Home తాజా వార్తలు కాకతీయకు సిబిఐపి పురస్కారం

కాకతీయకు సిబిఐపి పురస్కారం

CBIP award for Mission Kakatiya

 

సమీకృత జల నిర్వహణలో
అద్భుత పథకంగా ప్రశంస

కేంద్రమంత్రి చేతులమీదుగా అందుకున్న సిఇ శ్యాంసుందర్

మన తెలంగాణ/న్యూఢిల్లీ, హైదరాబాద్: సమీకృత జలనిర్వహణలో విజయవంతమైన పథకంగా ‘మిషన్ కాకతీయ’కు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సిబిఐపి)పురస్కారాన్ని ప్రదానం చేసింది. డిల్లీలో ‘స్కోప్’ కాంప్లెక్స్‌లో శుక్రవారం రాత్రి జరిగిన 91వ సిబిఐపి దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని చిన్న నీటి వనరుల (మైనర్ ఇరిగేషన్) చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్ కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్, కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ చేతుల మీదుగా అందుకున్నారు. జాతీయ స్థాయిలో నీరు, విద్యుత్, భూమి సమర్థ నిర్వహణతో పాటు, వృధాను అరికట్టడం, పొదుపును ప్రోత్సహించడం, ఫలితాలు క్షేత్రస్థాయికి చేరి, ప్రజల సామాజిక, ఆర్ధిక జీవనంలో మార్పులు రావడం వంటి పలు అంశాలపై ఆధారపడి, ఉత్తమ ఫలితాలు తెచ్చిన సంస్థలను, పథకాలను సిబిఐపి అవార్డుతో ప్రతి ఏటా సత్కరిస్తుంది.

ఇందులో భాగంగా తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ కాకతీయ’ పేరుతో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమానికి సిబిఐపి ‘ఎక్సెలెన్స్ ఇన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్’ అవార్డు వచ్చింది. ఇదే వేదికపై సమీకృత నీటి వనరులు, భూమి అభివృద్ధికి కేంద్ర జలవనరుల శాఖ చేపట్టిన జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టుకు కూడా అవార్డు లభించింది. పోలవరం ప్రాజెక్టు ఉత్తమ ప్రణాళిక, నిర్మాణానికిగాను ఎపి జలవనరుల శాఖకు, వ్యాప్కోస్‌కు, పారిశ్రామికపరంగా నీటి నిర్వహణకు కృషిచేస్తున్న ‘నెటాఫిమ్’ సంస్థకు, పురస్కారాలు దక్కాయి. కేంద్ర జలవనరుల శాఖ మాజీ కార్యదర్శి అమర్‌జిత్ సింగ్‌కు జీవనకాల సాఫల్య పురస్కారాన్ని వ్యక్తిగత హోదాలో అందజేశారు. ఎపికి లభించిన పురస్కారాన్ని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎపి ఇఎన్‌సి వెంకటేశ్వరరావు తీసుకున్నారు.

‘మిషన్ కాకతీయ’ ఉత్తమ ఫలితాలకే ఈ అవార్డు : సిబిఐపి ఉపాధ్యక్షుడు
సాగునీటి రంగంలో విశేష కృషిచేసి దేశంలోనే తెలంగాణ మైనర్ ఇరిగేషన్ అగ్రగామిగా నిలిచిందని, చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్‌ను ‘సిబిఐపి ఎక్సెలెన్స్’ అవార్డుకుఎంపిక చేసినట్లు సిబిఐపి ఉపాధ్యక్షుడు మసూద్ హుస్సేన్ ప్రకటించారు. నీటిపారుదల నిల్వలు, సరస్సుల పునరుద్ధరణ విభాగంలో ఉత్తమ ఫలితాలు సాధించిందని, అందువల్లనే ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అవార్డు ప్రదానం చేసినట్లు వ్యాఖ్యానించారు.

సిఎం కెసిఆర్ దూరదృష్టికి లభించిన గుర్తింపు ఇది
అవార్డును అందుకున్న అనంతరం రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్ మీడియాతో మాట్లాడుతూ, మార్చి 12, 2015న కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో ‘మిషన్ కాకతీయ’ పథకానికి ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేశారని, ఇంతటి అద్భుత ఫలితాలు సాధించి రైతులకు ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించి ఇప్పుడు ‘ఎక్సెలెన్స్’ అవార్డు అందుకోవడం ఆయన దూరదృష్టికి నిదర్శమని, ఆ గుర్తింపు కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామీణ జీవనాన్ని బలోపేతం చేసే దిశలో సిఎం కెసిఆర్ ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారని, మిషన్ కాకతీయ సాధిస్తోన్న విజయాలను తెలుసుకునేందుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వాలు అసక్తి చూపించాయని గుర్తుచేశారు. ఈ పథకం కింద సుమారు రూ. 8,700 కోట్లతో 27,167 చెరువుల పునఃరుద్ధరణ పనులు జరిగాయని, భూగర్భ జలాల నిల్వలు పెరిగాయని తెలిపారు. చెరువుల్లో నీరు ఇంకిపోయే సామర్థ్యం 4 నుంచి 7 రోజులు పెరిగిందని, చెరువు పూడిక తీసిన మట్టి తరలింపులో దాదాపు రూ. 900 కోట్లు ప్రభుత్వం ఆదా చేయగలిగిందని శ్యాంసుందర్ తెలిపారు.

CBIP award for Mission Kakatiya

Telangana Latest News