు

ఇప్పటితీర్పు అసమగ్రంగా ఉందని, దీనిపై తాము ఉత్తరప్రదేశ్ హైకోర్టులో అప్పీలు చేస్తామని ఆలిండియా పర్సనల్ లా బోర్డు సభ్యులు, లాయర్ జఫరాయబ్ జిలానీ ప్రకటించారు. పర్సనల్ లా బోర్డు కక్షిదారుగా ఉంటుందని తెలిపారు. కట్టడం కూల్చివేత తరువాత స్వీట్లు పంచుకున్నారు. ఫోటోలు కూడా వెలువడ్డాయి. మరి కుట్ర లేదని ఏ విధంగా చెపుతారని ప్రశ్నించారు.

న్యాయద్రోహమిది ఃసిపిఎం

ఈ తీర్పు వెలువరింతకు 28 ఏండ్లు తీసుకుంటారా? అని సిపిఎం ప్రశ్నించింది. న్యాయచట్టానికి భంగం వాటిల్లేలా నిందితులకు క్లీన్‌చిట్ ఇచ్చారని విమర్శించింది. సుదీర్ఘ తీర్పుతో న్యాయం వెలువడలేదని తెలిపారు. ఘటనాస్థలిలో ఉన్న బిజెపి, విహెచ్‌పి పరివార్ నేతలంతా అక్కడ నేరపూరిత చర్యకు ఆదేశాలిస్తూ ఉండగా అంతా చూశారని ఇప్పుడు కోర్టు ఈ తీర్పుతో వారిని అమాయకులని నిర్దోషులని తేల్చిందని పార్టీ విమర్శించింది.

సంఘటితానికి సమయమిదే ః ఆర్‌ఎస్‌ఎస్ భయ్యా

ప్రస్తుత తీర్పు హర్షదాయకం అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యా వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతోసమాజంలోని అన్ని వర్గాలు సమైక్యంగా సామరస్యంతో వ్యవహరించి, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను తిప్పికొట్టాల్సి ఉందని, ఈ అవసరాన్ని ఈ కీలక తీర్పు గుర్తు చేసిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఓ అంకం ముగిసిందని, ఇక దేశం ముందు ఏ తగవు ఉండదని తెలిపారు.

ఇదో న్యాయవిస్మయం ః ముస్లిం లీగ్

ఈ కేసుకు సంబంధించి జరిగిన న్యాయం ఇదా అని అంతా విస్తుపోతున్నారని ఇండియన్ ముస్లింలీగ్ ఎంపి పికె కున్హలికుట్టి వ్యాఖ్యానించారు. అయోధ్యలో చట్టవ్యతిరేక ఘటన జరిగిందని సుప్రీంకోర్టు పేర్కొందని, సిబిఐ కూడా అక్కడేదో జరిగిందని పేర్కొందని అయితే ఇప్పుడు తీర్పు విధంగా వచ్చిందని,దీనిని బట్టి న్యాయం జరిగినట్లుగా భావించాల్సి ఉంటుందా? అని ఎంపి విస్తుపొయ్యారు. తీర్పును తాము ఆక్షేపించడం లేదని, అయితే తీర్పునకు వ్యతిరేకంగా వెళ్లాల్సిన బాధ్యత సిబిఐపై ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద అక్కడ మసీదు ఉందని చెప్పకనే చెప్పారని తెలిపారు.

సుప్రీంకోర్టును కాదనేలా తీర్పు ః కాంగ్రెస్

ప్రస్తుత తీర్పు సుప్రీంకోర్టు అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులోని అంశాలకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ విమర్శించింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ తీర్పు ఉందని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడికి రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం ఉందని, ఈ దశలో కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వం (యుపి) తీర్పునకు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉందని పిలుపు నిచ్చారు.

కుట్రలేదని చెప్పడం మంచి పరిణామం ః శివసేన

ప్రస్తుత తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు శివసేన తెలిపింది. అయోధ్యలో అప్పటి ఘటనలో ఎటువంటి కుట్రలేదని తీర్పు వెలువడటం గణనీయ పరిణామం అని , అద్వానీ ఇతర నేతలకు అభినందనలు అని శివసేన నేత ఎస్ రౌత్ స్పందించారు.

2000 పేజీల తీర్పులో కీలక అంశాలు

బుధవారం నాటి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఏకంగా 2000 పేజీలతో సాగింది. ఇందులో పలు అంశాలు ప్రస్తావించారు. ఇవే అవిః

1 కూల్చివేత ఘటన ముందస్తు వ్యూహంతో సాగలేదు. నిందితులు నిజానికి గుంపును నివారించేందుకు యత్నించారు.

 

2 గుమ్మటం ఎక్కిన వారే సంఘు విద్రోహశక్తులు.వారు , కట్టడం వెనుక ఉన్న వారే రాళ్లు రప్పలు విసిరారు

3 సిబిఐ సమర్పించిన వీడియోలు ఫోటోల విశ్వసనీయత సరిగ్గా లేదు. వీటిని నిరూపించలేకపొయ్యారు.

4 ) అప్పటి డిసెంబర్ 6 ఘటనల దశలో కొన్ని అసాంఘిక శక్తులు చొచ్చుకుని వెళ్లుతాయని, దీనితో ఘర్షణలకు వీలుందని ముందుగానే స్థానిక ఇంటలిజెన్స్ వర్గాలు ఉప్పందించాయి.

5 ) కూల్చివేత సంకల్పితం కాదు. ఇక కుట్రపూరిత చర్యగా పరిగణించడానికి వీల్లేదు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News